Wednesday, December 17, 2008
కొత్త బంగారు లోకంలో..
మొత్తానికి మిక్కి J మాయర్ నిలదొక్కుకునే మ్యూజిక్ డైరెక్టర్ లాగానే కనిపిస్తున్నాడు నాకు. హ్యాపీ డేస్ లో కొన్ని పాటలకి ఒకే బాణీని ఉపయోగించినా వెరైటీ చూపించాడు. కొత్త బంగారు లోకంలో మాత్రం అన్ని పాటలు వినసొంపుగానే వున్నాయి (కొన్ని సంగీతం, సాహిత్యం రెండూ బాగుంటే, మరికొన్ని సంగీతమే). "కళాశాలలో" పాట ఏ అనంతశ్రీరాంకో, రామజోగయ్యశాస్త్రికో ఇవ్వాల్సింది అనిపించింది. డైరెక్టర్ తన సినిమాలో పాటలు తనే రాసెయ్యడం అనే ప్రయత్నం మంచిదే కాని, ఏదో లోటుగా అనిపించాయి లిరిక్స్. "కంఫ్యూజన్" లో మిక్కి కూడా అనవసరంగా గొంతు కలిపినట్టుగా తోచింది (ముఖ్యంగా "కంఫ్యూజన్, కంఫ్యూజన్" అంటూ అనవసరంగా చెవి కోసినట్టు అరవడం దగ్గర :) ). మిగిలిన పాటలు మాత్రం వేటికవే చాలా బాగున్నాయనడంలో సందేహం లేదు. అవన్నీ మంచి సంగీత, గొప్ప సాహిత్య, శుద్ధ గాత్రాల మేలుకలయిక లాగా కుదిరాయి. చాల రోజుల తరవాత సీతారామశాస్త్రి గారికి ఒక ఫుల్ లెంగ్త్ "వేదాంతం" వినిపించే పాట దొరికింది ("నీ ప్రశ్నలు నీవే" - లో). ఆయన గొప్పతనం ఏమిటంటే, అంతకు ముందు ఇచ్చిన ఏ ఉపమానం కూడా మళ్ళీ ఇవ్వకుండా "ఔరా" అనిపించేలా చెయ్యడం. మళ్ళీ ఇదే ఆల్బంలో చూస్తే "OK అనేశా" అనే పాట ఎంత జాలీగా రాసేసారో చూడండి. నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాలి. అనంతశ్రీరామ్ కూడా దగ్గరలోనే మరింత మంచి సాహిత్యం రాయబోయే సినీకవుల్లో చేరతానని "నిజంగా నేనేనా"లో ప్రకటించాడు. ఈ బంగారానికి తావి మాత్రం కార్తీక్ అద్దాడు తన మధురమైన గాత్రంతో ("నిజంగా నేనేనా" మచ్చుకి).
(కొనుక్కొని) తప్పక వినాల్సిన పాటలు ఇవి.
Thursday, August 28, 2008
ఆయన స్టైలే వేరు
కలెక్టర్ కూడా సామాన్య ఆసుపత్రికే (ఈనాడు తూర్పు గోదావరి లో ఈ రోజు వచ్చిన కధనం - కొంచెం కూర్పు జరిగింది - విషయం మాత్రం అదే)."
అది కాకినాడ సర్వజన ఆసుపత్రి. సమయం మధ్యాహ్నం 12:30జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది వాహనం మెయిన్ గేటు ద్వారా ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం వద్దకు వచ్చి ఆగింది. ఇది గమనించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పరుగులు తీసారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారేమోనని బెంబేలెత్తారు. ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమవుతున్న వైద్యులు, సిబ్బంది కూడా లోపలకి వెనుదిరిగారు.
ఇంతలొ ఆ వాహనం నుంచి కలెక్టర్తో సహా మరో వృద్ధ జంట దిగింది. కలెక్టర్ వెంటే నడుస్తూ 18 వ నెంబర్ లో వున్న కంటి చికిత్సా విభాగానికి చేరుకున్నారు.మరోపక్క ఆసుపత్రి అధికారులు కలెక్టర్ ఎక్కడున్నారోనని వెదుకులాట మొదలుపెట్టారు. కలెక్టర్ మాత్రం తన వెంట వచ్చిన వృద్ధ దంపతులకు వైద్య పరీక్షలకోసం ఔట్ పేషెంట్ లో పేర్లు నమోదు చెయ్యాలని సిబ్బందిని కోరారు. ఆ దంపతులు తమపేర్లు హరివంశి ద్వివేది, తారాదేవి ద్వివేది గా వైద్యులకు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలెక్టర్ తమ తల్లితండ్రులనే ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. దీంతో వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దంత వైద్య విభాగానికి వెళ్లి అక్కడ కూడా దంత పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు కలెక్టర్ పనిలో పనిగా అక్కడ వున్నా కొందరు రోగుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు."
"ఆ.. కలెక్టర్ కదా.. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినా వైద్యం సరిగ్గానే చేస్తారు" - అనే పెస్సిమిస్ట్ వాళ్ళకి ఇంక చెప్పేది ఏమి లేదు గాని, నాకు మాత్రం ఆయన చేసిన దానిలో మంచి ఆదర్శం కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలో తప్ప చదివించని ఈ రోజుల్లో, ఒక ప్రభుత్వాధికారి తన ఆరోగ్యావసరాలకి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడం మిగిలిన వారికి మార్గదర్శకంగా పనికివస్తుంది. అసలు అందరు అధికారులు, నాయకులు ఇలా తమ అవసరాలకోసం ప్రభుత్వాసుపత్రులకి వస్తే, అక్కడి పరిస్థితులు ఇట్టే మెరుగుపడతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. పనిలో పనిగా వాళ్ళకి సామాన్య ప్రజల అవసరాలు ఏమిటో, వారు పడే కష్టాలు ఏమిటో వేరే ఎవరూ చెప్పక్కర్లేకుండా అవగతమవుతాయి. అక్కడ పని చేసి డాక్టర్లు, సిబ్బంది కూడా అప్రమత్తం గా వుంటూ వల్ల విధిని సరిగా నిర్వహిస్తారని భావించవచ్చు..
Friday, August 1, 2008
పిల్లలకి ఎత్తు మప్పడం, పేర్లు పెట్టడం
మప్పడం = నేర్పడం (అటూ ఇటూ గా)
ఇది ఈమధ్యే మాకు అనుభవంలోకి వస్తోంది. పిల్లవాడిని తీసుకొని (అంటే ఎత్తుకొని) ఎక్కడికి వెళ్ళినా, ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలూ అయ్యాక, చాలా మంది (particular గా ఇప్పటికే మూడు నాలుగు ఏళ్ళ వయసు గల పిల్లలు వున్నవాళ్ళు) అడుగుతూ వుంటారు.. "ఆ .. ఏమిటీ.. మీ వాడికి ఎత్తు అలవాటు అయిపోయిందా" అంటూ. మొదట, ఎత్తు అలవాటు అయిందో లేదో మనం కలిసిన పది పదిహేను నిముషాలలో ఎలాగూ తెలియదు (అది వాళ్ళ గెస్ మాత్రమె) - రెండోది, ఎత్తుకోవడం ఏదో పెద్ద అపరాధం అయినట్టు, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పిల్లలని ఎత్తుకొని మొయ్యనట్టూ, ఎత్తుకోవడం అంటే వాళ్ళకి దొంగతనం నేర్పడం అంత పాపం అయినట్టూ అడుగుతారు :). ఎవరో మావాడు పుట్టిన మొదట్లో అన్నారు, కొంచెం వయసు వస్తే పిల్లలకి వ్యాపకాలు ఎక్కువ అయి (ఇది మంచిదే మరి) మన దగ్గర ఎక్కువసేపు కుదురుగా ఎలాగూ కూర్చోరు.. ఈ మొదటి ఒకటి రెండు ఏళ్ళలోనే వాళ్ళని తనివి తీరా దగ్గరకి తీసుకొని ఉంచుకోవాలి అని. అందులో నిజం ఎంత వున్నా, ఈ వయసులో తల్లితండ్రులే కాకుండా ఎవరు ఎత్తుకున్నా ఆ మానవ స్పర్శ వాళ్ళలో సురక్షాత్మక భావనను కలిగిస్తుంది. అంతవరకు ఎందుకు? మేమిద్దరం కూర్చొని వాడిని మధ్యలో వుంచి రెండు బొమ్మలు ఇస్తే, వాడు మా మీద ఎక్కి తొక్కుతూ, బోర్లా పడుతూ, లేస్తూ, గంటలు గంటలు అక్కడే ఆడుకుంటుంటాడు (మిగిలిన సమయాల్లో పతుక్కునే అలమారాలు, టీవీస్టాండ్లు అవీ అప్పుడు వాడికి అసలు గుర్తుకి రావు). అందుకే, ఎవరైనా "ఎత్తు అలవాటు అయిందా మీ వాడికి" అని అడిగితే, "లేదు.. మేమే మప్పాము" అని చెప్పదలచుకున్నాము :).
ఇంకో విషయం ఇక్కడ అమెరికా లో ఉండేవాళ్ళకి ఎక్కువ అనుభవం లోకి వచ్చేది: మొన్న మా ఆఫీసులో నాతో బాటు పనిచేసే ఒక తమిళ కుర్రాడు అమెరికన్స్ cube లు అన్నింటికీ వెడుతూ వాళ్ళని ఏదో అడగడం కనిపించింది. ఏమిట్రా అని ఆరా తీద్దును కదా.. వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టబోతోందిట.. ఆ అమ్మాయికి ఏ పేరు పెడితే అమెరికన్లు సులువుగా పలకగలరో చూద్దామని అందరి దగ్గరకీ వెళ్లి వాళ్ళు అనుకుంటున్న పేర్లు చెప్పి అది వాళ్ళు ఎలా పలుకుతారో టెస్టు చేస్తున్నాడుట.. వాళ్ల ఆవిడ "మృదుల" అని పెడదామని, వీడేమో, అది అమెరికన్స్ కి కష్టం గా వుంటుంది .. సింపుల్ గా "రియా" అని పెట్టేద్దాము అని కొట్టుకుంటున్నాము అని చెప్పాడు. వెంటనే "ఒరే.. నీకు పిచ్చా వెర్రా" అని అడిగేద్దాము అనిపించింది. వాడికి తెలుగు రాక, నాకు తమిళం రాక, ఇంగ్లీష్ లో అంత effect వుండకపోవడం చేత అది అడగడం జరగలేదు అనుకోండి. కాని, ఇలాంటివి చాలామంది చేస్తూ వుంటారు. మన సంస్కృతి, అభిరుచి, ఇష్టానికి తగ్గట్టు మనం పేరు పెట్టుకోవాలి గానీ, వాడెవడో పలకగలిగేలా పెట్టుకోవాలి అని ఎందుకు అనుకోవడం? రేపు పొద్దున్న ఈ కంప్యూటర్ లు కూలిపోయి, ఆయిల్ రేట్ పెరిగిపోయి అందరికీ అరబ్బు దేశాల్లో వుద్యోగాలు వచ్చేస్తే అక్కడ వాళ్ళు పలకడం కష్టం అయిపోతుంది అని కూతురి పేరు మార్చేస్తాడా అనిపించింది. వేరే భాషలోకి (ముఖ్యం గా ఇంగ్లీష్) మార్చినప్పుడు పెడర్ధాలు వచ్చేలాగ పెట్టకుండా చూసుకుంటే చాలు అని నా ఉద్దేశ్యం. ఈ బానిస మనస్తత్వం మనకే వుంటుందేమో అని ఒక చిన్న భయం కూడా. ఇతర దేశాల వాళ్లు ఎవరూ కూడా పేరు పెట్టేముందు అమెరికన్స్ ని consult చెయ్యడం నేను చూడలేదు. తరవాత మా మేనేజర్ వచ్చి ఈ విషయం అంత చూసి ఫెళ్ళున నవ్వి, "ఇందులో ఇంత కష్టం ఏమి ఉంది" అంటూ, వొత్తుల మరియు హల్లుల భూయిష్టమైన నా మొత్తం పేరుని ఒక్క గుక్కలో సింపుల్ గా చెప్పెయ్యడం ఈ కధ కి కొస మెరుపు!.
Friday, July 25, 2008
బొమ్మరిల్లు లో ఆంగ్లగోల
కానీ, నాకు ఈ ప్రోగ్రాం లో చిర్రెత్తుకొని వచ్చే అంశం ఒకటి వుందండోయ్. అదే "మన" వాళ్ల ఆంగ్ల భాషా దుర్వినియోగం (అంటే, అవసరం అయిన దానికంటే, చాల ఎక్కువగా మాట్లాడడం). ఏదో కొంచెం ఇస్త్రి చేసిన షర్టు వేసుకొని కాస్త ప్యాంటు, బూట్ వేసుకొని, మరకలు లేని కళ్ళజోడు మొహానికి తగిలించుకోగానే, ఎక్కడినుంచో దిగివచ్చినట్టు, తెలుగంటే ఏమిటో తెలియనట్టు, "this", "this" అనుకుంటూ వచ్చీరాని (అన్నీ గ్రామర్ తప్పులే మళ్ళీ) ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించడం. ఇందులో మగ/ఆడ అని లేదు. అందరికీ ఇదే జబ్బు. మళ్ళీ తమ టీం మేట్స్ తో గొణగడానికి మాత్రం తెలుగు పనికివస్తుంది "ఆన్సర్ అదే అంటావా" అనో, "ఇది చెప్పేద్దాం" అనో కూసే కూతలు మాత్రం మైక్ లో గుస గుసగా వినిపిస్తూనే వుంటాయి. నాకు అన్నింటికంటే అసహ్యం కలిగించే సందర్భం మాత్రం సుహాసిని ఏదైనా అడిగినప్పుడు వీళ్ళ ప్రవర్తన!. ఆవిడ ఆంధ్ర లో పుట్టకపోయినా, తెలుగు మాతృభాష కాకపోయినా, తెలుగు ప్రోగ్రాం అనే స్పృహ తో ఏది మాట్లాడినా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దానికి కూడా ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవాడిని ఆంధ్ర లోంచి వెళ్ళగొట్టి సముద్రంలో పారెయ్యాలి - అప్పుడైనా "అమ్మా" అని తెలుగులో అరుస్తాడో లేదో చూడాలి. అది నాకు నిజంగా కంపరం కలిగిస్తుంది. తల్లి తన హోదాకు తగ్గట్టు లేదని ఆమెను పనిమనిషిగా పరిచయం చేసిన పాపాత్ముల కధలు వింటుంటాము. వాళ్ళకి వీళ్ళు ఏమాత్రం తీసిపోరు. ఇటువంటి ఘనులని చూసి వాళ్ళ పిల్లలు ఏమి నేర్చుకుంటారో గ్రహించడం పెద్ద కష్టం ఏమీ కాదు.
ఇది వ్రాసి కొద్ది రోజులయింది.. ఈలోగా, ఒక రోజు బొమ్మరిల్లులో వరుణ్ సందేశ్ (హ్యాపీ డేస్ చందు) వచ్చాడు శేఖర్ కమ్ములతో. అదే రోజో, ఆ ముందు రోజో, ఏదో సుత్తి ఇంటర్వ్యూ కోసం రాహుల్ (హ్యాపీ డేస్ టైసన్) కూడా (రైన్బో సినిమా కోసం). వరుణ్, తను పుట్టిన నాలుగేళ్ల తరవాత అమెరికా వెళ్లి మళ్ళీ హ్యాపీ డేస్ కోసం ఇండియా వచ్చాడుట (మధ్యలో వస్తూ పోతూ వున్నా, ఎక్కువ కాలం వున్నది హ్యాపీ డేస్ కే). బొమ్మరిల్లులో శేఖర్ ఐనా తెలుగు మాట్లాడడానికి తడుముకున్నాడేమో తెలియదు గానీ, వరుణ్ మాత్రం చక్కని తెలుగు మాట్లాడేడు. ఇంకోపక్క రాహుల్ మాత్రం మొత్తం ఇంటర్వ్యూ అంతా ఇంటర్వ్యూ చేసే అమ్మాయి తెలుగులో ఎన్ని అడిగినా, ప్రతీ దానికి వచ్చీ రాని ఇంగ్లీష్ తప్ప తెలుగు ముక్క బయటపడనివ్వలేదు. ఎంత తేడా?
Friday, July 18, 2008
సెన్సార్ కత్తెర
Monday, July 7, 2008
సిరివెన్నె(ఎ)లా?
ये जिंदगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగీ ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
चल चकदे चकदे అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ
వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి
అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ...
ఆగండాగండి.. సీతారామ శాస్త్రి గారు.. ఏమిటండీ ఇది? "dont worry be happy" అనే వాక్యాన్ని తెలుగు అనుకోమంటారా (మళ్ళీ "మన" తెలుగు అని కూడా అన్నారు)? మీరు రాసింది త్రివిక్రమ్ తిరగారాశాడా లేక దేవిశ్రీ దిద్దుబాటు చేశాడా లేక మీకే అలా అనిపించిందా?? బాగుంది!! :).
Saturday, June 21, 2008
తల్లి పాలు.
అలాగే, "పథ్యం" పాటించడం. ఆ పండు తింటే జలుబు చేస్తుందనో, ఈ పప్పు తింటే అరగదు, చీము పడుతుంది అనో, పాలు తాగితే ఇంకోటనో, తల్లి కి ఏమీ పెట్టకుండా మాడుస్తారు. నిజానికి ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా పర్లేదు గానీ, పిల్లకి పాలిస్తున్న తల్లి కడుపు నిండా సంపూర్ణాహారం తినడం ఎంతో ముఖ్యం. నిజమే, పురుడు వచ్చిన మొదటి ఒకటి రెండు రోజుల్లో తినాలని లేకపోయినా, సిజేరియన్ లాంటి సందర్భాల్లో డాక్టర్ లు ఒకటి రెండు రోజులు తినవద్దని చెప్పినా పరవాలేదు గాని, పథ్యం వెర్రి తలలు వేసి, ఆరు నెలలు, ఏడాది పాటు తల్లికి ఏమీ పెట్టకుండా, పిల్ల కి ఇవ్వడానికి పాలు కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయి? ఇంక అక్కడ నుంచి "బిడ్డ కి ఇవ్వడానికి పాలు రావట్లేదు" అని తల్లిని తక్కువ చెయ్యడమో, పాలు పడడం కోసం మందులు వాడడం మొదలు పెట్టడమో చేసేకంటే, తల్లికి సరైన ఆహారం పెడితే జరగాల్సిన విషయాన్ని సృష్టే చూస్తుకుంటుంది అనే ఇంగితం కరువవుతోంది మన వాళ్ళకి. కొన్ని ప్రదేశాలలో తల్లికి పాలు ఇస్తే బిడ్డకి మంచిది కాదు అని, కాఫీ తప్ప మరోటి తాగనివ్వరట. ఎంత అన్యాయం! పిచ్చి నమ్మకాలు ఎలా ఉంటాయంటే భోజనం తరువాత తల్లి నిద్ర పొతే "మంచిది కాదు" అని పడుకోనివ్వకుండా మనుషులు కాపలా కూర్చోవడం! డెలివరీ అయ్యాక నీరసం, అసహనం, డిప్రెషన్, నిద్రలేమి లాంటి వాటితో బాలింతరాలు బాధపడుతూ ఉంటుంది. ఈ సయమం లో సరైన భోజనం, కంటినిండా నిద్ర ఎంతైనా అవసరం.ఇక్కడ డెలివరీ అయిన తరవాత వెంటనే తినడానికి బీన్సు, ఉడికించిన బంగాల దుంపలు అవీ ఇస్తారు (వ్యాఖ్యల్లో రాధిక గారు చెప్పినట్టు). ఆరెంజి జ్యూస్, పాలు లాంటివి సర్వ సాధారణం. నా డెలివరీ తరవాత అదే హాస్పిటల్లో పనిచేసే తెలుగు డాక్టర్ని అడిగితే పప్పులు, కూరలతో బాటు ఏమి తిన్నా పరవాలేదు అని చెప్పారు. అది నిజం కూడా. ప్రెగ్నన్సీలో బొప్పాయి తినవద్దని, గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ (ఇది మన దగ్గర (ఇండియా లో) దొరుకుతుందో లేదో తెలియదు) తాగవద్దని ఐతే మాత్రం చెప్పారు. అవి తాగడం వల్ల దోషం వుందని నిరూపించబడలేదు గాని, వాటిలో ప్రెగ్నన్సీ కి వ్యతిరేకం గా పని చేసే ingredients ఉండవచ్చని అంటారని చెప్పారు. ఒకసారి డెలివరీ అయిన తరవాత ఇంక తినదగిన వస్తువులు, తినకూడని వస్తువులు అంటూ ఏమీ లేవు. ఇష్టం ఐనవి ఏమైనా తినొచ్చు. కాకపోతే తల్లి వద్ద నుంచి పిల్లలకి పాలు వెడతాయి కాబట్టి, మనం తినే వాటిని బట్టి పిల్లలు effect అయే అవకాశం ఉంది. అందుకని, పిల్లలు మామూలు కంటే ఎక్కువగా ఏడుస్తున్నా, వాళ్ళకి విరేచనం రెగ్యులర్ గా అవకపోయినా, మనం ఏమి తిన్నాము అని కూడా (పిల్లల) డాక్టర్ లు అడుగుతారు. కానీ, వాళ్ళ ఆ ప్రవర్తన కి ఇది ఒక్కటే కారణంగా పరిగణించడం జరగదు. చాలా సార్లు వాటి రెంటికీ సంబంధం ఉండదు కూడా. ప్రెగ్నంట్ గా వున్నప్పుడు చెప్పిన సూత్రమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇద్దరి కోసం తినాలి కదా అని ఎక్కువ తినడం సరికాదు. బలవర్ధకమైన పోషకాహారం తినడం, వ్యాయామాన్ని ఎంత తొందరగా వీలు ఐతే అంత తొందరగా తిరిగి మొదలు పెట్టడం (ఇది మాత్రం కొత్తగా తల్లి ఐన వారికి చాల కష్టం అనిపిస్తుంది - రోజులో వంద గంటలు వున్నా సరిపోని పని వుంటుంది పిల్లలతో - ఐనా సరే, ఎక్కడ దొరికిన ఎక్సరసైజ్ అక్కడ చెయ్యడం తప్పదు). సృష్టి లో గొప్పదనం ఏమిటంటే, అది ఎప్పుడూ కూడా, దేనిలోనైనా సరే "equilibrium" (సంతులనం) కోసం ప్రయత్నిస్తూ వుంటుంది. డెలివరీ కాగానే, శరీరం తిరిగి మామూలు స్థితి కి చేరుకోవడానికి ప్రయత్నాలు వెంటనే మొదలు పెడుతుంది. చర్మం సంకోచించి తిరిగి ప్రెగ్నన్సీముందు స్థితి ని చేరడానికి ప్రయత్నించడం, గర్భసంచి తిరిగి మరొక ప్రెగ్నన్సీకి సిద్ధంగా పూర్వ స్థితికి చేరడం, కొద్ది నెలల్లో నెలసరి మొదలు కావడం ఈ కోవలోకి వస్తాయి. ఐతే శరీరం ఎంత ప్రయత్నించినా, మనం అది అనుకునే స్థాయి కి మించి తినడం జరుగుతుంది కాబట్టి మన చేయూత కూడా దానికి అవసరం (ఎక్సరసైజ్ రూపం లో). బంగాళాదుంపలు లాంటివి carbohydrates కావడం వల్ల వాటికి బరువు పెంచే గుణం వుండడం వల్ల వాటిని మితం గా తీసుకోవచ్చు. మానెయ్యక్కర్లేదు. అన్నం కూడా కార్బ్స్ category కి చెందుతుంది కాబట్టి ఒక పూట అన్నం బదులు రెండు చపాతీలు, బోలెడంత కూర తో రిప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక నడుముకి గుడ్డ కట్టుకోవడం అనేది హెల్ప్ చేస్తుందని అంటారు. నేను ఇందాక చెప్పిన తెలుగు డాక్టర్ గారు కట్టుకోమనే సలహా ఇచ్చారు. మొదటి రెండునెలల్లో ఇది బాగా వాడాలి అని చాలా సార్లు విన్నాను. ఒక సంగతి ఏమిటంటే, మరీ ఊపిరి ఆడనంత గట్టిగా కట్టెయ్యకుండా ఉంటే దాని వల్ల నష్టం ఏమీ వుండదు. శరీరానికి adoptability ఉంటుంది కదా. (ఏ దేశం లోనో మరచిపోయాను. అక్కడ ఆడవాళ్ళు మెడకి మన పెద్ద వాళ్ళు కాళ్ళకి వేసుకొనే పెండేరాలంటివి వేసుకొని ఉంటారు. దానికి చోటు చెయ్యడం కోసం మెడ సాగుతుంది. అప్పుడు ఇంకోటి తగిలిస్తారు. అలా వాళ్ళ మెడలు సాగుతూనే వుంటాయి - మెడ ఎంత పొడుగ్గా వుంటే అంత గొప్పట). ఆ సూత్రం ప్రకారం ఆలోచిస్తే ఈ గుడ్డ కట్టడం వల్ల నడుము దగ్గర చర్మం తిరిగి పూర్వ స్థితి కి వెళ్లడానికి సహాయం చేస్తుంది అనిపిస్తుంది. ఈ విషయం అమెరికా లో డాక్టర్ లకి ఆశ్చర్యం గా అనిపించడానికి కారణం వాళ్ళు ఇక్కడ కొత్తగా తల్లి ఐన వారికి ఎక్సరసైజ్ చెయ్యమని చెబుతారు. అది తప్ప మరేది అవసరం లేదు అని వాళ్ళ అభిప్రాయం. మన దగ్గర ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎక్సరసైజ్ చెయ్యడం అనేది (ఈ కాలం లో కాదు గాని, ఇది వరకు) వింత విషయం కాబట్టి మన వాళ్ళు దానికి ప్రత్యామ్నాయం గా అది చెబుతూ ఉండి ఉండవచ్చు. ఇండియా లో కొందరు డాక్టర్ లు కూడా పథ్యం ఎందుకు చెయ్యలేదు అని అడగడం ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా అని కూడా అనుకుంటాను. వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏమి లేదు - అలాంటి వాళ్ళని avoid చేసి వేరే వాళ్ళ దగ్గరకి వెళ్ళడం తప్ప. ఇండియా లో నాకు తెలిసిన చాలా మందికి (మా ఆడపడుచులు, ఫ్రెండ్స్ కి) డాక్టర్ లు పథ్యం అక్కరలేదు అని చెప్పారని అన్నారు. పథ్యం చెయ్యాలని చెప్పే డాక్టర్ లు తక్కువని, త్వరలో వాళ్ళు ఇంకా తగ్గుతారని అనుకోవాలి. ఏమో.. మన చిన్నప్పుడు మనకి తల్లి నుంచి దక్కాల్సిన పాలు దక్కనిచ్చి వుంటే, మన తల్లిని సరిగ్గా తిననిచ్చి వుంటే, మనం ఇప్పుడు ఉన్నదానికంటే మరింత దారుఢ్యం తో, రోగ నిరోధక శక్తి తో ఉండేవాళ్ళమేమో!!. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బిడ్డ పుట్టకముందు, పుట్టిన తరవాత తీసుకోవాల్సిన ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మన మూర్ఖపు ఆలోచనలు, మూఢ నమ్మకాలు పక్కన పెట్టి బిడ్డని ఎదగాల్సిన పద్ధతిలో ఎదగనిస్తే మన భవిష్యత్ తరాలు మరింత ఆరోగ్యం గా పెరిగి మరిన్ని తెలివి తేటలతో మనకి కృతజ్ఞతలతో ముందుకి వెడతాయి.
Friday, June 13, 2008
పిల్లల బొమ్మల ఎక్సేంజ్
ఎవరికైనా ఇద్దామన్నా, వాళ్ళు వాడేసిన బొమ్మలు ఇస్తున్నారు అనుకుంటారు, "మా పిల్లలకి మేము కొనలేమా" అని అహంకారానికి పోయి మొహం మీదే వద్దంటారు అని ఒక అనుమానం. తల్లితండ్రులకేమో ఎవరినన్నా, "మీ పిల్లల బొమ్మలు వున్నాయా - మేము తీసుకుంటాము" అనాలి అంటే "లేకి" గా అడుగుతున్నారు అనుకుంటారు అని భయం. అందుకని ఇరు పక్షాలు అలా బిగిసి పోయి, బొమ్మల కొట్ల వాళ్ళకి డబ్బులు ధారాళం గా పోస్తూ వుంటారు (మీరు కాదనలేరు - ఎందుకంటే, ఇది అంతా స్వానుభావమే (పిల్లలు వున్న వారు) అందరికీ). ఈ వస్తువులన్నీ వాటి కాలం మూడే వరకు బేస్మెంట్ లలో, క్లోసేట్ లలో, అటకల మీద దుమ్ము తింటూ బ్రతుకుతూ వుంటాయి.మన పిల్లలు మనకి ఎంత అపురూపం ఐన ప్రాక్టికల్ గా ఆలోచిస్తే శుభ్రం గా వాడేరు అని తెలిసిన బొమ్మలు మన పిల్లలకి ఇవ్వడం లో అభ్యంతరం ఏముంది? ఎక్కడైనా అవి పిల్లలు వాడినవే కదా? అంతగా కావలిస్తే వాటిని శుద్ధి (శుభ్రం) చేసే పద్ధతులు బోలెడన్ని వున్నాయి. ఈ మధ్య పుట్టిన కొత్త వాదం ఏమిటంటే, బొమ్మలు రీసైకిల్ చెయ్యడం ద్వారా (తద్వారా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ద్వారా) హరిత భూమి (గ్రీన్ ప్లానెట్) కి మన చేయూత ఇచ్చినట్టు అవుతుంది అని. నిజమే మరి.
ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ రోజు ఈ సైట్ చూసాను: www.zwaggle.com. దీనిలో మన పిల్లల బొమ్మలు మరొకరికి ఇవ్వడం, మరొకరివి మనం తీసుకోవడం చెయ్యవచ్చు. బార్టర్ సిస్టమ్ లాగ అన్నమాట. ఐతే అప్పుడే పుట్టిన పిల్లలు మనకి వుంటే మనం వేరొకరికి ఇవ్వడానికి మన దగ్గర ఎక్కువ వుండకపోవచ్చు. కాకపోతే మన దగ్గర బొమ్మలు చేరేకొద్దీ దీనిని ఉపయోగించుకొని అన్ని వర్గాలు లబ్ది పొందొచ్చు. బొమ్మలే కాదు, అనేక ఇతర వస్తువులు దీనిలో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి మన దేశం లో కూడా అవసరం!. ఇంటర్నెట్ ద్వారానే అక్కర్లేదు. మీ దగ్గర మీ పిల్లలు ఆడుకున్న బొమ్మలు, వాడిన వాకర్ లు, ఇప్పుడు వాడలేని సైకిళ్ళు, ఏమైనా వుంటే అవి మీకు తెలిసిన వారికి ఆఫర్ చెయ్యండి. పిల్లలు కూడా తమ బొమ్మలు మరొకరు ఆడుకోవడం చూసి షేర్ చేసుకోవాలి అనే గుణం చిన్నప్పటినుంచే అలవాటు చేసుకుంటారు. మనం గమనించినా, నిన్చకపోయినా పిల్లలు మనం చేసే ప్రతీ పని ని నిశితం గా పరిశీలిస్తూ, ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళలో అటువంటి మంచి లక్షణాలు పాదుకొల్పడానికి ఇది కూడా ఒక అవకాశం గా పనికి వస్తుంది. ఎటు నుంచి చూసిన, మినిముం మన ఇంట్లో కాళ్ళకి అడ్డం పడే "పనికిరాని" వస్తువులు తగ్గుతాయి :).
Wednesday, June 4, 2008
బాలు పుట్టిన రోజు
ప్రేమ రసాంత రంగ హృదయంగమ సుంగ సుభంగ రంగ బహు రంగధ భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప ప్రుదు సంఘ విభంగా..
దీనిని అంతటినీ ఒకే గుక్కలో మధ్యలో ఊపిరి తీసుకోకుండా చదవండి చూద్దాం? కొంచెం కష్టం అయినా చదివేసారు కదా? సరే.. ఇప్పుడు రామదాసు సినిమా లో "దాశరథీ! కరుణా పయోనిధీ" పాటలోలా పాడడానికి ప్రయత్నించండి. "అబ్బో" అంటారా? ఐతే మరి దానిలో భగవంతుడినే నిలదీస్తున్నట్టు అనిపించే భావాన్ని కూడా పొందు పరచి, రాగా తాళ యుక్తంగా పాడడం అనేది ఊహకి కూడా అందదు. అందులోనూ, 62 ఏళ్ళ వ్యక్తి ఆపని చేసాడు అంటే, అతనికి తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం వుంటే, పాడుతున్న పాటలో ఎంత మనసు లగ్నం చేస్తే అది సాధ్యం అవుతుంది? ఎవరి గురించి చెబుతున్నానో తెలిసిందిగా? తన వయసులో సగం కూడా లేని కుర్ర హీరో లకి కూడా తన "లేత" గొంతు తో పాడిన చక్కటి పాటతో అందాన్ని అద్దగలిగే "మన" SP బాలసుబ్రహ్మణ్యం గురించి. ఎవరికి వారికి "ఇతను నా గొంతుతోనే పాడేడు" అనిపించినా, సినిమా లలో కమెడియన్ వేషాల నుంచి విలన్ వేషాల వరకు వేసి శహభాష్ అనిపించుకున్నా, మ్యూజిక్ డైరక్షన్ చేసినా, ప్రయోక్తగా పని చేసినా ఆయనకే చెల్లింది.
ఆయన ఇన్నాళ్ళూ చేసిన పనులు ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్న పాడాలని వుంది మరొక ఎత్తు. నాకు గుర్తు వుండీ గత పన్నెండేళ్ళు గా మొదట ఈ టీవీ లోను, తరవాత మా టీవీ లోను కొనసాగిస్తున్న ఈ యజ్ఞం ఎందరో "తెలుగు" గాయకులని సినిమా పరిశ్రమ కి పరిచయం చేసింది. మన సినిమాలలో పాడడానికి భాష రాని పరాయి గొంతుల్ని అరువు తెచ్చుకొనక్కరలేదని, సరిగా చూస్తే ఈ నేల మీదే వాళ్ళని తలదన్నే గాయకులు వున్నారని మన సంగీత దర్శకులకి ప్రతీ వారం గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమం వెనకాల వేరే చాలా మంది వున్నా, వాళ్ళకి బాలు దొరకడం కూడా మన అదృష్టమే. దీనికి నాయ నిర్ణేతలు గా వచ్చే విద్వాంసుల్ని చూస్తేనే మనకి ఈ ప్రోగ్రాం గొప్పతనం అర్ధం అవుతుంది. సొంత డబ్బింగ్ కూడా చెప్పుకోలేని సినిమా హీరోలను, హీరోయిన్ లను కాకుండా, ఆయా కళల్లో నిష్ణాతులైన వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా తీసుకొని వస్తే ఆ కార్యక్రమం ఎంత రక్తి కడుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే, పోయిన కాలం ఎంత మంచిది అయినా, "ఈ కాలం సంగీత దర్శకుల పాటలు ఎవరి పాట ఏదో గుర్తు పడితే కోటి రూపాయలు ఇస్తాను" అనేటువంటి వ్యాఖ్యలతో నేను ఏకీభవించకపోయినా, బాలు మీద నా గౌరవం చెక్కు చెదరదు. ఏమో.. నేను చూసిన ప్రపంచం కంటే ఆయన చూసిన ప్రపంచం పెద్దది కాబట్టి, అందులో నిజం కూడా వుండవచ్చు అని అనుకుంటాను.
తెలుగు వాడికే గర్వ కారణమైన మన గాన గంధర్వుడు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, మరింత కాలం ఆరోగ్యం గా మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ - అభినందనలు.
Friday, May 30, 2008
డాన్ - మిస్టర్ మేధావి - అత్తిలి సత్తిబాబు LKG
డాన్ లో చెప్పుకోడానికేమీ పెద్దగా కనిపించలేదు. లారెన్స్ స్టైల్ లో పగలు రాత్రీ తేడా లేకుండా సినిమా లో ప్రతీ పాత్రధారీ (హీరోయిన్ లు తప్ప) "చలవ" కళ్ళజోళ్ళు వాడేస్తూ ప్రాణం అంటే లెక్క లేనట్టు ఒకళ్ళని ఒకళ్ళు తుప్పు తుప్పుమని కాల్చేసుకుంటూ వుంటారు (తుపాకీ లతో). నాగార్జున వెనకాలే వున్నట్టు కనిపిస్తున్నా, అవకాశం వచ్చిన ప్రతీ సారి (కొండొకచో అవకాశం సృష్టించుకున్న ప్రతీ సారీ) లారెన్స్ ముందుకు వచ్చి తన నేటివిటి కి సంబంధించిన ఓవరాక్షన్ తో మనల్ని అలరించడానికి ప్రయత్నించాడు. నాగార్జున జుట్టు దువ్విన విధానం వల్లనో ఎందుకో, కొంచెం వయసు, నుదుటి మీద ముడతలు కన్పించాయి (నాకు తెలియదు. మరి డాన్ అంటే అలాగే వుండాలేమో!!). ఈ సినిమా అంతటిలోకి మాకు నచ్చిన వ్యక్తీ విలన్ గా నటించిన కెల్లీ జార్జి. "నటుడు అనే వాడికి భాషా బేధాలు లేవండి.. వాళ్ళని ఏదో భాషలో నోరు కదపమని చెప్పండి.. మనం డబ్బింగ్ లో చూసుకుందాము" అని అనే భావ దారిద్ర్యం తో కొట్టు మిట్టాడే ప్రొడ్యూసర్ లు డైరెక్టర్ ల మధ్య ఎక్కడో ఇలాంటి వాళ్ళు తగులుతారు అనుకుంటాను (నటన విషయం పక్కన పెడితే, ఇలాంటి ఇంకొక వ్యక్తి సాయాజీ షిండే - భాష ని యాసతో పలికితే పలికాడు.. అసలు కి పలకడానికి ప్రయత్నిస్తాడు). ఏ డైలాగ్ కి ఐనా సరే ఒకే విధం గా నోరు కదిపే మన ఉత్తరాది (కొందరు దక్షిణాది) భామలు ఈయన్ని చూసి బోలెడు నేర్చుకోవాలి. వాళ్ళని అలాగే వున్నా పరవాలేదంటూ ప్రోత్సహిస్తున్న నిర్మాత దర్శకులు సిగ్గుతో తల వంచుకోవాలి. మొత్తానికి కాలక్షేపం సినిమా అనిపించింది.
తరవాత శనివారం రాత్రి మిస్టర్ మేధావి చూసాము. ఇంతకూ ముందు నీలకంఠ సినిమాలు చూసి వుండడం చేత, ఈ సినిమా కొంచెం డీసెంట్ గా వుంది అని వినడం చేత, కొంచెం ముందస్తు అంచనాలతో కూర్చున్నాము. అక్కడక్కడా కొంచెం నీరసం గా అనిపించినా, మొత్తానికి పాయింట్ బాగుంది. MS నారాయణ పాత్రని ధర్మవరపు, ధర్మవరపు పాత్రని MS వేస్తే బాగుండేదేమో అనిపించింది. నేను అనుకోవడం, ఈ సినిమా లో నీలకంఠ సాధించిన గొప్ప విజయం, జెనీలియా చేత ఎప్పుడూ చేసే "బబ్లి" మూస నటన కాకుండా, కొంచెం నిజం నటన చేయించడం. డైలాగులు కూడా చక్కగా పలికింది (డబ్బింగ్ చెబితే చెప్పారులెద్దురూ.. ముందు ఆ స్క్రీన్ మీద కన్పించేది ఈ ముఖమే కదా.. వీళ్ళు మాట్లాడే దానిని బట్టి, అప్పుడప్పుడు స్త్రైట్ సినిమా లు కూడా డబ్బింగ్ సినేమల్లాగా కన్పిస్తుంటాయి). ఆవిడకి విగ్గు కొంచెం పెద్దది అయినట్టు కన్పించింది. క్లైమాక్స్ లో డ్రాకులా లా మొహం ఎందుకు పెట్టిందో అర్ధం అవలేదు. రాజా బాగానే వున్నాడు. సుమన్ నటన కూడా బాగుంది.
చివరిగా అత్తిలి సత్తిబాబు. అప్పుల అప్పారావు రేంజ్ లో లేకపోయినా వున్నంతలో EVV సినిమా కి న్యాయం చేసాడు అనే అనిపించింది. EVV మార్కు వెకిలి దృశ్యాలు అక్కడక్కడా కనిపించినా, అలవాటు అయిపోయి, వదిలేసాము. సినిమా ని నడిపించిన తీరు కూడా బాగుంది. ఎప్పటిలాగే, సంభాషణల రచయితలు విజృంభించి రాసేరు (వేగేస్న సతీష్ ఏదో సినిమా కి దర్శకత్వం కూడా చేపడుతున్నట్టు చదివినట్టు గుర్తు). సినిమా మొత్తంలో ప్రేక్షకులకు హీరో మీద పేరుకుపోయిన అసహ్యాన్నంతా చివరి రెండు నిముషాలలో తీసెయ్యడం లో దర్శకుడి ప్రతిభ కన్పిస్తుంది. ఎలా ఆడిందో తెలియదు గాని, రెండో సారి చూడొచ్చు.
Friday, May 23, 2008
మీనా బిస్కట్లు - రుక్మిణీ రీఫిళ్ళు.
మా నాన్నారి బ్యాంకు లోంచి లోన్ తీసుకొని కొంతమంది మొగల్తూరు లో ఒక రీఫిల్స్ ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్యాక్టరీ అంటే, అదేదో 1000 మంది పనిచేసేరు అనుకునేరు!. ఒక పెంకుటింటి పరిశ్రమ అన్నమాట (కుటీర పరిశ్రమ లాగ). ఒక రోజు నాన్న గారు అక్కడ కి వెడుతూ వుంటే మేము కూడా వెనకాలే బయల్దేరాము. అప్పుడు ఆ కంపెనీ యజమాని మాకు డెమో ఇచ్చారు.. "బాలు ముల్కులు" (ఎందుకో తెలియదు గాని, వాటిని అలా పిలిచేవాళ్ళం అప్పుడు) ఎలా తయారు చేస్తారో!. మెషిన్ లో ఖాళీ రీఫిల్ పెట్టి స్విచ్ నొక్కగానే "జుయి" మంటూ అందులోకి ఇంకు చేరడం చూసి మహా ఇమ్ప్రేస్స్ అయిపోయాము అనుకోండి. అప్పుడే నిర్ణయించేసుకున్నా నేను - జీవితం లో పెడితే ఒక బాలు ములుకుల ఫ్యాక్టరీ పెట్టాలి అని. అయితే, కారణాంతరాలవల్ల తర్వాత మన ఐడియా ని రేనాల్డ్స్ వాడు కొట్టేసి రిచ్ అయిపోయాడు అనుకోండి.. మనం ఇలా సాఫ్ట్వేర్ లో సెట్ అయిపోయము అన్నమాట. అదీ సంగతి!!.
Friday, May 16, 2008
మాష్ ఆ స్మాష్ ఆ (Mash or Smash)?
Friday, May 9, 2008
తెలుగుబిజ్ కి ఏమయింది?
Thursday, April 24, 2008
Passport and PIO Card for your baby.
Passport:
We thought that this is a very straight forward process and mostly it is, except for the passport photos. The USPS web site indicates that most of the post offices have facilities to make your passport photograph, but when we went to our local post office, they told us that they no longer offer this service for infants!. They said that it is because the pictures they take for infants are not coming out well. We went to CVS Pharmacy and got ours. So, it is a good idea to inquire ahead of time whether a certain place offers this service. The travel.gov web site has well-formatted list of required documentation. The fee can be paid at the post office itself. It is normally a good idea for both the parents to be present. The passport is processed pretty fast, you would get it back in a week or two in most cases.
PIO Card:
Now for the confusing one (or so it is made to be!!).
The PIO instructions on web site for Indian consulate in New York are confusing at best. The information is lacking organization and there is a phone number listed, that needs to be called - in restricted hours (between 2 and 4 PM) should you need any assistance. Don't count on it, when I called one day from 2PM, no one answered the phone, I hung on and kept calling till I received a message saying the message box is full :).
Anyway, here are the things we had to gather for our baby to apply for PIO card.
4 passport size photos.: Actually there is a total of 5 passport photos if what's on the instructions is to be followed. One to affix on page1 and 4 to be sent along with the application.
Thumb prints on the application form: (ink pads are avaialbe for about $3 at stationary stores such as OfficeMax). First, try the thumbprint on a separate paper (than the application itself), make sure the streaks on the thumb are visible and then put it on the application as the impressions tend to be no more than big dots if we put them on the application right away from the pad due to the tenderness of the skin of the baby. I have read elsewhere on the internet that they are taking the parent's signature in place of the baby's thumbprint when they go to the consulate in person. But there is nothing to that effect on the site and instructions, so if you are sending the application in mail, the thumbprints will be needed.
"Notarized" copies of passports of the baby, mother and father (expired ones too). Typically, there would be more than 50 sheets to notarize if you copy two pages of passport on a single sheet of paper. I copied 6 sheets of passport on one sheet (8.5 X 14), and only got notarized those pages where there is any information at all (like immigration stamps, visas etc). Your bank managers will be able to do the notarization for you.
Copy of the birth certificate. Notaries DO NOT notarize birth certificates in the US and there is nothing like a "copy" of birth certificate.You have to obtain a new birth certificate and send it over. The Consulate does not return this document (too bad - as we had to spend $21 in Ohio to get a new birth certificate copy) - as opposed to the US Passport application, where every original document you submitted will be returned to you!.
Money Order for $205, comprising of $185 for the fee and $20 for the return postage (reasonable as they had to spend $16.25 for the return envelope on ours).
Fill the application: There would be a little confusion about items 13 and 14 in the application, which do not seem to be much different from one another, but if you are a normal case (both parents holding current Indian passports), you just have to fill item 13. Item 14 can be left blank.
The only thing to cheer in this whole process is the turnaround time, we got our baby's PIO card in a week.
Friday, April 18, 2008
భలే భలే ఇలియానా
ఏంఖర్: ఈ సినిమా లో మీ క్యారెక్టర్ ఏమిటి?
ఇలియానా: నాది చాల బబ్లి క్యారెక్టర్ (సైడ్ లో వ్రేలాడుతున్న జుట్టు మొహం మీద పడకపోయినా సరే చేతితో వెనక్కి తోసుకుంటూ.. మళ్ళీ గట్టిగా తోస్తే ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయి ముందరకి రాదో అన్నట్టు, కొంచెం తోసీ తోయ్యనట్టు గా లైట్ గా).
ఏం: How did you enjoy acting in the movie?
ఇలి: I enjoyed a lot.
ఏం: మీరు తెలుగు లో చాలా సినిమాలు చేసేసారు కదా.. మరి తెలుగు లో ఎప్పుడు మాట్లాడడం మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు..
ఇలి: (English లో నే లెండి) ఒకప్పుడు నేర్చుకుందాము అనుకున్నాను కాని, (తెలివైన ప్రేక్షకులు) ఖతర్నాక్, ఆట ఫ్లాపు చెయ్యడం తో ఇంట్రస్టు పోయింది. మళ్ళీ ఇప్పుడు జల్సా ఆడుతోంది కదా నేర్చుకోడానికి ట్రై చేస్తా.
ఏం: How did you enjoy acting with lover boy Tarun?
ఇలి: Lover boy ఆ.. ("ఇంకా ఈ జుట్టు మీద పడదేమిటీ? - నేను వెనక్కి నెడదాము అనుకుంటుంటే" అనుకుంటూ)
ఏం: అదేనండీ.. ఇక్కడ అందరికీ తరుణ్ లవర్ బాయ్ కదా!.
ఇలి: I enjoyed a lot.
ఏం: ఇప్పుడు మీరు తెలుగు లో అందరికంటే ఎక్కువ రేమునేరషన్ తీసుకుంటున్నారు కదా..
ఇలి: wow.. how did you know that? (అంటే నిజమే అన్నమాట).
ఏం: మాకు తెలిసిపోతూ వుంటాయి లెండి. How do you feel about it?
ఇలి: నాకు వున్నా వర్త్ ని బట్టి నాకు ఇస్తారు.
ఏం: ఐతే మరి భలే దొంగలు లో మీ పాత్ర ఎలా వుంటుంది?
ఇలి: It is a bubbly girl character.
ఏం: How did you enjoy working with Vijaya Bhaskar?
ఇలి: I enjoyed a lot.
ఏం: మీకు తెలుగు ఫీల్డ్ లో ఏ హీరోయిన్స్ అంటే ఇష్టం?
ఇలి: ఒహ్.. (giggles) త్రిష, పార్వతి.
ఏం: మరి హీరోస్ లో?
ఇలి: ఆన్ స్క్రీన్ ఆ? ఆఫ్ స్క్రీన్ ఆ? (నవ్వు.. జుట్టు తోసే ప్రయత్నం నెంబర్ 3).
ఏం: రెండూ లెండి (ఏ మాటకీ ఆ మాటే చెప్పాలి.. ఈవిడ మూడు భాషల్లో చెరిగేసింది).
ఇలి: (ఏదో చెప్పింది కాని - వీళ్ళు ఆన్ స్క్రీన్, వీళ్ళు ఆఫ్ స్క్రీన్ అని అనలేదు - అంటే, ఇందాకటి ప్రశ్న వుత్తినే వేసింది అన్నమాట).
ఏం: మరి ఈ భలే దొంగలు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేసారు?
ఇలి: I enjoyed a lot.
ఏం: ఐతే మీరు నెక్స్ట్ సినిమా లో తెలుగు లో మాట్లాడేస్తారు అన్నమాట.. పక్కా?
ఇలి: (ఏదో అన్నారు - సతి లీలావతి సినిమా లో కమలహాసన్ "అయ్యబాబోయ్ నువ్వు ఇంజనీర్ గానీ అయిపోతావేంట్రా" అంటే కొడుకు పాత్రధారి "చూద్దాం.. చూద్దాం" అన్నట్టు.)
ఇక ఆ దెబ్బతో టీవీ కట్టేసి, ముసుగు తన్ని చక్కగా బజ్జున్నాము.
Monday, April 14, 2008
పంచాంగ వీరంగం
అందరికీ సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు.బాబూ.. కొంచెం ఆ కార్డ్ లెస్సో, ఆ క్లిప్ మైకో ఇస్తారా? This is very inconvenient you know? ఏమిటి? లేదా? దీన్లోనే చెప్పాలా? సరే!. (audience తో).. Cost Cutting అనుకుంటా.ఏదో పంచాంగ శ్రవణం చెయ్యమని తీసుకొని వచ్చారు - కానిద్దాం!.
నా పేరు దైవజ్ఞ శాస్త్రి .net. పేరలా వుందని ఖంగారు పడకండి. ఇప్పుడంతా ఇంటర్నెట్ కదా.. అందుకని చివర్లో అలా తగిలించేను. ఈ యేడాది వివిధ రాశుల వారికి ఉండబోయే రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం వివరాలు ఇలా వున్నాయి.
ఏమిటీ.. రాజపూజ్యం అంటే మిమ్మల్ని రాజుల్లా పూజించడం అనుకుంటున్నారా? "పూజ్యం" అంటే తెలుసు కదా!! . నిండు సున్నా అన్నమాట. అంటే మిమ్మల్ని రాజుల్లా చూసేవారు పూజ్యం. అవమానం మాత్రం డెఫినెట్టు. ఈ యేడాది మిమ్మల్ని ఎవరైనా లాగి జెల్ల కొట్టేసే అవకాశం ఎంత వుందో ఇది చెబుతుంది. సరే మరి.. విషయానికొద్దాం.
మేష రాశి: ఆదాయం - 4, వ్యయం – 2, రాజపూజ్యం - 4, అవమానం – 5
ఈ రాశికి చెందిన వాడవడం చేత మన మెగాస్టారు ఈ ఏడాది కూడా పార్టీ పెట్టడు!. కానీ, పెడతాము అని నెలకి రెండు సార్లు చొప్పున 24 సార్లు స్టేట్మెంట్ లు మాత్రం ఇస్తారు. బ్రేకింగు న్యూస్ ఏమిటంటే, వారి కోసం రావాల్సిన రైల్ ఔటర్ లో ఆగిపోయిందిట. అక్కడ సిగ్నల్ పెట్టె దగ్గర సి ఎం గారు, ప్రతిపక్ష నాయకుడు కూర్చొని దానిని కదలనివ్వట్లేదని తెలిసింది.
వృషభ రాశి :ఆదాయం -8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం 5
మన దేశ ప్రజలమంతా వృషభాల వంటి వారం అవడం చేత మన క్రికెట్ జట్టు ఎన్ని మాచులు ఓడిపోయినా, మిగిలిన ఆటలని పెద్దగా పట్టించుకోకుండా ఈ యేడాది కూడా వేరే పని లేకుండా క్రికెట్ చూస్తూ వుంటారు.
మిధున రాశి :ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3 , అవమానం -1
మన సి ఎం గారు ఈ రాశి కి చెందినా వారు కావడం చేత రెండు రూపాయల కిలో బియ్యం కోసం పన్నులు పెంచడంతో, ఈ యేడాది చివరికి రాష్ట్ర జనాభా అంత దారిద్ర్య రేఖ కిందకి జారి, వాళ్ళు కూడా రెండు రూపాయల కిలో బియ్యం పధకానికి అర్హులయేలా చేస్తారు.
కర్కాటక రాశి :ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6 , అవమానం -1
సింహ రాశి :ఆదాయం - 8, వ్యయం -2, రాజపూజ్యం - 2, అవమానం -4
సింహ రాశికి చెందినది అవడం వల్ల సానియా మిర్జా కెరీర్ లో ఈ యేడాది పెరుగుదల వుంటుంది. Top 100 నుండి Top 200 కి పెరుగుతుంది అని నా కంప్యూటర్ కీబోర్డు గుద్ది మరీ చెబుతోంది.
కన్య రాశి :ఆదాయం - 11,వ్యయం -8, రాజపూజ్యం - 5, అవమానం -4
తులా రాశి : ఆదాయం -8 వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం -7
మన తెలుగు ప్రజలు అందరూ చేసుకున్న ఖర్మ కొద్దీ, ఇటు భాష, అటు acting రాని అందం లేని చెక్క ముఖాలు "జిందాబాద్ హూ హ్హ హూ హ్హ" అనుకుంటూ నార్తు నుంచి దిగుతూనే వుంటారు. వాళ్ల ప్రాప్తం, మన ప్రారబ్ధం.
పృశ్చిక రాశి :Earning 100du, Spending 1000du. Just kidding.ఆదాయం -14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం -7
ధనుస్సు రాశి :ఆదాయం -2, వ్యయం -11, రాజపూజ్యం - 7, అవమానం -7
ఈ సంవత్సరం మీ కార్ మైలేజి 2-3 తగ్గి గ్యాస్ ఖరీదు 2-3 పెరుగుతుంది. అప్పుడు అందరూ ఎక్కడికైనా సరే నడవడం అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని పొందుతారు.
మకర రాశి : ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం -3
కుంభ రాశి : ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం -3
ఈ యేడాది మన సి ఎం గారు ప్రతిపక్ష నాయకుడిని తెలుగు లో 3-4 తిట్లు, అదేదో అర్ధం కాని భాష లో కొన్ని వందల తిట్లు తిడతారు.. ఐతే ఈ లోగా ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడే గెలిచి, ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి, ఆ తిట్లన్నీ తిరిగి ఆయనకే తగులుతాయి.
మీన రాశి :ఆదాయం - 2, వ్యయం -6, రాజపూజ్యం - 2, అవమానం -6
మీన రాశి వాడు అవడం చేత మన ప్రెసిడెంట్ జార్జి పొద గారు.. "పొద" అండీ!!.. అదే.. "బుష్షు" అన్నమాట.. సరే.. జార్జి పొద గారు ఈ యేడాది పదవీచ్యుతులవుతారు. సరిగ్గా నవంబర్ నాలుగు, 2008 ఆయన రాజభోగం ముగుస్తుంది. ఏమిటీ.. పదవి లో వుంచమంటారా ? అబ్బే.. లాభం లేదండీ.. ఇక్కడ గ్రహాలు ఘోషిస్తున్నాయి.. నక్షత్రాలు నస పెడుతున్నాయి. అష్టదిక్పాలకులూ ససేమిరా అంటున్నారు.. కాబట్టీ.. ఆ.. అలా కానిచ్చేద్దము మరి ఈ సరికి.. సరేనా మరి?.. మళ్ళీ కలుద్దాం..
Wednesday, April 9, 2008
Thursdays are fun again!
If Earl's brother Randy is on one end of the dumbo spectrum, the other end has - Dunder Mifflin's Michael from The Office. If you get NBC (in US), watch these if you are not already watching - sure worth your time.
Tuesday, April 8, 2008
జల్సా ఖర్చు
Figurative గా రాసేరు కాబట్టి కంచిభొట్ల మీద కోపం లేదు లెండి :).
Saturday, April 5, 2008
అబ్బో !! మీకిన్ని తెలుసా!!?
మాకు ఈ విషయం ముందే తెలుసు అంటారా? సరే. కాచుకోండి.
క్రిందటి సంవత్సరం అనుకుంటాను.. NPR Morning Edition కార్యక్రమం లో రాజమండ్రి లో పన్నులు వసూలు చెయ్యడానికి "డప్పుల మోత" కార్యక్రమం నిర్వహించారని, దానిలో భాగంగా, పన్నులు బకాయి ఉన్న మొండి వాళ్ళ ఇళ్ళకి వెళ్లి, ఆ వీధిలో అందరూ వినేలా, వాళ్లు "మేము బకాయిలు చెల్లిస్తాము కమీషనరు గారూ" అని అనేదాకా, ఆపకుండా డప్పులు వాయించారుట అని చెప్పారు. మళ్ళీ ఇవాళ "ఈనాడు" లో అమలాపురం లో అదే పని చేసి, ఒక నెల రోజుల్లో రికార్డు స్థాయి లో 65 లక్షల రూపాయల బకాయిలు వసూలు చేసారు అని ప్రకటించారు. (చూడబోతే డప్పులు వాయించడం అనేది పెద్ద ఉపాధి కల్పనా మార్గం గా వున్నట్టుంది).
ఇది కూడా తెలుసా? సరే.. ఇంకొకటి.
బ్రిటిష్ వారి కాలం నుంచి వస్తున్న ఒక వింత సంప్రదాయమట!. పోలీస్ శాఖ లో ఎవరైనా పై అధికారులు కొత్తగా విధుల్లో చేరితే కింద వాళ్లందరూ వాళ్ళ చేతికి పువ్వో, పండో కాకుండా "నిమ్మకాయలు" (అవి కూడా పసుపు రంగువి) ఇస్తారుట!. పసుపు శుభసూచకం అని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి అలా సెట్ చేసారుట.. మనం స్టిల్ ఫాలోయింగ్. అదీ సంగతి.
"ఆ.. చదివేసాం." అంటారా? ఫైనల్ గా ఇంకోటి.
www.picnik.com అనే సైట్ కి వెడితే మీరు ఎంత టాలెంట్ వుపయోగించి పాడు చేసిన ఫోటోలనైనా సరే, బాగుచెయ్యవచ్చు. Contrast, lighting, color, sharpness ఇత్యాది విషయాలతో బాటుగా, cropping, rotating, resizing లాంటివి కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, red eye reduction లాంటివి చాల సులువుగా చెయ్యవచ్చు. అన్నిటికంటే ముఖ్య విషయం - ఇంద్ర లో బ్రహ్మానందం చెప్పినట్టు ఈ సైట్ "మీకు ఫ్రీ"!! :).
ఇది కూడా తెలుసా? సరే.. మిమ్మల్ని బాగు చెయ్యడం నా వల్ల కాదు :)
Friday, April 4, 2008
మంత్ర - ఎ ఫిల్మ్ బై అరవింద్?
ఈ సినిమా కి, ఇదివరలో వచ్చిన "ఎ ఫిల్మ్ బై అరవింద్" కి పోలికలు కనిపించాయి (క్లైమాక్స్ లో ఐతే తప్పకుండా). ఐతే ఈ సినిమా లో ఎవరు చేసారో చెప్పి, ఎందుకు చేసారో విశదం చెయ్యడం వల్ల సినిమా ని పూర్తి గా చూసి, ఆ మిస్టరీ ఏదో మనమే సాధించిన ఫీలింగ్ వచ్చింది. (అరవింద్ లో చివర్లో విలన్ ఫలానా అని చూపించారు కాని, అలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం మీద వివరణ లేదు). దానికి తోడు, సంగీత పరంగా, నటన పరంగా కూడా ఈ సినిమా ఒక ఆకు ఎక్కువ చదివింది అని చెప్పవచ్చు. కధ జరుగుతున్నంత సేపూ, అత్మహత్యలని కూడా "దెయ్యమే" చేసింది అనుకోవడం, చివర్లో ఆ మిస్టరీ ని చేదించడం కూడా బాగుంది. ఒక దశలో మంత్రే దెయ్యమని మనల్ని ఆల్మోస్ట్ నమ్మిస్తాడు దర్శకుడు. కాదని గ్రిప్పింగ్ గా చెప్పడంలో కృతక్రుత్యుడైనట్టు తోస్తుంది . కొన్ని కంటిన్యుటి లోపాలు (మునుస్వామి చనిపోగానే వున్నట్టుండి స్నేహితులు మాయం అయిపోవడం లాంటివి) అక్కడక్కడ వున్నా, శివాజీ తన పాత్రను బాగానే పోషించాడు.. ఈ సినిమా పేరు చెప్పి కనీసం ఒక రెండు మూడు కేజీ ల ఆరోగ్యం పాడుచేసుకొని వుంటాడు అనిపిస్తుంది (సిగరెట్లు తాగుతూ). కరుణ (మా టీవీ యువ ఫేం) పాత్ర బానే వుంది గాని, ఓపెనింగ్ సీన్ లో ఖంగారు పెట్టింది. మొత్తానికి ఈ సినిమా మాకు నచ్చింది.
Sunday, March 30, 2008
మేము పోటీ లో లేము!.
ఇది చదివినందుకు బోనస్: హేమంత్ (మా టీవీ లో భలే ఛాన్స్ నుంచి) షో లోని ఒక పోటీదారు తో "చూడమ్మ.. ఇప్పుడు ఇదే పాటని, మన దగ్గర బనీను లాంటి పొడుగు షర్టు లు వేసుకొని, మెళ్ళో కుక్క గొలుసులు కట్టుకొని వుంటారు చూడు, వాళ్ళ లాగ - rap స్టైల్ లో పాడాలి". Very funny :).
Saturday, March 29, 2008
వ్యాయామ కండూతి
Friday, March 14, 2008
బాలమిత్ర - చందమామ
Wednesday, March 12, 2008
మంచు తుఫాను - మనకి పాఠం
Wednesday, March 5, 2008
మా బడి రేడియో
మార్చి 31, 2008 నాడు సవరించబడినది:
చదువరుల వ్యాఖ్యలు మరియు రాధిక, సుజాత గార్ల స్పందన వల్ల (వ్యాఖ్యల్లో చూడండి) ఈ పాట చాల ప్రాచుర్యం పొందినదని గ్రహించి, సాహిత్యం సంపాదించడానికి ప్రయత్నించాను. ఈ సైట్ లో కొంచెం దొరికింది. పూర్తిగా సరి కాకపోవచ్చు. సవరణ లు తెలియజేయగలరు.
--పల్లవి--
పిల్లల్లారా ఊఁ ఊఁ ఊఁ ఊఁ .... పాపల్లారా ఊఁ ఊఁ ఊఁ ఊఁ ......
రేపటి భారత పౌరుల్లరా ఊఁ ఊఁ ఊఁ......
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా .. పిల్లల్లారా ..
--చరణం--
మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు .. ఉన్నాడు అతడున్నాడు
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడు .. ఉన్నాడు.. పొంచున్నాడు
భారత మాటకు ముద్దుల పాపలు మీరేలే.. మీరేలే.. మీరేలే..
అమ్మకు మీపై అంతేలేని ప్రేమేలే .. ప్రేమేలే..
--చరణం--
జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి..
బడిలో బయటా అంతా కలసి భారతీయులై మెలగండి.
కన్యాకుమారి కి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండి..
వీడని బంధం వేయండి.. పిల్లల్లారా.. పాపల్లారా ..
ఈ పైన వున్న సాహిత్యం ఈ సైట్ లోని పాట వినడం ద్వారా రాసినది. ఈ పాట మీరు కూడా వినండి. చిత్తరంజన్ గారి ట్యూన్ లో కాకుండా చాల వైవిధ్యం గా వుంది. మలయాళం భాష కు చెందిన వారు ఎవరో కృషి చేసినట్టు గా తెలుస్తోంది.
కాని, నాకెందుకో, ఈ లైన్ కూడా ఎక్కడో వుండాలి అనిపిస్తోంది:
భారత దేశం ఒకటే ఇల్లు.. భారత మాతకు మీరే కళ్లు.. మీరే కళ్లు.. మీరే కళ్లు..
Monday, March 3, 2008
నా తప్పు కాదు అనుకుంటున్నా!!
గ్రహించగలరు.
Saturday, March 1, 2008
జల్సా ఆడియో సంరంభం
దేవి శ్రీ ప్రసాద్ ఇక్యనైనా శంకర్ దాదా ని వదిలిపెట్టాలి అని చూసిన ఎవరికైనా అనిపించడం సహజం.. ఎన్నాళ్ళు జనాల్ని "హూ హా.. హూ హా" అనిపిస్తారు చెప్పండి? కాని ఏ మాటకీ ఆ మాటే చెప్పుకోవాలి. దేవి మాత్రం స్టేజి మీద స్టెప్ లు "ఇరగదీస్తున్నాడు" అంటే, మన హీరో లు కొంతమంది వెయ్యడానికి కూడా చేతకాని స్టెప్ ల ని చాల సులువుగా వేసేస్తున్నాడు .. ఆలి చెప్పినట్టు సినిమాలలోకి రాబోతున్నాడేమో :). వేచి చూద్దాము.
ఏది ఏమైనా పాటలు మాత్రం బాగున్నట్టు అనిపిస్తున్నాయి. సిడి కొనుక్కొని సావకాసం గా విని చూస్తే చాలా నచ్చుతాయి అనిపిస్తోంది.
(ఈ బ్లాగు కి తెలుగు లో స్పందన తెలియజేయాలంటే http://lekhini.org కి గాని, http://www.google.com/transliterate/indic/Telugu కి గాని వెళ్లండి).