కొత్త బంగారు లోకంలో..

నాకైతే ఇందులో పాటలు వింటుంటే భలే నిద్ర వస్తుంది. ముఖ్యం గా, "నిజంగా నేనేనా", "నేనని నీవని", "నీ ప్రశ్నలు" పాటలు వింటుంటే, అందులోనూ "నేనని నీవని" తో ఐతే మరీను. (ఈ పాటలు ఎలా వుంటాయో చాలామందికి ఈ పాటికి తెలిసి వుండడం, ఎక్కడైనా అప్లోడ్ చేయడం వల్ల పైరసీ ని పెంచిపోషించడం అవడం వల్ల ఆ mp3 లు ఇవ్వడం లేదు - రాగలహరి లాంటి చోట్ల ఎలాగు రియల్ ప్లేయర్ వెర్షన్ లు వున్నై కదా). "నీ ప్రశ్నలు" లో ఐతే బాలు గారు "బతుకంటే బడి చదువా..." అంటూ దీర్ఘం తీస్తుంటే అప్పుడే నిద్ర లేచిన వాడు కూడా మళ్ళీ deep sleep లో పడిపోయే అవకాశం ఎంతైనా వుంది.


మొత్తానికి మిక్కి J మాయర్ నిలదొక్కుకునే మ్యూజిక్ డైరెక్టర్ లాగానే కనిపిస్తున్నాడు నాకు. హ్యాపీ డేస్ లో కొన్ని పాటలకి ఒకే బాణీని ఉపయోగించినా వెరైటీ చూపించాడు. కొత్త బంగారు లోకంలో మాత్రం అన్ని పాటలు వినసొంపుగానే వున్నాయి (కొన్ని సంగీతం, సాహిత్యం రెండూ బాగుంటే, మరికొన్ని సంగీతమే). "కళాశాలలో" పాట ఏ అనంతశ్రీరాంకో, రామజోగయ్యశాస్త్రికో ఇవ్వాల్సింది అనిపించింది. డైరెక్టర్ తన సినిమాలో పాటలు తనే రాసెయ్యడం అనే ప్రయత్నం మంచిదే కాని, ఏదో లోటుగా అనిపించాయి లిరిక్స్. "కంఫ్యూజన్" లో మిక్కి కూడా అనవసరంగా గొంతు కలిపినట్టుగా తోచింది (ముఖ్యంగా "కంఫ్యూజన్, కంఫ్యూజన్" అంటూ అనవసరంగా చెవి కోసినట్టు అరవడం దగ్గర :) ). మిగిలిన పాటలు మాత్రం వేటికవే చాలా బాగున్నాయనడంలో సందేహం లేదు. అవన్నీ మంచి సంగీత, గొప్ప సాహిత్య, శుద్ధ గాత్రాల మేలుకలయిక లాగా కుదిరాయి. చాల రోజుల తరవాత సీతారామశాస్త్రి గారికి ఒక ఫుల్ లెంగ్త్ "వేదాంతం" వినిపించే పాట దొరికింది ("నీ ప్రశ్నలు నీవే" - లో). ఆయన గొప్పతనం ఏమిటంటే, అంతకు ముందు ఇచ్చిన ఏ ఉపమానం కూడా మళ్ళీ ఇవ్వకుండా "ఔరా" అనిపించేలా చెయ్యడం. మళ్ళీ ఇదే ఆల్బంలో చూస్తే "OK అనేశా" అనే పాట ఎంత జాలీగా రాసేసారో చూడండి. నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాలి. అనంతశ్రీరామ్ కూడా దగ్గరలోనే మరింత మంచి సాహిత్యం రాయబోయే సినీకవుల్లో చేరతానని "నిజంగా నేనేనా"లో ప్రకటించాడు. ఈ బంగారానికి తావి మాత్రం కార్తీక్ అద్దాడు తన మధురమైన గాత్రంతో ("నిజంగా నేనేనా" మచ్చుకి).


(కొనుక్కొని) తప్పక వినాల్సిన పాటలు ఇవి.

Comments

Change Maker said…
Nice review. Lyrics should have been written better

Popular posts from this blog

పాలకూర అన్నం

కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం (Telugu in your computer)

మంచి మనిషి.