తల్లి పాలు.

(ఈ టపా కి వ్యాఖ్యలు వ్రాసినవారందరికీ కృతజ్ఞతలు. వారి వ్యాఖ్యల వల్ల మరిన్ని అంశాలు జోడించడం జరిగింది)కిందటి సంవత్సరం జూన్ లో ప్రసారం చేసిన బాలు గారి పాడాలని వుంది రికార్డింగ్ చూస్తూ వుంటే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తల్లి పాలు అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మంచివి అనీ, మన వాళ్ళు (చాలా మంది) ఆ విషయం తెలుసుకోకుండా, పిల్లలు పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగనివ్వరనీ, దీనిని నిరోధించాల్సిన అవసరం ఉంది అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా మొట్ట మొదటి రియాక్షన్ ఏమిటంటే, అలా చేసే వాళ్ళని ఒక గది లో వేసి బంధించి "మా తప్పు తెలిసింది మహాప్రభో" అనేవరకూ రోజూ రెండు పూటలా ఇంత పచ్చగడ్డి పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అమృతతుల్యమై, రోగ నిరోధక శక్తి ని కలిగించే తల్లి పాలు దూరం చేసి పిల్లలకి పోత పాలు పోస్తే వాళ్ళకి ఎలా వుంటుందో!!. అసలు బిడ్డ పాలు తాగకపోతే ఆ తల్లి కి ఎదురయే కష్టం కూడా (engorgement (పాలిండ్లలో పాలు నిండిపోయి నెప్పి పుట్టడం) వల్ల) వర్ణించనలవి కాదు. సృష్టి లో జరిగే ప్రతీ విషయం కూడా పరస్పర ఆధారితం గా జరుగుతుంది (Symbiosis). పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తి కావడం, అప్పుడే పుట్టిన బిడ్డ కి ఏమి తెలిసినా తెలియకపోయినా పీల్చే ఒక్క విద్య (sucking instinct) మాత్రం తెలవడం, బిడ్డ పాలు తాగగానే తల్లికి తేలికగా అనిపించడం - ఇది సృష్టి ధర్మం. దానికి విరుద్ధం గా "అప్పుడే పుట్టిన బిడ్డ కి తల్లి పాలు ఇస్తే "దోషం"" అనో, పసుపు రంగులో వుండే చిక్కని పాలు ("మురుగు పాలు" అనో, మరొకటనో) తాగితే బిడ్డకి అరగవు అనో అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. మిడి మిడి జ్ఞానంతో అన్నీ తమకే తెలుసునని అనుకోవడం, తాము అనుకున్నదే కరెక్ట్ అని, తమ ఆధిపత్యం నిరూపించుకోవడమే లక్ష్యమని అనుకునే కొందరు మొదలు పెట్టిన ప్రచారం ఇది. ఆఖరికి తల్లి కి జ్వరం వచ్చినా కూడా పిల్లలకి పాలు ఇవ్వడం ద్వారా అది వాళ్ళకి సంక్రమించదంటే తల్లి శరీరం లో పాలిచ్చే వ్యవస్థ ఎంత ఎస్టాబ్లిష్ అయి వుందో తెలుస్తుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత అభివృద్దిని సాధించినా, తల్లి పాలలో వుండే గుణాల్ని లేబరేటరీ లలో సృష్టించలేకపోయారు. సృష్టి కి ప్రతి సృష్టి చెయ్యడం సాధ్యమా? బిడ్డ భవిష్యత్ తెలివితేటలు, మానసిక ఎదుగుదల అన్నీ కూడా పుట్టిన మొదటి కొద్ది రోజుల్లో తల్లి నుంచి అందే పోషకాల మీద ఆధారపడతాయని ఎన్నో స్టడీలలో నిరూపించారు. దానికి విరుద్ధం గా బిడ్డని తల్లిని వేరు చెయ్యడానికి ప్రయత్నించే చేతుల్ని విరగ్గొట్టడం ఏ మాత్రం తప్పు కాదు.మరొక విషయం గర్భిణి స్త్రీలు తినవలసిన ఆహారం. తల్లికే బలం లేకపొతే బిడ్డ కడుపు లో వున్నప్పుడు అందివ్వాల్సిన పోషకాలు అందివ్వలేకపోవడం, తద్వారా బిడ్డ కి విత్తు గా వున్నప్పుడు అంది అరాయించుకోవాల్సిన గుణాలు అందకపోవడం జరుగుతుంది. పెద్ద వాళ్ళని విమర్శించడమే కాకుండా ఒక గర్భవతి గా మనం ఏమి చేస్తున్నామో కూడా పరికించుకోవాలి. కొంత మంది గర్భం దాల్చగానే, అది తమకి ఇష్టం వచ్చిన వస్తువులన్నీ తినెయ్యడానికి లైసెన్సు వచ్చిన సందర్భం గా అనుకోవడం కనిపిస్తుంది. చాల మంది ఇతర ఆడవాళ్ళు కూడా "ఇప్పుడు నిన్ను ఎవరూ ఏమి అనరు - నీ ఇష్టం వచ్చినంత తినొచ్చు" అని ప్రోత్సహిస్తారు (చాల మంది తాము చెయ్యలేకపోతున్నది మరొకరి చేత నైనా చేయించి చూసి తమకి తెలియకుండానే తృప్తి చెందుతారు). "ఎంత తిన్నా ఇప్పుడు నీకు ఏమి చెయ్యదు" అని చెప్పడం కూడా కద్దు. ఎక్కువ తినడం కన్నా, బలవర్ధకం గా తినడం అనేది ముఖ్యం. "ఇద్దరి కోసం తినాలి" అనేది ఎంత నిజం ఐనా, "ఇద్దరికోసం సరిపడా పోషకాలు తీసుకోవాలి" అనేది అసలు విషయం. గర్భవతి గా వున్నప్పుడు బరువు పెరగడం సహజమే ఐనా, "అతి సర్వత్ర వర్జయేత్" అని అతి బరువు కూడా డెలివరీ దగ్గర complications కలిగిస్తుంది. సిజేరియన్ అవసరం అవడానికి overweight గా వుండడం కూడా ఒక కారణం. తినడం, దానితో బాటు సరైన వ్యాయామం చెయ్యడం అవసరం. వ్యాయామం తిన్న దానిలో junk ని కరిగించడం తో బాటు, తిన్నది వంటికి వంటబట్టేటట్టు చేస్తుంది. నెలలు నిండి, డెలివరీ దగ్గరకి వచ్చేకొద్దీ కడుపు లో బరువు తో వ్యాయామం చెయ్యడం కష్టం అవడం జరుగుతుంది. ఐతే, పూర్తి గా మానివెయ్యకుండా చివరి వరకు చెయ్యడం ముఖ్యం. High risk pregnancy లలో డాక్టర్ లు చివరి రోజుల్లో (కొన్ని సార్లు పూర్తిగా) వ్యాయామం చెయ్యవద్దని చెప్పడం కూడా జరుగుతుంది - అటువంటి పరిస్థితులలో తప్ప, వ్యాయామం (కొద్ది కొద్ది గా నడుస్తూ వుండడం, శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు చెయ్యడం) వదలక్కరలేదు. Pregnancy మొదలు అయిన మొదటి ఆరు వారాల్లో నాలుగు లో ఒక pregnancy అబార్షన్ తో ముగుస్తుందని, ఆ ఆరు వారాలు గడిస్తే, చాలా pregnancy లు చివరి వరకు ఇంచుమించు గా కొనసాగుతాయని డాక్టర్ లు చెబుతారు. ఐతే, ఏదేని కారణం చేత మధ్యలో abort అయితే ఆ అమ్మాయి ఈ పని చేసింది, ఆ పని చేసింది, అందువల్లనే అలా జరిగింది అని వేళ్ళు చూపించడానికి అందరూ సిద్ధం అయిపోతారు. మనం మరీ బండ గా వ్యాయామం (అప్పటి వరకు వాకింగ్ కూడా అలవాటు లేని వాళ్ళు వున్నట్టుండి పరుగులు ఎత్తడం మొదలు పెట్టడం లాంటివి) చెయ్యకపోతే, అలా జరగడానికి వ్యాయామం కారణం కానేకాదని నాకు మొదటి సారి జరిగినప్పుడు డాక్టర్ బల్ల గుద్ది మరీ చెప్పారు. మేము మొదటి సారి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన handout మీద వున్న నినాదం నాకు బాగా నచ్చింది.. ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు చూసుకోవాల్సిన మూడు "w" లు Walking, Water and Weight. వ్యాయామం, బరువుతో బాటుగా, వీలు అయినన్ని నీళ్ళు తాగడం చాలా మంచిది. వ్యాయామం వల్ల కండరాలు flexible గా తయారై, డెలివరీ సమయం లో చాలా సులువుగా సంకోచ వ్యాకోచాలు చెంది, పురుడు సాఫీ గా అవుతుంది. తరువాత కూడా, రికవరీ కి తక్కువ టైం పట్టడం, ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడం చూడవచ్చు. "గర్భిణి స్త్రీ భోజనం లో తప్పకుండా నెయ్యి వేసుకోవాలి, చిక్కని పాలు తాగితే రేపు బిడ్డ పుట్టాక పాలు బాగా పడతాయి" అనుకోవడం కూడా మిధ్యే. నెయ్యి లో ఉన్న కొవ్వు తల్లి ఒంట్లోనే వుండిపోతుంది తప్ప బిడ్డ "లావు" గా పుట్టడం జరగదు. అలాగే, ఎన్ని పాలు తాగినా అవి బిడ్డకి ఇవ్వడం కోసం శరీరం నిలవ ఉంచుకోదు. పాలు అనేవి తల్లి శరీరానికి ఉపయోగించడానికే కాబట్టి ఆమెకి సరిపడా మాత్రమే తీసుకోవడం మంచిది (అమెరికా లో కొవ్వు తీసేసిన (ఫాట్-ఫ్రీ) పాలు వేరుగా దొరుకుతాయి. నేను గర్భవతిని అయినప్పుడు మేము అప్పటి వరకు వాడుతున్న ఫాట్-ఫ్రీ పాలు కాక వేరే పాలు తాగాల్సిన అవసరం లేదని చెప్పారు డాక్టర్). మొత్తం ప్రెగ్నన్సీ అంతట్లో, మనం సాధారణంగా 25-30 పౌండ్లు (11-14 కేజీలు) మించి బరువు పెరగడం మంచిది కాదు అని చెబుతారు. ఈ range మన height ఎంత, pregnancy కి ముందు మనం ఎంత బరువు ఉన్నాము అనేదాన్ని బట్టి కొద్దిగా మారినా, పెద్ద తేడా లేదు.
అలాగే, "పథ్యం" పాటించడం. ఆ పండు తింటే జలుబు చేస్తుందనో, ఈ పప్పు తింటే అరగదు, చీము పడుతుంది అనో, పాలు తాగితే ఇంకోటనో, తల్లి కి ఏమీ పెట్టకుండా మాడుస్తారు. నిజానికి ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా పర్లేదు గానీ, పిల్లకి పాలిస్తున్న తల్లి కడుపు నిండా సంపూర్ణాహారం తినడం ఎంతో ముఖ్యం. నిజమే, పురుడు వచ్చిన మొదటి ఒకటి రెండు రోజుల్లో తినాలని లేకపోయినా, సిజేరియన్ లాంటి సందర్భాల్లో డాక్టర్ లు ఒకటి రెండు రోజులు తినవద్దని చెప్పినా పరవాలేదు గాని, పథ్యం వెర్రి తలలు వేసి, ఆరు నెలలు, ఏడాది పాటు తల్లికి ఏమీ పెట్టకుండా, పిల్ల కి ఇవ్వడానికి పాలు కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయి? ఇంక అక్కడ నుంచి "బిడ్డ కి ఇవ్వడానికి పాలు రావట్లేదు" అని తల్లిని తక్కువ చెయ్యడమో, పాలు పడడం కోసం మందులు వాడడం మొదలు పెట్టడమో చేసేకంటే, తల్లికి సరైన ఆహారం పెడితే జరగాల్సిన విషయాన్ని సృష్టే చూస్తుకుంటుంది అనే ఇంగితం కరువవుతోంది మన వాళ్ళకి. కొన్ని ప్రదేశాలలో తల్లికి పాలు ఇస్తే బిడ్డకి మంచిది కాదు అని, కాఫీ తప్ప మరోటి తాగనివ్వరట. ఎంత అన్యాయం! పిచ్చి నమ్మకాలు ఎలా ఉంటాయంటే భోజనం తరువాత తల్లి నిద్ర పొతే "మంచిది కాదు" అని పడుకోనివ్వకుండా మనుషులు కాపలా కూర్చోవడం! డెలివరీ అయ్యాక నీరసం, అసహనం, డిప్రెషన్, నిద్రలేమి లాంటి వాటితో బాలింతరాలు బాధపడుతూ ఉంటుంది. ఈ సయమం లో సరైన భోజనం, కంటినిండా నిద్ర ఎంతైనా అవసరం.ఇక్కడ డెలివరీ అయిన తరవాత వెంటనే తినడానికి బీన్సు, ఉడికించిన బంగాల దుంపలు అవీ ఇస్తారు (వ్యాఖ్యల్లో రాధిక గారు చెప్పినట్టు). ఆరెంజి జ్యూస్, పాలు లాంటివి సర్వ సాధారణం. నా డెలివరీ తరవాత అదే హాస్పిటల్లో పనిచేసే తెలుగు డాక్టర్ని అడిగితే పప్పులు, కూరలతో బాటు ఏమి తిన్నా పరవాలేదు అని చెప్పారు. అది నిజం కూడా. ప్రెగ్నన్సీలో బొప్పాయి తినవద్దని, గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ (ఇది మన దగ్గర (ఇండియా లో) దొరుకుతుందో లేదో తెలియదు) తాగవద్దని ఐతే మాత్రం చెప్పారు. అవి తాగడం వల్ల దోషం వుందని నిరూపించబడలేదు గాని, వాటిలో ప్రెగ్నన్సీ కి వ్యతిరేకం గా పని చేసే ingredients ఉండవచ్చని అంటారని చెప్పారు. ఒకసారి డెలివరీ అయిన తరవాత ఇంక తినదగిన వస్తువులు, తినకూడని వస్తువులు అంటూ ఏమీ లేవు. ఇష్టం ఐనవి ఏమైనా తినొచ్చు. కాకపోతే తల్లి వద్ద నుంచి పిల్లలకి పాలు వెడతాయి కాబట్టి, మనం తినే వాటిని బట్టి పిల్లలు effect అయే అవకాశం ఉంది. అందుకని, పిల్లలు మామూలు కంటే ఎక్కువగా ఏడుస్తున్నా, వాళ్ళకి విరేచనం రెగ్యులర్ గా అవకపోయినా, మనం ఏమి తిన్నాము అని కూడా (పిల్లల) డాక్టర్ లు అడుగుతారు. కానీ, వాళ్ళ ఆ ప్రవర్తన కి ఇది ఒక్కటే కారణంగా పరిగణించడం జరగదు. చాలా సార్లు వాటి రెంటికీ సంబంధం ఉండదు కూడా. ప్రెగ్నంట్ గా వున్నప్పుడు చెప్పిన సూత్రమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇద్దరి కోసం తినాలి కదా అని ఎక్కువ తినడం సరికాదు. బలవర్ధకమైన పోషకాహారం తినడం, వ్యాయామాన్ని ఎంత తొందరగా వీలు ఐతే అంత తొందరగా తిరిగి మొదలు పెట్టడం (ఇది మాత్రం కొత్తగా తల్లి ఐన వారికి చాల కష్టం అనిపిస్తుంది - రోజులో వంద గంటలు వున్నా సరిపోని పని వుంటుంది పిల్లలతో - ఐనా సరే, ఎక్కడ దొరికిన ఎక్సరసైజ్ అక్కడ చెయ్యడం తప్పదు). సృష్టి లో గొప్పదనం ఏమిటంటే, అది ఎప్పుడూ కూడా, దేనిలోనైనా సరే "equilibrium" (సంతులనం) కోసం ప్రయత్నిస్తూ వుంటుంది. డెలివరీ కాగానే, శరీరం తిరిగి మామూలు స్థితి కి చేరుకోవడానికి ప్రయత్నాలు వెంటనే మొదలు పెడుతుంది. చర్మం సంకోచించి తిరిగి ప్రెగ్నన్సీముందు స్థితి ని చేరడానికి ప్రయత్నించడం, గర్భసంచి తిరిగి మరొక ప్రెగ్నన్సీకి సిద్ధంగా పూర్వ స్థితికి చేరడం, కొద్ది నెలల్లో నెలసరి మొదలు కావడం ఈ కోవలోకి వస్తాయి. ఐతే శరీరం ఎంత ప్రయత్నించినా, మనం అది అనుకునే స్థాయి కి మించి తినడం జరుగుతుంది కాబట్టి మన చేయూత కూడా దానికి అవసరం (ఎక్సరసైజ్ రూపం లో). బంగాళాదుంపలు లాంటివి carbohydrates కావడం వల్ల వాటికి బరువు పెంచే గుణం వుండడం వల్ల వాటిని మితం గా తీసుకోవచ్చు. మానెయ్యక్కర్లేదు. అన్నం కూడా కార్బ్స్ category కి చెందుతుంది కాబట్టి ఒక పూట అన్నం బదులు రెండు చపాతీలు, బోలెడంత కూర తో రిప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక నడుముకి గుడ్డ కట్టుకోవడం అనేది హెల్ప్ చేస్తుందని అంటారు. నేను ఇందాక చెప్పిన తెలుగు డాక్టర్ గారు కట్టుకోమనే సలహా ఇచ్చారు. మొదటి రెండునెలల్లో ఇది బాగా వాడాలి అని చాలా సార్లు విన్నాను. ఒక సంగతి ఏమిటంటే, మరీ ఊపిరి ఆడనంత గట్టిగా కట్టెయ్యకుండా ఉంటే దాని వల్ల నష్టం ఏమీ వుండదు. శరీరానికి adoptability ఉంటుంది కదా. (ఏ దేశం లోనో మరచిపోయాను. అక్కడ ఆడవాళ్ళు మెడకి మన పెద్ద వాళ్ళు కాళ్ళకి వేసుకొనే పెండేరాలంటివి వేసుకొని ఉంటారు. దానికి చోటు చెయ్యడం కోసం మెడ సాగుతుంది. అప్పుడు ఇంకోటి తగిలిస్తారు. అలా వాళ్ళ మెడలు సాగుతూనే వుంటాయి - మెడ ఎంత పొడుగ్గా వుంటే అంత గొప్పట). ఆ సూత్రం ప్రకారం ఆలోచిస్తే ఈ గుడ్డ కట్టడం వల్ల నడుము దగ్గర చర్మం తిరిగి పూర్వ స్థితి కి వెళ్లడానికి సహాయం చేస్తుంది అనిపిస్తుంది. ఈ విషయం అమెరికా లో డాక్టర్ లకి ఆశ్చర్యం గా అనిపించడానికి కారణం వాళ్ళు ఇక్కడ కొత్తగా తల్లి ఐన వారికి ఎక్సరసైజ్ చెయ్యమని చెబుతారు. అది తప్ప మరేది అవసరం లేదు అని వాళ్ళ అభిప్రాయం. మన దగ్గర ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎక్సరసైజ్ చెయ్యడం అనేది (ఈ కాలం లో కాదు గాని, ఇది వరకు) వింత విషయం కాబట్టి మన వాళ్ళు దానికి ప్రత్యామ్నాయం గా అది చెబుతూ ఉండి ఉండవచ్చు. ఇండియా లో కొందరు డాక్టర్ లు కూడా పథ్యం ఎందుకు చెయ్యలేదు అని అడగడం ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా అని కూడా అనుకుంటాను. వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏమి లేదు - అలాంటి వాళ్ళని avoid చేసి వేరే వాళ్ళ దగ్గరకి వెళ్ళడం తప్ప. ఇండియా లో నాకు తెలిసిన చాలా మందికి (మా ఆడపడుచులు, ఫ్రెండ్స్ కి) డాక్టర్ లు పథ్యం అక్కరలేదు అని చెప్పారని అన్నారు. పథ్యం చెయ్యాలని చెప్పే డాక్టర్ లు తక్కువని, త్వరలో వాళ్ళు ఇంకా తగ్గుతారని అనుకోవాలి. ఏమో.. మన చిన్నప్పుడు మనకి తల్లి నుంచి దక్కాల్సిన పాలు దక్కనిచ్చి వుంటే, మన తల్లిని సరిగ్గా తిననిచ్చి వుంటే, మనం ఇప్పుడు ఉన్నదానికంటే మరింత దారుఢ్యం తో, రోగ నిరోధక శక్తి తో ఉండేవాళ్ళమేమో!!. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బిడ్డ పుట్టకముందు, పుట్టిన తరవాత తీసుకోవాల్సిన ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మన మూర్ఖపు ఆలోచనలు, మూఢ నమ్మకాలు పక్కన పెట్టి బిడ్డని ఎదగాల్సిన పద్ధతిలో ఎదగనిస్తే మన భవిష్యత్ తరాలు మరింత ఆరోగ్యం గా పెరిగి మరిన్ని తెలివి తేటలతో మనకి కృతజ్ఞతలతో ముందుకి వెడతాయి.

Comments

నిజమే ! మా రాయలసీమ పల్లెల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు మొదట తల్లిపాలు తాగించక వాటిని "మురుగు పాలు" అని వ్యవహరించడం చూశాను.అది అజ్ఞానం, తెలియని తనం. కాకపోతే కొందరు పట్టణాలలోనూ అదే పని చాదస్తంతో చేసి బిడ్డ ఇమ్యూనిటీని తగ్గించేస్తున్నారు.

దీనిపైన ప్రభుత్వం women and child welfare శాఖ వారు అవగాహనలు కల్పిస్తున్నా...ప్రభుత్వ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే కదా! అందుకే బాలు గారితో పాటూ మనమూ ఒక గొంతు కలపాలి. ఒక టపా రాసి బ్లాగుల్లో కనీసం చర్చించాలి.
చాలా చక్కని అంశాన్ని విశదీకరించారు.చదువుకున్న మూర్ఖులు ముఖ్యంగా అత్తలు,అమ్మలు కూడా ఈవిషయంలో.డాక్టర్లను కూడా పట్టించుకోకుండా స్వంతవైద్యాలు చేసి తల్లినిపిల్లలను ఇబ్బందుల పాలు చేస్తుంటారు.ప్రసవానికి ముందూ సరైన వ్యాయాయం విషయములో కూడా పిచ్చిపిచ్చి ఆంక్షలు పెట్టి తద్వారా సిజెరియన్ల దాకా తీసుకెళుతుంటారు.
ఇలాంటి సంగతులు మరిన్ని మీరు మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.
teresa said…
Breastfeeding వల్ల కలిగే లాభాలు వివరించాలంటే చాలా పొడుగు లిస్టు తయారవుతుంది మీరు చెప్పినట్లు మొదటి 2 రోజుల్లో వచ్చే colostrum బిడ్డకి అత్యవసరం. Laleche league is an international non-profit organisation which provides counseling to new moms for free, through their Lactation consultants. మీ article చదివాక గుర్తొస్తూంది, చిన్నప్పుడు India లో construction work దగ్గర ఆడ కూలీలు తప్పటడుగులు వేస్తున్నtoddlers కి కూడా braeastfeed చెయ్యడం. ఆ పిల్లలు మీరన్నట్లు ద్రిఢంగా పెరిగి పదేళ్ళ వయసు నించే బరువు పన్లు అవలీలగా చేసెయ్యడం!
congrats for addressing an important issue.
రాధిక said…
చాలా మంచి విషయాలు చెప్పారు.నాకు కొన్ని అనుమానాలు వున్నాయి.తీర్చగలరా?నాకు డెలివిరీ ముందురోజు అమ్మావాళ్ళు ఫోను చేసి డెలివరి అయ్యాకా జ్యూసులు తాగొద్దు.బంగాళా దుంపలు తినొద్దు అంటూ చాలా చెప్పారు.కానీ ఇక్కడ హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే నాకిచ్చిన భోజనంలో ఉడికించిన బంగాళాదుంప,నారింజ రసం వున్నాయి.నాకేమి చెయ్యాలో తోచలేదు.ఇంట్లోవాళ్ళు ఇలా చెప్పారు ఇవి తినొద్దని అంటే ఆవిడ బోలెడు ఆశ్చర్యపోయారు.డాక్టరు చెప్పినట్టు అన్నీ తినడం మొదలుపెట్టాను.కొన్నాళ్ళకి నెమ్మదిగా బరువుపెరగడం మొదలెట్టాను.ఇండియా వెళ్ళినప్పుడు డాకటరు దగ్గరకి వెలితే డెలివరి అయ్యాకా పధ్యం చెయ్యనందువల్లే ఇలా అయిందని ఆ డాక్టర్ తిట్టింది.తరువాత టెస్టుల్లో తెలిసిందిలెండి థైరాయిడ్ వుందని.కాని నాకు వచ్చిన అనుమానమేమిటంటే ఇండియాలోని డాక్టర్లు ఎందుకలా చెపుతున్నారని?అలాగే డెలివరీ అయ్యాకా నడుముకు గుడ్డతో గట్టిగా చుట్టుకోవాలని అంటారు.కానీ అమెరికాలో డాక్టర్లు ఎందుకు చుట్టావని తిట్టారు.చెప్పారు కదాని తీసేస్తే ఇండియా డాక్టర్ అలా చెయ్యకూడదు అని అన్నారు.ఏమిటి ఇంత తేడా?
రామ said…
మహేష్ మరియు రాజేంద్ర కుమార్ గారు.. మీరు చెప్పినది అక్షరాలా నిజం. చదువుకోని వారి గురించి ఎప్పుడో అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ఆధునిక యుగం లో చదువుకున్న వాళ్లు కూడా "పెద్ద వాళ్లు" (వీళ్ళు అందరూ చెడ్డ వాళ్లు అని నా వుద్దేశ్యం కాదు - వారిలో ఎంతో మంది ముందు చూపు కలిగి వాళ్ళ తరం కంటే ముందు వున్న వాళ్ళు వున్నారు) చెప్పిన మాటలు విని ఇటువంటి పని చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఈ విషయాలు కొన్ని స్వానుభవం లోకి, మరికొన్ని చర్చల్లోకి వస్తుండడం వల్ల దీని గురించి వ్రాసాము. మరిన్ని తప్పక వ్రాయాలి.
Bolloju Baba said…
i appreciate your concern.
సమాజంలో మామూలుగా, సహజంగా జరిగిపోతున్న ఒక సమస్యను ప్రస్తావించటంతో ఇది ఒక మంచి టపాగా ప్రారంభమై మరియు దానిని నివారించాలి అని చెప్పటంతో ఒక గొప్ప టపాగా మరిపోయిన దీనిని వీలుంటే ఒక 'అజరామరమైన' టపాగా మార్చటానికి ప్రయత్నించండి వీలైతే .... మీ ప్రయత్నానికి, ఆలోచనా విధానానికి మరియు సామాజిక స్పృహకు వేనవేల అభినందనలు మరియు ధన్యవాదములు.

ముందుగా ఈ టపాను మీరు ఇంతకు ముందు ప్రచురించిన Passport and PIO Card for your baby టపాలాగా వివరంగా అంటే సెపరేట్ హెడ్డింగ్స్ తో రాయండి.

సాధ్యమైనన్ని లంకెలు ఇవ్వండి.
Breastfeeding Info
BreastFeeding Online

వీలైనప్పుడల్లా ఈ టపాను అప్-డేట్ చేయటానికి ప్రయత్నించండి .. దీనిని ఒక చిన్న టపాలాగా వదిలి పెట్టేకన్నా మీరు అప్పుడప్పుడూ చేసే మార్పులు, చేర్పులతో ఇది ఒక పెద్ద ఆర్టికల్ లాగా చేయండి.

అప్పుడే ఈనిన గేదె/ఆవు పాలల్లో (జున్నుపాలు) కూడా ఈ ఇమ్యూన్ సిస్టంని డెవలప్ చేసే colostrum ఉంటుందనీ అది చిన్న పిల్లలకే కాదు, పెద్ద వాళ్లకు కూడా చాలా అధ్భుతంగా పనిచేస్తుందనీ చదివితే ఒకటే ఆశ్చర్యం ... ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ colostrum అనేది పచ్చిపాలల్లోనే కాదనీ, ఆ పాలను కాచి/వేడిచేసి ఫ్రీజ్ చేసినా కూడా ఇంకా ఉంటుందనీ (గడ్డకట్టిన జున్ను గుర్తుకువస్తుంది కదా), 'ఆధునిక' శాస్త్రవేత్తలు కనిపెట్టారు :-( ... అన్నీ శుధ్ధిచేయగా ఈ Colostrum అనేది supplements రూపంలో కూడా దొరుకుతుందట.

పూర్తి వివరాలకు : Colostrum, transfer factor and your immune system .
మూడున్నరేళ్ళ పాటూ అమ్మ పాలు తాగిన వాడిగా చెపుతున్నాను, పసి పిల్లలకి తల్లి పాలు ఎంతో అవసరం. పిల్లలకి సహజమైన వ్యాధినిరోధక శక్తినే కాకుండా మనకు తెలియని ఎన్నో రకాలయిన ఉపయోగాలని కలుగ చేస్తాయి. మీరు ఇందులో రాసినవన్నీ ప్రింట్ తీసుకుని రెఫెరెన్సు కోసం ఉంచుకోదగినవిగా ఉన్నాయి. మా నాన్నగారు క్విక్ డెసిషన్ మేకింగ్ కూడా తల్లి పాల వల్ల వస్తాయి అంటారు. నా ఎక్స్పీరియన్స్లో అది నిజమే అనిపిస్తున్నది.

గర్భిణీ స్త్రీలకి వ్యాయామం అవసరం అని ఇంకితం ఉన్నా ఎవరైనా తెలుసుకుంటారు. ఆ కాలంలో అన్ని ఇంటి పనులూ చేసుకుంటూ సుఖ ప్రసవం కానిచ్చిన వారు ఎందఱో ఉన్నారు. అయినా నెప్పులు రాకుండా ఇంజెక్షన్ చేసి, కాన్పు కష్టం అని భయపెట్టి సిజేరియన్ చేసే డాక్టర్లు ఎందఱో ఉన్నారు.

An excellent blog for its useful content. Other bloggers should also write about this topic extensively. ఎందుకంటే ఇందులో మారాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
Excellent, and informative. Seems like I'm going to book mark ur blog. :)

Popular posts from this blog

Passport and PIO Card for your baby.

కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం (Telugu in your computer)