ప్రేమ రసాంత రంగ హృదయంగమ సుంగ సుభంగ రంగ బహు రంగధ భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప ప్రుదు సంఘ విభంగా..
దీనిని అంతటినీ ఒకే గుక్కలో మధ్యలో ఊపిరి తీసుకోకుండా చదవండి చూద్దాం? కొంచెం కష్టం అయినా చదివేసారు కదా? సరే.. ఇప్పుడు రామదాసు సినిమా లో "దాశరథీ! కరుణా పయోనిధీ" పాటలోలా పాడడానికి ప్రయత్నించండి. "అబ్బో" అంటారా? ఐతే మరి దానిలో భగవంతుడినే నిలదీస్తున్నట్టు అనిపించే భావాన్ని కూడా పొందు పరచి, రాగా తాళ యుక్తంగా పాడడం అనేది ఊహకి కూడా అందదు. అందులోనూ, 62 ఏళ్ళ వ్యక్తి ఆపని చేసాడు అంటే, అతనికి తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం వుంటే, పాడుతున్న పాటలో ఎంత మనసు లగ్నం చేస్తే అది సాధ్యం అవుతుంది? ఎవరి గురించి చెబుతున్నానో తెలిసిందిగా? తన వయసులో సగం కూడా లేని కుర్ర హీరో లకి కూడా తన "లేత" గొంతు తో పాడిన చక్కటి పాటతో అందాన్ని అద్దగలిగే "మన" SP బాలసుబ్రహ్మణ్యం గురించి. ఎవరికి వారికి "ఇతను నా గొంతుతోనే పాడేడు" అనిపించినా, సినిమా లలో కమెడియన్ వేషాల నుంచి విలన్ వేషాల వరకు వేసి శహభాష్ అనిపించుకున్నా, మ్యూజిక్ డైరక్షన్ చేసినా, ప్రయోక్తగా పని చేసినా ఆయనకే చెల్లింది.
ఆయన ఇన్నాళ్ళూ చేసిన పనులు ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్న పాడాలని వుంది మరొక ఎత్తు. నాకు గుర్తు వుండీ గత పన్నెండేళ్ళు గా మొదట ఈ టీవీ లోను, తరవాత మా టీవీ లోను కొనసాగిస్తున్న ఈ యజ్ఞం ఎందరో "తెలుగు" గాయకులని సినిమా పరిశ్రమ కి పరిచయం చేసింది. మన సినిమాలలో పాడడానికి భాష రాని పరాయి గొంతుల్ని అరువు తెచ్చుకొనక్కరలేదని, సరిగా చూస్తే ఈ నేల మీదే వాళ్ళని తలదన్నే గాయకులు వున్నారని మన సంగీత దర్శకులకి ప్రతీ వారం గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమం వెనకాల వేరే చాలా మంది వున్నా, వాళ్ళకి బాలు దొరకడం కూడా మన అదృష్టమే. దీనికి నాయ నిర్ణేతలు గా వచ్చే విద్వాంసుల్ని చూస్తేనే మనకి ఈ ప్రోగ్రాం గొప్పతనం అర్ధం అవుతుంది. సొంత డబ్బింగ్ కూడా చెప్పుకోలేని సినిమా హీరోలను, హీరోయిన్ లను కాకుండా, ఆయా కళల్లో నిష్ణాతులైన వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా తీసుకొని వస్తే ఆ కార్యక్రమం ఎంత రక్తి కడుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే, పోయిన కాలం ఎంత మంచిది అయినా, "ఈ కాలం సంగీత దర్శకుల పాటలు ఎవరి పాట ఏదో గుర్తు పడితే కోటి రూపాయలు ఇస్తాను" అనేటువంటి వ్యాఖ్యలతో నేను ఏకీభవించకపోయినా, బాలు మీద నా గౌరవం చెక్కు చెదరదు. ఏమో.. నేను చూసిన ప్రపంచం కంటే ఆయన చూసిన ప్రపంచం పెద్దది కాబట్టి, అందులో నిజం కూడా వుండవచ్చు అని అనుకుంటాను.
తెలుగు వాడికే గర్వ కారణమైన మన గాన గంధర్వుడు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని, మరింత కాలం ఆరోగ్యం గా మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ - అభినందనలు.
1 comment:
నిజమే! కళాకారుడిగా ఈ గానదంధర్వుడు ఒక ఎత్తైతే,ఇప్పుడు కళాశోధకుడిగా తను ఎత్తిన అవతారం మరో ఎత్తు.అప్పుడప్పుడూ చాదస్తం అనిపించినా,బాలు గారి విమర్శల్లో చాలా నిజముంది.ప్రస్తుత సంగీత ధోరణులూ,సాహిత్యపు విలువలపై తను వెళ్ళగక్కే బాధ ఖచ్చితంగా గుండెల్లోంచే వస్తుంది.
Post a Comment