Monday, March 3, 2008

నా తప్పు కాదు అనుకుంటున్నా!!

నిన్న వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోడానికి దుకాణానికి వెళ్ళా.. (ఇక్కడ ఇంతే లెండి .. ఆది వారమే అన్నీ తెచ్చేసుకోవాలి.. సోమ వారం వెళ్ళాము అంటే, కుంగి, కృశించి, ఆల్మోస్ట్ నశించిపోడానికి రెడీ గా వున్నా కూరలే దొరుకుతాయి :) ). సరే.. రెండు సంచీల నిండా కూరలు నింపామా? నా వెనక ఒక నలుగురు చేరారు చెక్ ఔట్ లైన్ లో. వెనక్కి చూద్దును కదా ఒకాయన చిన్న నూనె డబ్బా పట్టుకొని వున్నాడు.. సరే కదా.. కుర్రోడు (పెద్దోడే లెండి) నాది అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి అని "అయ్యా.. మీరు గాని మీ పని కానిచ్చుకుంటారా ముందు?" అని ఆఫర్ చేశా. అది నేను చేసిన పాపమేమో తెలియదు గాని, ఆ మానవుడు నన్ను "ఛీ.. పీనుగా.. ఈ ప్రపంచం లో వున్న కష్టాలన్నింటికీ నువ్వే కారణం" అన్నట్టు ఒక ఛీత్కారపు చూపు చూసి ముందుకెళ్ళి నూనె డబ్బా బిల్ చేయించుకొని లాగించేసాడు !! కనీసం ఒక థాంక్ యు ("కుదిరితే ఒక కప్పు కాఫీ" ఎలాగు లేదు :) ) కూడా చెప్పకుండా కాటు మొహం పెట్టుకోవడం ఎందుకో నాకు అర్ధం కాలేదు.. పోనీ ఆయన ముందుకి వెళ్లేటప్పుడు నేను కాలు ఏమైనా అడ్డం పెట్టానా అంటే అలా ఏమి గుర్తు లేదు.సీరియస్లీ, మన వాళ్ళు (అంటే నేను కూడా - నేనేదో దిగొచ్చాను అని అనడం లేదు) ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం వీక్ అనే చెప్పాలి. ఐతే, ఇప్పటికైనా ఎదగకపోతే ఎలా? గ్లోబలైజేషన్ అంటారు.. అమెరికా లో వుంటున్నాము అంటారు.. మరి ఇక్కడ వుండీ, ఈ మాత్రం కూడా నేర్చుకోకపోతే ఎలా? ఇటుపైన ఎవరికైనా ఇలాంటి ఫేవర్ చెయ్యాలంటే నాకు భయం వెయ్యదూ? (కొంచెం ధైర్యం పాలు ఎక్కువ కాబట్టి నాకు ఐతే ఒకే - మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?). కాబట్టి, అయ్యలారా, అమ్మలారా, మీకు సహాయం చేసిన వారికీ మీరు చెయ్యగలిగిన గొప్ప ఉపకారం, వారిని మరింత మందికి సహాయం చేసేలా ప్రవర్తించడం (modified స్టాలిన్ లాగ కనపడుతున్నానా? - మీ ఇష్టం). ఇది ఎక్కడైనా వర్తిస్తుంది.. ఇండియా అయినా, అమెరికా అయినా - అంతరిక్షం లోనైనా సరే.
గ్రహించగలరు.

1 comment:

కొత్త పాళీ said...

మీరేదో మరీ సత్యకాలం వాళ్ళ లాగున్నారు.
ఇప్పుడు అమెరికాలో ఉన్నా ఇండీయం ఎంబసీ ఉన్న జాగా భారత దేశ అధీనంలో ఉన్నట్టు చూడండీ .. అలాగే ఇండియన్‌ హోటాళ్ళలోనూ, పచారీ కొట్లలోనూ మీరు ఏ హైదరబాదులోనో విజయవాడలోనో ఉన్నటు ఉండల్సిందే!! :)