Friday, August 1, 2008

పిల్లలకి ఎత్తు మప్పడం, పేర్లు పెట్టడం

మప్పడం = నేర్పడం (అటూ ఇటూ గా)

ఇది ఈమధ్యే మాకు అనుభవంలోకి వస్తోంది. పిల్లవాడిని తీసుకొని (అంటే ఎత్తుకొని) ఎక్కడికి వెళ్ళినా, ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలూ అయ్యాక, చాలా మంది (particular గా ఇప్పటికే మూడు నాలుగు ఏళ్ళ వయసు గల పిల్లలు వున్నవాళ్ళు) అడుగుతూ వుంటారు.. "ఆ .. ఏమిటీ.. మీ వాడికి ఎత్తు అలవాటు అయిపోయిందా" అంటూ. మొదట, ఎత్తు అలవాటు అయిందో లేదో మనం కలిసిన పది పదిహేను నిముషాలలో ఎలాగూ తెలియదు (అది వాళ్ళ గెస్ మాత్రమె) - రెండోది, ఎత్తుకోవడం ఏదో పెద్ద అపరాధం అయినట్టు, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పిల్లలని ఎత్తుకొని మొయ్యనట్టూ, ఎత్తుకోవడం అంటే వాళ్ళకి దొంగతనం నేర్పడం అంత పాపం అయినట్టూ అడుగుతారు :). ఎవరో మావాడు పుట్టిన మొదట్లో అన్నారు, కొంచెం వయసు వస్తే పిల్లలకి వ్యాపకాలు ఎక్కువ అయి (ఇది మంచిదే మరి) మన దగ్గర ఎక్కువసేపు కుదురుగా ఎలాగూ కూర్చోరు.. ఈ మొదటి ఒకటి రెండు ఏళ్ళలోనే వాళ్ళని తనివి తీరా దగ్గరకి తీసుకొని ఉంచుకోవాలి అని. అందులో నిజం ఎంత వున్నా, ఈ వయసులో తల్లితండ్రులే కాకుండా ఎవరు ఎత్తుకున్నా ఆ మానవ స్పర్శ వాళ్ళలో సురక్షాత్మక భావనను కలిగిస్తుంది. అంతవరకు ఎందుకు? మేమిద్దరం కూర్చొని వాడిని మధ్యలో వుంచి రెండు బొమ్మలు ఇస్తే, వాడు మా మీద ఎక్కి తొక్కుతూ, బోర్లా పడుతూ, లేస్తూ, గంటలు గంటలు అక్కడే ఆడుకుంటుంటాడు (మిగిలిన సమయాల్లో పతుక్కునే అలమారాలు, టీవీస్టాండ్లు అవీ అప్పుడు వాడికి అసలు గుర్తుకి రావు). అందుకే, ఎవరైనా "ఎత్తు అలవాటు అయిందా మీ వాడికి" అని అడిగితే, "లేదు.. మేమే మప్పాము" అని చెప్పదలచుకున్నాము :).

ఇంకో విషయం ఇక్కడ అమెరికా లో ఉండేవాళ్ళకి ఎక్కువ అనుభవం లోకి వచ్చేది: మొన్న మా ఆఫీసులో నాతో బాటు పనిచేసే ఒక తమిళ కుర్రాడు అమెరికన్స్ cube లు అన్నింటికీ వెడుతూ వాళ్ళని ఏదో అడగడం కనిపించింది. ఏమిట్రా అని ఆరా తీద్దును కదా.. వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టబోతోందిట.. ఆ అమ్మాయికి ఏ పేరు పెడితే అమెరికన్లు సులువుగా పలకగలరో చూద్దామని అందరి దగ్గరకీ వెళ్లి వాళ్ళు అనుకుంటున్న పేర్లు చెప్పి అది వాళ్ళు ఎలా పలుకుతారో టెస్టు చేస్తున్నాడుట.. వాళ్ల ఆవిడ "మృదుల" అని పెడదామని, వీడేమో, అది అమెరికన్స్ కి కష్టం గా వుంటుంది .. సింపుల్ గా "రియా" అని పెట్టేద్దాము అని కొట్టుకుంటున్నాము అని చెప్పాడు. వెంటనే "ఒరే.. నీకు పిచ్చా వెర్రా" అని అడిగేద్దాము అనిపించింది. వాడికి తెలుగు రాక, నాకు తమిళం రాక, ఇంగ్లీష్ లో అంత effect వుండకపోవడం చేత అది అడగడం జరగలేదు అనుకోండి. కాని, ఇలాంటివి చాలామంది చేస్తూ వుంటారు. మన సంస్కృతి, అభిరుచి, ఇష్టానికి తగ్గట్టు మనం పేరు పెట్టుకోవాలి గానీ, వాడెవడో పలకగలిగేలా పెట్టుకోవాలి అని ఎందుకు అనుకోవడం? రేపు పొద్దున్న ఈ కంప్యూటర్ లు కూలిపోయి, ఆయిల్ రేట్ పెరిగిపోయి అందరికీ అరబ్బు దేశాల్లో వుద్యోగాలు వచ్చేస్తే అక్కడ వాళ్ళు పలకడం కష్టం అయిపోతుంది అని కూతురి పేరు మార్చేస్తాడా అనిపించింది. వేరే భాషలోకి (ముఖ్యం గా ఇంగ్లీష్) మార్చినప్పుడు పెడర్ధాలు వచ్చేలాగ పెట్టకుండా చూసుకుంటే చాలు అని నా ఉద్దేశ్యం. ఈ బానిస మనస్తత్వం మనకే వుంటుందేమో అని ఒక చిన్న భయం కూడా. ఇతర దేశాల వాళ్లు ఎవరూ కూడా పేరు పెట్టేముందు అమెరికన్స్ ని consult చెయ్యడం నేను చూడలేదు. తరవాత మా మేనేజర్ వచ్చి ఈ విషయం అంత చూసి ఫెళ్ళున నవ్వి, "ఇందులో ఇంత కష్టం ఏమి ఉంది" అంటూ, వొత్తుల మరియు హల్లుల భూయిష్టమైన నా మొత్తం పేరుని ఒక్క గుక్కలో సింపుల్ గా చెప్పెయ్యడం ఈ కధ కి కొస మెరుపు!.

3 comments:

రవి వైజాసత్య said...

ఇతర దేశాల వాళ్లు కన్సల్ట్ చేయరండీ..నేరుగా అమెరికన్ పేర్లే పెట్టేస్తారు..కావాలంటే ఎవరైనా చైనా వాళ్ళని అడగండి ;-) కార్పోరేటు అమెరికాలో ఎదగడానికి అవరోధమని పేర్లు మార్చుకున్న గ్రీకు జనాలు నాకు చాలామందే తెలుసు..కాబట్టి జబ్బు మనది కాదు..అంతా అమెరికా మయం..జగమంతా అమెరికా మయం

Kottapali said...

అమెరికాలో నివసించడానికి డిసైడైపోయిన మన జనాలు పిల్లలకి కాస్త పలకడానికి వీజీగా ఉండే పేర్లు పెట్టాలి అనుకోవడం అంత వెర్రేమీ కాదు, నిజానికి చాలా ప్రాక్టికల్. మన తమిళ సోదరుడిలాగా సర్వేలు నిర్వహించ నక్కర్లేదనుకోండి.

పసి పిల్లల్ని గురించి ఇతరుల (బంధు మిత్రుల) మాటలు బాగా రాశారు. జనాలకి తమ అతితెలివి చూపించేసుకోవాలని అదేం దురదో!

శాంతి said...

పేరు మార్చుకున్నా ముఖాలు మారుతాయతండీ? ఉన్నట్టుండి, నేను Tom Robertson అని పేరు మార్చేసుకుంటే నన్ను మేనేజర్ ని చేసెయ్యరుగా? మన వాళ్లు మళ్ళీ మిగిలిన వాళ్ళలాగా పూర్తిగా అమెరికన్ పేర్లు పెట్టరు. మన పేర్లనే వాళ్ళ ఇష్టంతో పెట్టాలి అనేటువంటి ఒక త్రిశంకు స్వర్గం టైపు situation లో కొట్టుమిట్టాడుతూ వుంటారు :)