Friday, March 14, 2008

బాలమిత్ర - చందమామ

ఇప్పటికీ వస్తున్నాయి అనుకుంటున్నా. చందమామ గురించి ఈనాడు లో చదివినట్టు గుర్తు. ఏది అయితేనేం? చిన్నప్పుడు ఈ రెండింటితో బాటు, బొమ్మరిల్లు, బాలజ్యోతి (అనే అనుకుంటున్నా.. ఎవరికైనా తెలిస్తే కరెక్టు చెయ్యండి) కూడా భారీ గానే చదివేవాళ్ళం. ఐతే, మొదటి రెండూ కొనుక్కుని ఇంట్లో చదివితే, చివరి రెండూ లైబ్రరీ లో అన్నమాట. అసలు రెండు పత్రికలూ కొనడం గురించి కూడా ఒక చిన్న విశేషం వుంది. మేము ఇద్దరం - అన్నయ్య, నేను. చిన్నప్పటినుంచీ మా నాన్న గారు మా ఇంట్లో ముష్టి యుద్ధాలు, రక్తపాతాలు, వీర బాదుడులు లేకుండా ఏది కొన్నా రెండు కొంటుండేవారు. మరి నెలకి రెండు చందమామలు అనవసరం కదా (ఆ విషయం మేము 1, 2 వ తరగతుల్లోనే కనిపెట్టేసి ఒప్పేసుకున్నాము), పోనీ అది ఏమైనా దిన పత్రిక లాగ వుంటే, మధ్య పేపర్ ఒకళ్ళు, కవర్ పేపర్ ఒకళ్ళు చదివేసుకోవచ్చు. అది పుస్తకమాయే!! - అందుకని తెలివిగా, డబుల్ డోస్ లాగ నెలకి రెండు కొనేవాళ్ళు అన్నమాట.. అది కూడా ఒక నెల చందమామ ముందు వచ్చేసి, బాలమిత్ర రాలేదు అనుకోండి.. రెండూ వచ్చే వరకూ, రిస్క్ తీసుకోకుండా, వెయిట్ చేస్తాము అన్నమాట రెండోది వచ్చే వరకు. లేకపొతే వ్యవహారం మొత్తానికి చెడుతుంది అని. సరే.. మొత్తానికి ఒక ఆ పుస్తకం, ఒక ఈ పుస్తకం ఇంటికి వచ్చేశాయండీ.. మరి ఏది ఎవరు చదవాలి? దేముడు ఈ ప్రాబ్లం చాల ఈజీ గా పరిష్కరించేసాడు. నేను ఇంటికి రాగానే నెమ్మదిగా టైం తీసుకొని, కుదుట పడి, అప్పుడు దాని పని పట్టడానికి ఉపక్రమించేవాడిని. ఐతే మా అన్నగారు మరిలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోకుండా, ఇంటికి రాగానే కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా (ఈ టపా వాడు చూసాడో నేను చచ్చానన్నమాటే), మంచం మీద అడ్డం గా పడిపోయి, వాడికి కావాల్సిన పుస్తకం తీసి చదివేసుకునేవాడు. ప్రతీ నెల నేను కూడా ఈ విషయం ఏదో చూడాలి అని ఎంత తీవ్రం గా ఒట్టు పెట్టుకున్నా, తరవాతి నెలకి మళ్ళీ మరిచిపోతుంఢేవాడిని. ఈ లోగా నేను నాకు వారిచే కేటాయించబడిన పుస్తకం చదివేసెయ్యడం, కొన్ని సార్లూ ఆ పుస్తకం మన అతి వేగం వల్ల మొదటి పుస్తకం కంటే ముందే ఫినిష్ అయిపోవడం తో, అన్నయ్య వెనక్కతలే చేరి "నేనూ చదూతా" అనడం.. వాడికి చిర్రేత్తి మనల్ని తిట్టడం, కొట్టడానికి ప్రయత్నించడం, ఇంక చూసుకోండి.. "వచ్చే నెల నుంచి వీళ్ళకి కనీసం మూడు పుస్తకాలూ కొని పడెయ్యాలి" అని మా నాన్న గారు బోల్డు సార్లు తప్పక ప్రతిజ్ఞ చేసుకొని వుంటారు!! :). ఎప్పుడూ ఆయన అలా చెయ్యలేదు గాని, చేసినా మనం ఏదో ఒక వంకన యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమే కదా!.

1 comment:

mnm said...

ఇక్కడ అలనాటి చందమామ సంచికలని కొన్నిటిని చూడవచ్చు (that is Archive issues) :

http://www.chandamama.com/content/story_archive_pdf/archive.php