ఎందుకో గుర్తు వచ్చాయి.. మా 4, 5 వ తరగతి సంగతులు. మొగల్తూరు (ఇప్పుడంటే అందరికీ అనేక రకాలుగా తెలిసిపోయింది గాని, మేము చదువుకున్నప్పుడు "కృష్ణంరాజు" వూరు గానే తెలుసు అందరికీ - "చిరంజీవి" ఇల్లు ఊరి చివర్లో ఎక్కడో వుందని అనుకునేవాళ్ళం గాని వేలం వెర్రి గా వెంటబడడం లాంటివి తెలియదు). అక్కడ వున్న వాటిలో, (గవర్నమెంటు ది అయినప్పటికినిన్నీ) అభ్యుదయ ప్రాధమిక పాఠశాల కొంచెం పద్ధతి గా వుండేది. రోజూ 7 గంటలకి యోగ క్లాస్ లు, బడి కి ముందు అసెంబ్లీ, "ఔట్ బెల్" లో గోధుమ నూక ఉప్మా (ఎందుకు పెట్టేవారో నాకు కూడా తెలియదు.. మేము అందరం క్రమం తప్పకుండా స్కూల్ కి వెడుతూనే వుండేవాళ్ళం), మధ్యాహ్నం రేడియో కార్యక్రమం. 2:25 అయ్యేసరికల్లా హెడ్ మాస్టారి రూం లోంచి రేడియో ని తీసుకొని వచ్చి వరండా లో పెట్టడం, పిల్లలు అందరూ పొడుగునా కూర్చోవడం. సోమ వారం అయితే చిత్తరంజన్ గారి "పాట నేర్చుకుందామా" ప్రోగ్రాం. "పిల్లల్లారా.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. పాపల్లార.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.." అంటూ మేము కూడా తన్మయత్వం తో వెనకాలే పాడేస్తూ వుండే వాళ్ళం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆ రెండేళ్లలో కనీసం 10-15 పాటలు అలా నేర్చుకున్నాము. చిత్తరంజన్ గారు పిల్లలు ఎలా పాడినా సరే "చూడమ్మ.. 'రేపటి భారత పౌరుల్లారా' కాదు 'రేపటి భారత పౌరుల్లారా' అనాలి" అనేవారు (మీకు కూడా తేడా ఏమి కనిపించలేదు కదా.. మాకు కూడా అంతే - ఇంకా ఏమనుకున్నారు? ఆయన రాగ సహితం గా వాళ్ళు చెప్పినదే చెప్పి 'అలా కాదమ్మా.. ఇలా' అంటూ వుండే వారు). జోక్ చేస్తున్నాను గాని, ఆయన ప్రావీణ్యత ని కామెంట్ చేసే జ్ఞానం నాకు వుందని నేను అనుకోను. ఐతే అప్పట్లో నవ్వుకుంటూ వుండేవాళ్ళం ఇంటికి వచ్చి అమ్మకి చెప్పి. "నిదానమే ప్రధానము" అనే కధ ఒక రోజు, "నిదానమే ప్రమాదము" అనే కధ ఇంకో రోజూ - అలా వస్తూ వుండేవి రేడియో లో - ఏ సమయానికి ఏది అనుకూలం గా వుంటుందో అది అనుకోవాలి అని మేము అనుకునేలా :).
మార్చి 31, 2008 నాడు సవరించబడినది:
చదువరుల వ్యాఖ్యలు మరియు రాధిక, సుజాత గార్ల స్పందన వల్ల (వ్యాఖ్యల్లో చూడండి) ఈ పాట చాల ప్రాచుర్యం పొందినదని గ్రహించి, సాహిత్యం సంపాదించడానికి ప్రయత్నించాను. ఈ సైట్ లో కొంచెం దొరికింది. పూర్తిగా సరి కాకపోవచ్చు. సవరణ లు తెలియజేయగలరు.
--పల్లవి--
పిల్లల్లారా ఊఁ ఊఁ ఊఁ ఊఁ .... పాపల్లారా ఊఁ ఊఁ ఊఁ ఊఁ ......
రేపటి భారత పౌరుల్లరా ఊఁ ఊఁ ఊఁ......
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా .. పిల్లల్లారా ..
--చరణం--
మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు .. ఉన్నాడు అతడున్నాడు
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడు .. ఉన్నాడు.. పొంచున్నాడు
భారత మాటకు ముద్దుల పాపలు మీరేలే.. మీరేలే.. మీరేలే..
అమ్మకు మీపై అంతేలేని ప్రేమేలే .. ప్రేమేలే..
--చరణం--
జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి..
బడిలో బయటా అంతా కలసి భారతీయులై మెలగండి.
కన్యాకుమారి కి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండి..
వీడని బంధం వేయండి.. పిల్లల్లారా.. పాపల్లారా ..
ఈ పైన వున్న సాహిత్యం ఈ సైట్ లోని పాట వినడం ద్వారా రాసినది. ఈ పాట మీరు కూడా వినండి. చిత్తరంజన్ గారి ట్యూన్ లో కాకుండా చాల వైవిధ్యం గా వుంది. మలయాళం భాష కు చెందిన వారు ఎవరో కృషి చేసినట్టు గా తెలుస్తోంది.
కాని, నాకెందుకో, ఈ లైన్ కూడా ఎక్కడో వుండాలి అనిపిస్తోంది:
భారత దేశం ఒకటే ఇల్లు.. భారత మాతకు మీరే కళ్లు.. మీరే కళ్లు.. మీరే కళ్లు..
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago
7 comments:
ఏవో పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లిపోయేరు. "పోవుకాలము మేలు వచ్చు కాలము కంటెన్" అనిపించక మానదు. చిత్తరంజన్ గారు ఆరోజుల్లో నేర్పించిన పాటలు, పనిగట్టుకు ప్రయత్నపూర్వకంగా నేర్చుకోకపోయినా, ఈనాటికీ, పెదాలమీద దొర్లుతున్నాయంటే, ఆ ఘనత - వారి గొంతుదా, రేడియోదా లేక ప్రస్తుతమున్నటువంటి హంగులు లేని ఆ బాల్యానిదా?
బాగుంది.
నాకు కూడా చిత్తరంజన్ గారంటే పిల్లలారా...ఊ..ఊ..ఊ..ఇదే గుర్తొస్తుంది.బాగా రాస్తున్నారు.మరిన్ని బాల్యపు జ్ఞాపకాలు మాముందు వుంచండి.
చిన్నమయ్య గారు.. మీరు అడిగిన విషయం ఆలోచింప జేసేలా వుంది. నేను అనుకోవడం, అది "హంగులు, expectations ఎక్కువ లేని బాల్యం" వల్ల అని. మా చిన్నప్పుడు మా తల్లి తండ్రులు (చాల మంది లాగే), మా మీద (అతి)ఆశలు పెట్టుకొని "తోమేయ్యడం" అనేది వుండేది కాదు. మిగిలిన వాళ్ళతో compare చేసుకోవడం ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళని దాటేయ్యలని, రోజులో 24 గంటలూ చదివించేసి వాళ్ళ వల్ల మనం పేరు తెచ్చేసుకోవాలని తల్లి తండ్రులు వుబలాటపడడం నెమ్మదిగా మొదలయ్యింది. చదువు ఒక్కటే జీవిత ధ్యేయం గా భావించడం తో obvious గా మిగిలిన వ్యాపకాలని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఐతే ఇప్పటికీ, రెండింటినీ manage చెయ్యగలిగిన వాళ్ళు చేస్తున్నారు కాని, వీళ్ళు అప్పుడు పుట్టి ఉంటే ఇంతకంటే తక్కువ stress తో, ఇంతకంటే, ఎక్కువ ఎత్తుకు ఎదిగి వుండేవారు అనిపిస్తుంది :).
రాధిక గారు.. తప్పకుండా!! రాయాలంటే, బోలెడన్ని విషయాలు వున్నాయి. వీలైనంత తొందర్లో వీలైనన్ని విషయాలు పంచుకుంటాము.
రమ - శాంతి గారు.. ఈ పోస్ట్ నిజంగా సూపర్.. నాకు స్కూల్లో పిల్లలారా... పాటకు మొట్టమొదటి సారి గా ప్రైజ్ వచ్చింది.. మీకు మొత్తం పాట గుర్తిందా ? 'భారత దేశం ఒకటే ఇల్లు.. భారత మాత కు మీరే కళ్ళు.. జాతి పతాకం పైకేగరేసి జాతి గౌరవం కాపాడండి.. ..' గుర్తు రావట్లేదు.. చాలా థాంక్స్.
సవరించబడినది.
thanx a lot..
Post a Comment