మామూలుగా స్కూళ్ళ ముందర పిల్లల్ని ఊరించడానికి కొన్ని చోట్ల ఐస్ క్రీమ్ లు, మరి కొన్ని చోట్ల పీచు మిఠాయి, సోం పాపిడి, ఇంకొన్ని చోట్ల "మామ్మలు" మామిడికాయ పెచ్చుల మీద కారం రాసి, వేరు సెనగ కాయల్ని తంపడ వేసి, అమ్ముతుండడం జరుగుతుంది కదా.. అలాగే మా అభ్యుదయ పాఠసాల ముందు కూడా అమ్ముతుండే వారు. అవి ఎంత శుభ్రం గా వుంటాయో తెలుసు కాబట్టి, మా జార్జి మేష్టారు, ఆయన భార్య (ఆవిడ హెడ్ మాస్టర్ అన్నమాట) మా ఆరోగ్యం కాపాడడానికి ఒక బృహత్తర పధకం వేశారు. మొగల్తూరు లో మీనా బిస్కట్ కంపెనీ ఒకటి వుండేది. రోజూ ఒక టెంపో లాంటి పెద్ద కార్ లో అక్కడ నుంచి భీమవరం కి (అనుకుంటాను) ఒక కారుడు బిస్కట్ లు రవాణా అవుతూ వుండేవి. పిల్లల దృష్టి ఆ స్కూల్ బయట అమ్మే వస్తువుల నుంచి మరల్చడానికి మా టీచర్ లు రోజూ ఆ మీనా బిస్కట్ కంపెనీ నుంచి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొని వచ్చి అన్ని క్లాస్ ల లోనూ అమ్ముతూ వుండే వారు (బిస్కట్ 5 పైసా లకి - "నువ్వు ఈ కాలం వాడివి కాదురా బాబూ అంటారా? మీ తప్పు లేదు). ఆ ఐడియా మా జీవితాలని ఐతే ఏమి మార్చెయ్యలేదు గాని, మాకు మళ్ళీ కొట్టు మీదకి వెళ్లి బిస్కట్ లు కొనే బాధ తప్పించింది. దానికి తోడు, "స్కూల్ లో బిస్కట్ లు కొనుక్కుంటాము" అనే మిష మీద మన పాకెట్ మనీ కూడా నాన్నారు నుంచి నిరభ్యంతరం గా వచ్చే అవకాశం కూడా కల్పించింది. ఇలా వుండగా, ఒకానొక రోజు, నేను, అన్నయ్య, ఇంకో ఫ్రెండ్ (వాడి పేరు మర్చిపోయా..) స్కూల్ కి వస్తూ వుంటే, ఆంజనేయ స్వామి గుడి ముందు ఇసక లో బోలెడన్ని (నిజం గానే బోలెడన్ని - మేము లేక్కెట్టుకోడానికి కూడా బోర్ కొట్టేన్ని) పావలా బిళ్ళలు దొరికాయి. ఇంకేముంది? క్లాస్ లో మన "పార్టీ" వాళ్ళు అందరికీ పార్టీ అన్నమాట. "ఇన్ని పావలా బిళ్ళలు ఎక్కడ నుంచి వచ్చాయిరా" అని మాష్టారు అడగలేదు.. మనం చెప్పలేదు. ఫేవరేట్ హీరో ఫస్ట్ ఆట కి సినిమా హాల్ అంతా బుక్ చేసేసినట్టు, బల్ల మీద బిస్కట్ ప్యాకెట్ అంత మన పావలా పవర్ తో లేపెసాము!.
మా నాన్నారి బ్యాంకు లోంచి లోన్ తీసుకొని కొంతమంది మొగల్తూరు లో ఒక రీఫిల్స్ ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్యాక్టరీ అంటే, అదేదో 1000 మంది పనిచేసేరు అనుకునేరు!. ఒక పెంకుటింటి పరిశ్రమ అన్నమాట (కుటీర పరిశ్రమ లాగ). ఒక రోజు నాన్న గారు అక్కడ కి వెడుతూ వుంటే మేము కూడా వెనకాలే బయల్దేరాము. అప్పుడు ఆ కంపెనీ యజమాని మాకు డెమో ఇచ్చారు.. "బాలు ముల్కులు" (ఎందుకో తెలియదు గాని, వాటిని అలా పిలిచేవాళ్ళం అప్పుడు) ఎలా తయారు చేస్తారో!. మెషిన్ లో ఖాళీ రీఫిల్ పెట్టి స్విచ్ నొక్కగానే "జుయి" మంటూ అందులోకి ఇంకు చేరడం చూసి మహా ఇమ్ప్రేస్స్ అయిపోయాము అనుకోండి. అప్పుడే నిర్ణయించేసుకున్నా నేను - జీవితం లో పెడితే ఒక బాలు ములుకుల ఫ్యాక్టరీ పెట్టాలి అని. అయితే, కారణాంతరాలవల్ల తర్వాత మన ఐడియా ని రేనాల్డ్స్ వాడు కొట్టేసి రిచ్ అయిపోయాడు అనుకోండి.. మనం ఇలా సాఫ్ట్వేర్ లో సెట్ అయిపోయము అన్నమాట. అదీ సంగతి!!.
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago
2 comments:
nostalgic and impressive,good..
sriram velamuri
మీ బ్లాగు బాగుంది.
అయితే, కారణాంతరాలవల్ల తర్వాత మన ఐడియా ని రేనాల్డ్స్ వాడు కొట్టేసి రిచ్ అయిపోయాడు అనుకోండి.. మనం ఇలా సాఫ్ట్వేర్ లో సెట్ అయిపోయము అన్నమాట.
ఈ లైన్స్ నవ్వు తెప్పించినాయి.
తెలుగు బ్లాగ్గేర్లకు: నా బ్లాగుని ఎవయినా సైట్స్ లో పెట్టి అందరికీ చేరేలా చేయటం ఎలాగో తెలిపి హెల్ప్ చెయ్యండి.
Post a Comment