Tuesday, November 22, 2011

చర్చి దర్శనం.

నిన్న చర్చి కి వెళ్ళాము. అమెరికా లో చాలా కాలం నుంచీ ఉన్నా, ఎందుకో వెళ్ళడానికి సమయం సందర్భం కలిసి రాలేదు. పెళ్ళికాకముందు ఒకసారి మా మేనేజర్ గారు చర్చి కోరస్ లో పాటలు పాడతాను అంటే వెళ్ళాము కాని, ఆ కోటి మంది కోరసుల్లో ఆయన గొంతు గుర్తు పట్టలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ నా పక్కసీటు లో పాలు గారు ("కే. ఏ." కాదు) చర్చి లో మత ప్రవచనం ఇవ్వడానికి ఏవో కోర్సులు చేసి, పరీక్షలు రాసి పాసై, అర్హత సంపాదించి మొదటి సారి ప్రవచిస్తున్నా మీరందరూ రావాలి అని అనేక విధాల (మౌఖికం గా, ఈమైలికం గా, ముఖపుస్తక రూపకం గా) చెప్పడం తోను, ఎన్నాళ్ళ నుంచో శాంతి కోరుతూ ఉండడం తోను ఇక బయల్దేరాము. ఇక్కడ మా పాలు గారి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఏభై ఏళ్ళ మనిషి అయినా ఇంటా బయటా అన్ని వయసుల వాళ్ళతోనూ కలసి మెలసి తెగ హడావిడి గా ఉంటాడు. ఆయన చెప్పే కబుర్లు విని నేనే "నీ జీవిత చరిత్ర రాస్తే చెప్పు - మొదటి పుస్తకం నేనే కొంటా" అని కూడా హామీ ఇచ్చాను (ఆయన ఇంకా మొదలు పెట్టినట్టు లేదు అనుకోండి). విధి వశాన నాలుగు పెళ్ళిళ్ళు, బోలెడు పిల్లలు, అప్పులు, అనేక జీవితానుభవాలు పుష్కలం గా ఉన్న వ్యక్తి పాల్. దానికి తోడు తన ఇరవై ఆరో ఏట మాని వేసిన మద్య పానం, మాదక ద్రవ్యాల అలవాట్లు మళ్ళీ తిరిగి రాకుండా ఇరవై ఐదు ఏళ్ళనుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు. నిన్న ఆ విశేషపు ఇరవై ఐదో జయంతి కూడా.
పొద్దున్నే బయల్దేరి ఎగ్జిట్ వరకూ దారి తప్పకుండ వెళ్ళినా, గూగులమ్మ దయవల్ల వేరే చర్చి దేనికో వెళ్ళిపోయి మాప్ క్వెస్ట్ పుణ్యాన తిరిగి దారిన పడి, అనుకున్న సమయానికి చేరుకున్నాం. మేమేదో పదివేల మంది పట్టే అద్దాలు బిగించిన పాలరాతి కట్టడం గురించి చూస్తూ ఉంటే ఈ చర్చి వంద మంది పట్టే చిన్న హాలులా ఉంది. ఆశ్చర్యాన్ని అణచుకొని లోపల ప్రవేశించి పరిచయాలు చేసుకున్నాము. అప్పటికే అక్కడ చేరినవాళ్ళు "వీళ్ళు ఏమిటి, చర్చి లో కి రావడం ఏమిటి" అని హాశ్చర్యపోతూ మమ్మల్ని కరచాలనాలతోను, మా పిల్లల్ని బుగ్గ పుణుగులతోను ఆహ్వనించేరు. ఒక తండ్రి కొడుకు ద్వయం గిటార్ మీద రెండు పాటలు వాయించిన తరవాత, మా పాల్ గారి ప్రవచనం తో ఆ రోజు సభ ముగిసింది. చూడబోతే మన గుడిలాగా కాకుండా వీళ్ళ చర్చి ఆదివారం అయిన సరే కొంత సేపు మాత్రమే తెరచి ఉంటుంది అనుకుంటా.. ఈ మతంలో సమయపాలన కొంచెం ఎక్కువేమో అనిపించింది. పొద్దున్నే పదిన్నర కి ప్రార్ధన అంటే అందరూ చేరుకున్నారు. పదకొండున్నర కి జారుకున్నారు. "గుడి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు తెరచి ఉండును" అని తెలిస్తే మనలో ఎక్కువ మంది చా..లా.. నెమ్మదిగా లేచి, మిగిలిన పనులు అన్నీ కానిచ్చుకొని తీరికగా వెడతాము. ఐతే మతాలలో సామ్యం కూడా కనిపించింది. వీళ్ళు గిటార్లు వాయిస్తే గుళ్ళలో భజనలు చెయ్యడం, పాస్టర్లు ప్రవచనం చేస్తే మన దగ్గర పురాణ కాలక్షేపం అలా. మనస్ఫూర్తి గా అందరి మంచి కోసం ప్రార్ధించి "నేను పాపిని" అని ఒప్పుకొని, వాళ్ళిచ్చిన కుకీలు తింటూ పేద వాళ్ళ నిధి కి కొన్ని తృణాలు ఇచ్చి తృప్తి గా బయటకి వచ్చాము.