Wednesday, March 12, 2008

మంచు తుఫాను - మనకి పాఠం

కిందటి వీకెండ్ (ఇంచుమించు శుక్ర వారం సాయంత్రం మొదలుకొని ఆదివారం వరకు) కొందరికి ఒక రోజు అటూ, కొందరికి ఒక రోజు ఇటూ గా, ఒహాయో రాష్ట్రం మొత్తం అంతా స్నో తో నిండిపోయింది (మిగిలినవి కూడా నిండే వుంటాయి గాని, నాకు ఇదమిత్థం (ఈ పదాన్ని ఇంకా కొంతమంది వాడుతున్నారు అనే అనుకుంటున్నాను) గా తెలియదు). మా ఇంటికి బంధువుల రాక కూడా అదే వీకెండ్ జరగడం వల్ల నాకు ఆ స్నో అంతటినీ పూర్తి గా experinece చేసే అవకాశం దక్కింది (ఇంటికి, విమానాశ్రయానికీ మధ్య డ్రైవ్ చేస్తూ). రెండు రోజులూ కలిసి ఒక 16-18 అంగుళాల మందాన మంచు పేరుకుపోవడం తో పెద్దల సంగతేమో తెలియదు గాని, పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసారు. సిటీ ప్రభుత్వం వారు ఆఘ మేఘాల మీద (మంచు ice గా మారకుండా) దాని మీద వుప్పు జల్లించడం, రాకపోకలు ఆగకుండా యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్లని శుభ్రపరచడం చెయ్యడం చూసి నాకు అనిపించింది.. "ఔరా!! ఇంత ఖర్చు, శ్రమ తో కూడిన పని ఐనా, ప్రతీ ఏడాది తప్పని పని ఐనా వీళ్ళు పట్టుదలతో ప్రకృతి ని ఎదిరించడానికి కూడా వెనకాడకుండా ఎంత కష్టపడుతున్నారు" అని. ఇన్ని ఖర్చులు వున్నా (ప్రతీ ఇల్లు, ఆఫీసు, పాఠశాల , గొడ్ల సావిళ్ళతో సహ అన్నీ చలి కాలం అంతా కూడా వెచ్చగా వుంచాలి కదా మరి.. దానికి బోలెడు ఖర్చు తప్పదు), ఈ ఆర్ధిక వ్యవస్థ ఇన్నేళ్ళుగా అభివృద్ది చెందుతూ ఎలా వుంది?. వెంటనే చిన్నప్పటి పాఠం గుర్తు కి వచ్చింది - సహజ వనరులని సరిగా వుపయోగించుకోవడం మీదనే ఏ జాతి భవిష్యత్తు ఐనా ఆధారపడుతుంది అని. అలా అని, ఎక్కడో కాలిఫోర్నియా లో వేడిగా వుంటుంది కదా ఎప్పుడూ అని అందరూ అక్కడకి వలస పోవడం లేదు. చావో రేవో ఇక్కడే తెల్చుకోవాలన్న కోరిక తో జీవిస్తున్నారు - అలా బ్రతుకుతున్నారు కూడా. "తెల్ల వాళ్ళు చేసేవి అన్నీ మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు మెచ్చుకుంటాము - నీది బానిస మనస్తత్వం" అని నన్ను తిట్టడానికో, కొండొకచో కొట్టడానికో రాను అంటే ఒక మాట - మన దగ్గర ఇంతకంటే చాల ఎక్కువ వనరులు వున్నాయి (ఈ వనరులు అని టైపు చెయ్యడానికి ప్రయత్నించినప్పుడల్లా "వానరాలు" అని వచ్చేస్తోంది :) ). వాటిని మనం కొంచెమైన వుపయోగించుకుంటే ఇంతకంటే ఎక్కువ అభివృద్ది సాధించడం అసాధ్యం కాదు. "అమెరికా వాళ్ళు ప్రపంచం లో 5% వుండీ, 90% వనరులు వాడేసుకుంటున్నారు " అని అనడం నిజం గా "ఆడలేక మద్దెల ఓడు" అనడమే.. ఈ గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థలో డబ్బులు ఎవడు ఇస్తే సరుకు వాడికి వస్తుంది. అమెరికా వాళ్ళు చేసేది అంతా మంచే అని నేను అనను. ఐతే వీళ్ళ దగ్గర నేర్చుకోవలసింది మాత్రం చాలా వుంది అంటాను. ప్రస్తుతం మన ఇంధన వినియోగం అమెరికా చైనా ల స్థాయి కి వస్తుంది అంటున్నారు. అలా అయితే చాలా మంచిది. ఇంకో 100 ఏళ్లలో లుప్తమైపోతుందని ఇవాళే వాడడం మానేస్తే మనం మానేశాము కదా అని ఎవరూ ఆగిపోరు. మానవుడు తనకి వచ్చే సవాళ్ళని ఎదుర్కోవాలి గాని, భయపడితే ఇక్కడే ఉండిపోతాము.

2 comments:

రాధిక said...

ఈ ఏడు మా విస్కాన్సిన్ లో ఎప్పుడూకంటే రెండు రెట్లు ఎక్కువ మంచు కురిసింది.ఉప్పు చల్లడానికి దానికి కేటాయించిన డబ్బులు అయిపోయాయట.ఉప్పు కూడా అయిపోయిందట.అందుకని ఒక్క హైవే ల్లో తప్పించి ఇంకెక్కడా ఉప్పు చల్లడం మానేసారు.మొదటి నెలలోనే చాలా ఎక్కువ మము పడడంవల్ల శీతాకాలం మొత్తానికి వాడవలసిన డబ్బులు,ఉప్పు అంతా ఒక్క నెలలోనే మంచు పరమయింది.చూడండి మా పాట్లు.బ్రేక్ వేస్తే కారు టైర్లు జారడం,లేకపోతే వేరే లైనులోకెళ్ళి ఆగడం/గుద్దడం ఇదీ పరిస్థితి.నేను స్టాపు బోర్డు దగ్గర బ్రేకు వేతే అది కాస్తా జారి పక్క లైనులో కారుని గుద్దింది.నాకు అలాగే జరిగింది.పాపం నా తప్పుకాదని నాకు టిక్కెట్టు ఇవ్వలేదు

రామ said...

అదే అదనుగా మీకు నచ్చని ప్రజల శకటాలని అన్నింటినీ wreck చేసి వదిలారా? :)