Posts

Showing posts with the label జ్ఞాపకాలు

మంచి మనిషి.

Image
ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏమి చెయ్యాలా అన్న విషయం ఇంజనీరింగ్ చేస్తున్నన్నాళ్ళూ పెద్దగా ఏమి అనుకోలేదు. అందరూ గేటు రాస్తున్నారంటే నేను కూడా రాసా.. ఏదో జరిగి మార్కులూ బాగానే పడ్డాయి - ఐ ఐ టీ మిస్ అయి మద్రాస్ లో అన్నా యూనివర్సిటీ లో చేరాను కంట్రోల్ సిస్టమ్స్ లో. అసలే ఇంటి బయట ఉండడం మొదటి సారి, మన భాష/ఊరు కాని ప్రదేశం, ముఖ్యం గా ముందు గా తెలిసి ఉన్న స్నేహితులు లేకపోవడం (అందుకే తరవాత ఇంకా ఎక్కువ దూరం అయిన అమెరికా వచ్చినా కూడా ఇక్కడ అప్పటికే తెలిసిన స్నేహితులు ఉండడం తో అస్సలు ఇబ్బంది లేకుండా కలిసిపోయాను), నన్ను అక్కడ ఉండనివ్వలేదు. దానికి తోడు చీకటి గుయ్యారాల లాంటి హాస్టల్ రూములు, రోజుకొకసారి కనిపించే ఈనాడు పేపర్, రుచీ పచీ లేని హాస్టల్ భోజనం - మనకి ఒకటి నచ్చక పొతే అన్నీ భూతద్దాలలోంచి కనిపిస్తాయి కదా - మొత్తానికి ఈ కాలేజీ మనకోసం కాదు అన్న విషయం నిర్ణయం అయిపొయింది. దానికి తోడు, అక్కడ చేరిన ఒక వారం రోజులకి విశాఖపట్నం గీతం లో నాతో చదివిన స్నేహితుడు అమెరికా వీసా కి రావడం, అతని ద్వారా జీ ఆర్ ఈ కి ఎలా తయారవాలి తదితర విషయాలు తెలుసుకోవడం వల్ల అమెరికా పురుగు గట్టిగా కుట్టింది. మనం ఏదైనా పని చెయ్యడానికి...

(మా) రాజమండ్రి విమానాశ్రయం.

Image
చిన్నప్పుడెప్పుడో ఒకసారి (అంటే ఇంచుమించు 1986 అనుకుంటా) - రాజమండ్రి నుంచి వాయుదూత్ విమానంలో హైదరాబాద్ వెళ్ళాము. విమానం ఎక్కడం అదే మొదటిసారి - ఆ వాయుదూత్ లో అంత ప్రమాదం ఉంటుంది అని తెలియదు - విమానం ఎక్కాలి అనే సరదాయే తప్ప. ప్రమాదం అని ఎందుకు అన్నానంటే మేము ఎగిరిన చాలా రోజుల తరువాత వేరే వాయుదూత్ విమానం కూలి పాపం అందులో వాళ్ళు అందరూ పోయారు. వెంటనే ప్రభుత్వం వారు మేల్కొని మొత్తం వాయుదూత్ నే రద్దు చేసారు అనుకోండి అది వేరే విషయం. అప్పుడు ఇప్పటిలా విరివిగా విమాన సర్వీసులు, వాటిమీద ప్రభుత్వ నిఘా ఉండేది కాదు. రాజమండ్రి విమానాశ్రయానికి బయల్దేరి, సగం దూరంలో మా వాహనం (ఆటో లెండి) చెడిపోతే అటుగా వెడుతున్న విమానాశ్రయం వారి జీప్ లో ఎక్కడం, అందులో ఉన్న ఆఫీసర్ - ఎంత పెద్ద ఉద్యోగమో మనకి తెలియదు కాని, ఆ ఎయిర్ పోర్ట్ అంతా తనదేననీ, విమానాలు ఎక్కడానికి వచ్చేవాళ్ళకి తను విమానం ఎక్కే అవకాశం ఉచితం గా ఇస్తూ మహా సేవ చేసేస్తున్నాననీ - అందువలన గారంటీ గా స్వర్గానికే వెడతాననీ నమ్మకం పెట్టుకున్నవాడిలా మొహం వేసుకొని మా వైపు మహా చిరాకుగా చూడడం ఇంకా గుర్తు :). అన్నట్టు ఆ ఫ్లైట్ లో కూర్చొని ఆ విశేషాలు వర్ణిస్తూ మా అమ్మగార...

అమ్మ

అమ్మ... సృష్టిలో హాయైన పదం.. అర్ధం చెప్పాలనుకుంటే ఏమీ తోచని పదం... తన త్యాగాలు రాయాలంటే పేజీలే సరిపోని పదం.... కలతనిదురలో లేచి ఏడిస్తే ఎంతటి నిద్రలోనైనా టక్కున లేచి గుండెలకు హత్తుకుంటుంది. అల్లరి చేస్తే మందలిస్తుంది, తరువాత తనే దగ్గరకి వచ్చి ముద్దు చేస్తుంది. తొలి గురువు తానై పాఠాలు చెబుతుంది, పెద్ద చదువులు చదివి ఎదిగితే తనకన్నా కాస్త పొడవున్న ఆ బిడ్డని తలపైకి ఎత్తి చూసుకుంటూ గర్వంగా మురిసిపోతుంది. కాస్త తొందరగా లేస్తే 'కాసేపు పడుకోకపోయావా?' అంటూ దగ్గరకొస్తుంది.. నేనూ ఒక తల్లినని, ఆవిడ తెల్లవారుఝామునే లేచి తన పిల్లలకోసం చేసినవి నేనూ నా పిల్లలకి చెయ్యాలి అన్న విషయం మరచిపోతుంది. చిన్నప్పుడు నా బట్టలు అన్నీ తనే ఉతికిపెట్టింది, ఇప్పుడు పుట్టింటికి వెళ్తే నా పిల్లల బట్టలు ఉతకడానికి పనిమనిషిని పెట్టింది. అప్పడాలు, వడియాలు, ఊరగాయలు అంటూ మాకిష్టమైనవి చేస్తూ పరుగులు పెడుతుంది, అవి ఎండబెట్టడానికి డాబా ఎక్కుతుంటే కాలికి తగిలిన దెబ్బకి రాత్రి మేమందరం పడుకున్నాక చీకటిలో కొబ్బరినూనె రాసుకుంటుంది. పొద్దుటి అన్నం పెట్టుకుంటే 'హన్నా.. అరగదు' అంటూ మందలిస్తుంది, నేను చూడకుండా ఆ అన్నం మజ్జ...

బాలమిత్ర - చందమామ

ఇప్పటికీ వస్తున్నాయి అనుకుంటున్నా. చందమామ గురించి ఈనాడు లో చదివినట్టు గుర్తు. ఏది అయితేనేం? చిన్నప్పుడు ఈ రెండింటితో బాటు, బొమ్మరిల్లు, బాలజ్యోతి (అనే అనుకుంటున్నా.. ఎవరికైనా తెలిస్తే కరెక్టు చెయ్యండి) కూడా భారీ గానే చదివేవాళ్ళం. ఐతే, మొదటి రెండూ కొనుక్కుని ఇంట్లో చదివితే, చివరి రెండూ లైబ్రరీ లో అన్నమాట. అసలు రెండు పత్రికలూ కొనడం గురించి కూడా ఒక చిన్న విశేషం వుంది. మేము ఇద్దరం - అన్నయ్య, నేను. చిన్నప్పటినుంచీ మా నాన్న గారు మా ఇంట్లో ముష్టి యుద్ధాలు, రక్తపాతాలు, వీర బాదుడులు లేకుండా ఏది కొన్నా రెండు కొంటుండేవారు. మరి నెలకి రెండు చందమామలు అనవసరం కదా (ఆ విషయం మేము 1, 2 వ తరగతుల్లోనే కనిపెట్టేసి ఒప్పేసుకున్నాము), పోనీ అది ఏమైనా దిన పత్రిక లాగ వుంటే, మధ్య పేపర్ ఒకళ్ళు, కవర్ పేపర్ ఒకళ్ళు చదివేసుకోవచ్చు. అది పుస్తకమాయే!! - అందుకని తెలివిగా, డబుల్ డోస్ లాగ నెలకి రెండు కొనేవాళ్ళు అన్నమాట.. అది కూడా ఒక నెల చందమామ ముందు వచ్చేసి, బాలమిత్ర రాలేదు అనుకోండి.. రెండూ వచ్చే వరకూ, రిస్క్ తీసుకోకుండా, వెయిట్ చేస్తాము అన్నమాట రెండోది వచ్చే వరకు. లేకపొతే వ్యవహారం మొత్తానికి చెడుతుంది అని. సరే.. మొత్తానికి ఒ...

మా బడి రేడియో

ఎందుకో గుర్తు వచ్చాయి.. మా 4, 5 వ తరగతి సంగతులు. మొగల్తూరు (ఇప్పుడంటే అందరికీ అనేక రకాలుగా తెలిసిపోయింది గాని, మేము చదువుకున్నప్పుడు "కృష్ణంరాజు" వూరు గానే తెలుసు అందరికీ - "చిరంజీవి" ఇల్లు ఊరి చివర్లో ఎక్కడో వుందని అనుకునేవాళ్ళం గాని వేలం వెర్రి గా వెంటబడడం లాంటివి తెలియదు). అక్కడ వున్న వాటిలో, (గవర్నమెంటు ది అయినప్పటికినిన్నీ) అభ్యుదయ ప్రాధమిక పాఠశాల కొంచెం పద్ధతి గా వుండేది. రోజూ 7 గంటలకి యోగ క్లాస్ లు, బడి కి ముందు అసెంబ్లీ, "ఔట్ బెల్" లో గోధుమ నూక ఉప్మా (ఎందుకు పెట్టేవారో నాకు కూడా తెలియదు.. మేము అందరం క్రమం తప్పకుండా స్కూల్ కి వెడుతూనే వుండేవాళ్ళం), మధ్యాహ్నం రేడియో కార్యక్రమం. 2:25 అయ్యేసరికల్లా హెడ్ మాస్టారి రూం లోంచి రేడియో ని తీసుకొని వచ్చి వరండా లో పెట్టడం, పిల్లలు అందరూ పొడుగునా కూర్చోవడం. సోమ వారం అయితే చిత్తరంజన్ గారి "పాట నేర్చుకుందామా" ప్రోగ్రాం. "పిల్లల్లారా.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. పాపల్లార.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.." అంటూ మేము కూడా తన్మయత్వం తో వెనకాలే పాడేస్తూ వుండే వాళ్ళం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆ రెండేళ్లలో కనీసం 10-...