మొత్తానికి మొన్న మంత్ర చూశాము. "ఇన్నాళ్లకా" అనుకోకండి. ఏ వంట చేసుకుంటూనో, పిల్లాడిని అడిస్తూనో సినిమా లు చప్పరించెయ్యడం కంటే, కాస్త తీరిక దొరికినప్పుడు, చక్కగా కూర్చొని, దృష్టి పెట్టి చూడడం అంటే మాకిష్టం వల్ల డీవీడీ వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అందులోనూ, హారర్ సినిమా లు ఫుల్ సౌండ్ తో భయపడుతూ చూస్తే బాగుంటుంది కదా! ... (మీరు ఇప్పటికీ చూడకపోతే కింది పేరా చదవద్దు).
ఈ సినిమా కి, ఇదివరలో వచ్చిన "ఎ ఫిల్మ్ బై అరవింద్" కి పోలికలు కనిపించాయి (క్లైమాక్స్ లో ఐతే తప్పకుండా). ఐతే ఈ సినిమా లో ఎవరు చేసారో చెప్పి, ఎందుకు చేసారో విశదం చెయ్యడం వల్ల సినిమా ని పూర్తి గా చూసి, ఆ మిస్టరీ ఏదో మనమే సాధించిన ఫీలింగ్ వచ్చింది. (అరవింద్ లో చివర్లో విలన్ ఫలానా అని చూపించారు కాని, అలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం మీద వివరణ లేదు). దానికి తోడు, సంగీత పరంగా, నటన పరంగా కూడా ఈ సినిమా ఒక ఆకు ఎక్కువ చదివింది అని చెప్పవచ్చు. కధ జరుగుతున్నంత సేపూ, అత్మహత్యలని కూడా "దెయ్యమే" చేసింది అనుకోవడం, చివర్లో ఆ మిస్టరీ ని చేదించడం కూడా బాగుంది. ఒక దశలో మంత్రే దెయ్యమని మనల్ని ఆల్మోస్ట్ నమ్మిస్తాడు దర్శకుడు. కాదని గ్రిప్పింగ్ గా చెప్పడంలో కృతక్రుత్యుడైనట్టు తోస్తుంది . కొన్ని కంటిన్యుటి లోపాలు (మునుస్వామి చనిపోగానే వున్నట్టుండి స్నేహితులు మాయం అయిపోవడం లాంటివి) అక్కడక్కడ వున్నా, శివాజీ తన పాత్రను బాగానే పోషించాడు.. ఈ సినిమా పేరు చెప్పి కనీసం ఒక రెండు మూడు కేజీ ల ఆరోగ్యం పాడుచేసుకొని వుంటాడు అనిపిస్తుంది (సిగరెట్లు తాగుతూ). కరుణ (మా టీవీ యువ ఫేం) పాత్ర బానే వుంది గాని, ఓపెనింగ్ సీన్ లో ఖంగారు పెట్టింది. మొత్తానికి ఈ సినిమా మాకు నచ్చింది.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
No comments:
Post a Comment