Wednesday, December 30, 2009

మన పిల్లలు - వాళ్ళ పిల్లలు..

ఈ మధ్య పిల్లల మీద పోస్టులు ఎక్కువ అయ్యాయి కదా? నాకు కూడా అలాగే అనిపించింది.. కాని తప్పదు :).
ఈ టపా కి ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. "doting parents" అని అంటారు కదా.. అలా అన్నమాట. ఇలాంటి వాళ్ళు - ఎవరైనా తమ ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలు చూపిస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి కొత్తగా నేర్చుకున్న మాటలు, పాటలు, ఆటలే చూపిస్తారు. రెంటిలోనూ తప్పు లేదు కాని, చాలా మంది వాళ్ళ పిల్లలే పిల్లలని, మిగిలిన వాళ్ళు ఎవరూ తమ అనుగ్రహ వీక్షణాలకి పాత్రులు కారనీ అన్నట్టు ప్రవర్తిస్తారు. పిల్లలు అందరూ పిల్లలే కదా? వాళ్ళ పిల్లలతో బాటు వేరే పిల్లల వైపు కూడా ఒక సారి చూస్తే పోయేదేముంది? అదీ, మనం మన పిల్లల్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసినా కూడా!.

పిల్లలతో నాకు బాగా నచ్చే నానుడి ఒకటి ఉంది (మా అమ్మగారు చెప్పినది) - "పిల్లల్ని చేరదీస్తే వస్తారు, కసిరితే పోతారు" అని. వాళ్లకి ఏమి తెలియదు కదా.. ఒక సారి తిట్టినా, వెంటనే పిలిస్తే భేషజాలు లేకుండా చిరునవ్వు మొహాలతో దగ్గరకి వచ్చేస్తారు. అలాంటి స్వచ్చమైన మనస్సులని ఏ పిల్లలైనా మన పిల్లలే అనుకొని దగ్గర కి తీసుకుంటే దేవ దూతల్లాంటి వాళ్ళ నిర్మలమైన ముఖాలతో, చిట్టి పొట్టి చేష్టలతో మన ఆయుష్షు ని మరింత పెంచుతారు (నా ఉదేశ్యం లో పిల్లలతో ఆడుకున్న ప్రతీ నిముషానికి మన జీవిత కాలం పది నిముషాలు పెరుగుతుంది).

Saturday, November 28, 2009

పిల్లల్ని నిద్రపుచ్చడం

చంటి పిల్లలు సాధారణంగా రోజుకి ఇరవై గంటలు పడుకుంటారు (అది average అనుకోండి - కొందరు తక్కువ పడుకుంటారు. వాళ్ళ శరీరధర్మాన్ని బట్టి ఇది మారుతుంది). అందుకని వాళ్ళని పడుకోబెట్టడం అనేది సాధారణంగా మనం ప్రత్యేకించి చెయ్యాల్సిన పనిగా ఉండదు. నిద్రపోకుండా ఉంటే (ఒకటి-రెండు నెలలు ఉన్న పిల్లలు) కాళ్ళూ చేతులూ కదుపుతూ ఆడుకోవడమో, కబుర్లు చెబుతూ ఉండడం (ఉక్కు, ఉంగా లాంటివి), వస్తువులని చూస్తుండడం, మనుషులని ఫాలో అవుతూ ఉండడం చేస్తూ కాలక్షేపం చేస్తారు. ఐతే, కొన్నిసార్లు వాళ్లకి నిద్ర వచ్చినా తిక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పడుకున్నంత సేపు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు కాని, ఏడిస్తే మాత్రం టాపు లేపెయ్యడం ఖాయం. వాళ్ళ ఏడుపులో "treble" పాలు ఎక్కువ ఉండడం వల్ల అది వినేవాళ్ళకి ఒక లెవెల్లో ఇరిటేషన్ కలిగిస్తుంది (మరి "bass" లో ఏడిస్తే ఎవరికీ వినిపించదని దేముడు ఆ సెట్టింగ్ ఇచ్చాడు అని మనం అర్ధం చేసుకోవాలి). ఇలా తిక్క ఏడుపు తీర్చడానికి మామూలు లాలిపాటలు, ఉయ్యాలల కంటే దగ్గరకి తీసుకొని పట్టుకోవడం ఉత్తమమని మా అనుభవం. మాకు పని చేసిన రెండు మూడు కిటుకులు: ఎత్తుకున్నప్పుడు మన మోచేతి ఒంపులో వాళ్ళ మెడ పైభాగం, తల ఉంచి (దాని వాళ్ళ మెడకి కూడా సపోర్ట్ ఉంటుంది) ఛాతీకి దగ్గరగా తీసుకొని (మన ఊపిరి తగిలేలా), రెండో చేతిని నడుము కింద పోనిచ్చి ఉంచి దగ్గరకి అదుముకుంటే వాళ్ళకి బోలెడంత secure ఫీలింగ్ వస్తుంది. దానితో బాటు చిన్నగా bass వాయిస్ లో రిథమిక్ గా ఏదో ఒకటి అంటూ ఉంటే ఆ రిథం కి నెమ్మదిగా దారిలో పడతారు. దాంతో బాటు, కూచొని ఎత్తుకునే కంటే, ఇలా పట్టుకొని నడుస్తూ ఉంటే, ఆ "gliding motion" కి చాలా చురుగ్గా నిద్ర పట్టేస్తుంది (ఇది "అమ్మ చేతుల ఉయ్యాల" అన్నమాట - actually, నాన్న కూడా చెయ్యచ్చు ఈ పని). వాళ్ళని అదిమి పట్టుకోమన్నానని మరీ నొక్కేస్తే ఫ్రీగా లేక ఏడుపు నెక్స్ట్ లెవెల్ కి వెడుతుంది. కొంచెం flexible గా పట్టుకుంటే కదలడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సార్లు ఎత్తుకున్నప్పుడు వాళ్ల తల మీద వ్రేళ్ళతో సన్నగా రాస్తూ ఉంటే అది కూడా వాళ్ళని శాంతపరుస్తుంది. ఇంకా, చాలా సార్లు ఏడుపు కి ముఖ్య కారణం ఆకలి వెయ్యడమో, wet /dirty diaper ఓ, విరేచనం అవకపోవడం వల్ల వచ్చిన కడుపు నొప్పో (ఇది కొంచెం అరుదు - అందులోనూ, తల్లి పాలు తాగే పిల్లల్లో - వాళ్ళు ఒక్క రోజు "ఇంకా కాలేదేమిటి" అనుకొనేసరికి వెంటనే కడుపు ఖాళీ చేసేసుకుంటారు) - కొన్ని సార్లు వాళ్ళు వేసుకున్న దుస్తుల్లో ఉండే "టాగ్" ఓ కారణం అవుతుంది (అనుకోము కాని, మనకే చిరాకు పుట్టించేస్తుంది - వాళ్ళైతే ఇంక డైరెక్ట్ గా ఏడుపే). ఒక్కో సారి పాలు తాగేక, తేనుపు వెంటనే రాకపోతే అది వచ్చే వరకూ ఏమి చేసినా ఏడుపు ఆపరు. అటువంటప్పుడు ఇందాక చెప్పినట్టు అడ్డంగా కాకుండా, మెడ మీద చెయ్యి వేసి నిలువుగా పట్టుకొని భుజం మీద వేసుకొని, నడుము కింది భాగంలో చిన్నగా తడుతూ ఉంటే కాసేపట్లో తేనుపు వచ్చేసి సుఖంగా పడుకుంటారు (మా అమ్మగారు చెప్పడం, ఇదివరలో పిల్లల్ని మూడు నెలలైనా వచ్చేవరకూ భుజంమీద వేసుకునేవారు కాదుట. కాని, మా చిన్నోడు అప్పుడప్పుడు భుజంమీద వేసుకుంటే తప్ప మానడు - ఒక్క సారి భుజంమీద పెట్టుకుంటే ఇంక అక్కడ నుంచి ఏడుపు మానేసి, పిట్ట గోడ అవతలి నుంచి చూస్తున్నట్టు వింతగా గమనించేస్తూ ఉంటాడు :). ఇంకా, తేనుపు తెప్పించడం కోసం భుజాల మధ్యలో తట్టడం మంచిది కాదు అని ఈ మధ్యే చదివాను. logically కూడా, బొజ్జ ఉండేది మొండెం కింది భాగంలో కాబట్టి గాలి ఇరుక్కునేది అక్కడే - అందుకని అక్కడ తడితే తొందరగా తేనుపు వస్తుంది).

పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెయ్యకూడనిది: కొందరు ఏ సోఫాలోనో కూర్చొని పిల్లల్ని వొళ్ళోపెట్టుకొని, వాళ్ళ మెడ/తల తమ మోకాలి మీద ఆన్చి, ఆ కాలి వేళ్ళు నేలమీద ఉంచి, మడమని నేలమీద కొడుతూఉంటారు (అర్ధం అవకపోతే పిక్చర్ చేసుకొంటూ మళ్ళీ చదవండి). అలా అరికాలు కొడుతున్న ప్రతీసారీ ఆ పిల్లల తల గమనిస్తే అది అదిరి అదిరి పడుతూ ఉంటుంది. ఈ చర్యతో పిల్లలు ఏడుపు మానొచ్చేమోకాని, అది మాత్రం చాలా తప్పు. ఇది చాలా సార్లు చంటి పిల్లలతోనే జరుగుతుంటుంది. పిల్లలు పుట్టిన తరువాత కనీసం ఒక ఏడాది వరకు వాళ్ళ తలలో బ్రెయిన్ పూర్తిగా సెటిల్ అవదు. ఊహించుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెబుతున్నా: ఎండు వేరుసెనక్కాయలో గుండు ఎలాగో, పండు వెలక్కాయలో గుంజు పార్ట్ ఎలాగో అలా అన్నమాట (అవి రెండూ చేతితో పట్టుకొని ఆడిస్తే లోపల గుండు కదలడం వినిపిస్తుంది కదా.. అంటే, లోపల ఉన్న వస్తువు దాని షెల్ల్ కి పూర్తిగా తాటించి లేదు అని అర్ధం). అది పిల్లల మెదడు ఐతే, ఇటువంటి motion వల్ల పుర్రె గోడలకి తగిలి rupture అయ్యే ప్రమాదం చాలా ఉంది. పడుకోబెట్టడం ఇంట్రెస్ట్ లేకపోతె ఇంకొకళ్ళకి ఇచ్చి పడుకోబెట్టమనడం ఉత్తమం. లేదా, వాళ్ళని చేతిలో తీసుకొని నెమ్మదిగా మనం ఊగుతూ వాళ్ళకి ఆ స్వింగింగ్ motion ని పాస్ చెయ్యడం బెస్ట్ పద్ధతి. అలాగే, పిల్లలకి రాత్రి, పగలు తెలియదు. వాళ్ళకి వచ్చిన ఒకే భాష ఏడుపు. పగలు పరవాలేదు కాని, రాత్రి నిద్ర లేచి ఏడుస్తుంటే మనకి నిద్ర మెలకువ వచ్చి కొంచెం iritate అవడం సహజం. ఐతే, దానిని వాళ్ళ మీద చూపించి, ముఖ్యంగా మనం ఏమి చేసినా వాళ్ళు ఏడుపు మానకపోతే వాళ్ళని కొంతమంది "shake" (రెండు చేతులతో పట్టుకొని గట్టిగా ఊపెయ్యడం) చెయ్యడం ద్వారా ఏడుపు మానిపించడానికి ప్రయత్నిస్తారు. పైన చెప్పిన కారణం వల్ల ఇలా చేసినపుడు వాళ్ళ మెదడు శాశ్వతంగా damage అయ్యే అవకాశం ఉంది. ఏడుస్తున్న పిల్లాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినా తప్పు లేదు కాని, గట్టి గా ఊపెయ్యడం ద్వారా వాళ్ళని ఏడుపు మానిపించడం క్షమించరాని నేరం. వందకి తొంభై తొమ్మిది సార్లు రాత్రి నిద్ర లేచిన పిల్లలు పాలు పడితే చప్పుడు చెయ్యకుండా పడుకుంటారు. అలాగే కొంతమందికి ఒక అంగ్లె లో పట్టుకుంటేనే ఇష్టం. మా పెద్దవాడు కొంచెం మెడ నిలబెట్టడం మొదలు పెట్టాక, చేతుల్లో కూర్చోబెట్టుకొని, దేముడిని ఊరేగించినట్టు తిప్పుతూ ఉంటే ఏడుపు మానేసి చక్కగా చూసుకుంటూ కూర్చునేవాడు. అది మళ్ళీ చిన్నాడికి పనిచెయ్యలేదు. చెప్పోచ్చేదేమింటంటే అది ఒక్కొకరికీ ఒక్కో విధం గా సెట్ అవుతుంది. అది తెలిసే వరకు (తొందరలోనే తెలుస్తుంది గాని) కొంచెం ఇబ్బందే, ఒక సారి తెలిస్తే ఇక వాళ్ళని ఎత్తుకునే వాళ్ళు అందరూ ఆ ట్రిక్కు
వాడొచ్చు.

Tuesday, October 20, 2009

"అగులు" చెయ్యడం

మనలో చాలా మందికి చిన్నప్పటి ఫోటోలలో ఒకటి కామన్ గా ఉంటుంది. అది - అబ్బాయైనా, అమ్మాయైనా, పాలుగారే పసిమోము మీద కనుబొమ్మల మధ్యలో పెట్టే నల్లటి అగులుచుక్క. దానిని మరి అందరూ అగులు అంటారో లేదో తెలియదు కాని, తూ గో లో మాత్రం అంటారని తెలుసు. పేరు ఏదైనా, అందాలొలికే ముద్దుల పాప మీద నుంచి దృష్టి మరల్చడానికి కొందరు, అలంకారం కింద కొందరూ, రెంటికిందా మరి కొందరు పిల్లలకి చుక్కపెడతారు. ఇప్పుడు కొంతమంది దానిమీద (చర్మానికి పడదు అనే) సందేహంతోనో, అగులు దొరక్కో, అది చెయ్యడం తెలియకో బొట్టుబిళ్ళలు, తిలకం వంటివి పెడుతున్నారు. సహజసిద్ధంగా తయారుచేసే అగులు చేసే హాని ఏమీ లేకపోగా, ఈ కెమికల్స్ తో చేసిన జిగుర్లు, తిలకాలు చర్మానికి చేటుచేస్తాయి. అందుకని అగులు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాము.


కావలసిన వస్తువులు: సగ్గుబియ్యం, మూకుడు (స్టైల్ గా "బాండీ"), అగ్గిపెట్టె, నీళ్ళు, టీ వడకొట్టుకునే చిక్కం (మెత్తటి (ఫైన్) జల్లెడ కూడా వాడవచ్చు).

ముందుగా కొంచెం సగ్గుబియ్యం తీసుకొని, దానిని మూకుట్లో వేసి, చిన్న సెగమీద కలుపుతూ వేయించాలి. అది నల్లగా అయే వరకూ వేయించి, మూకుడుకి అంటుకుపోతుంది అనిపించే ముందు పొయ్యిమీదనుంచి దించాలి. ఆ తరువాత దానిని ఒక అగ్గిపుల్లతో వెలిగించి మండనివ్వాలి. పూర్తిగా మండితే బూడిద అయిపోయి ఏమీ మిగలదు కాబట్టి, బొగ్గులా మారిన తరువాత మంటని ఆర్పెయ్యాలి. ఇప్పుడు దానిలో కొంచెం (తగినన్ని) నీళ్ళుపోసి, చేతితో నలపాలి. అలా వచ్చిన నల్లని ద్రావణాన్ని చిక్కం/జల్లెడ లోంచి పోసి, వడగట్టాలి. మూకుడు లో మిగిలిపోయిన బొగ్గు ముక్కలు, నీరు పారబోసి, మూకుడు తొలిచి రెడీ గా పెట్టుకోవాలి. వడగట్టినప్పుడు కిందకి చాలా మెత్తటి సగ్గుబియ్యంబొగ్గుపొడితో కలిసిన నీళ్ళు దిగుతాయి. అలా వచ్చిన నల్లటి నీళ్ళని, ఖాళీ చేసిన మూకుట్లోకి మార్చి, మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. కొంచెం ఉడుకు పట్టాక నీళ్ళు ఆవిరి అవుతూ ఉంటాయి. ఐతే, నీళ్ళు పూర్తిగా ఆవిరి అయిపోతే, ఈ మిశ్రమం మూకుడికి అంటుకొనిపోతుంది. అందువల్ల, కొంచెం నీళ్ళుగా (పల్చగా) ఉండగానే, దానిని తీసి వేరే పాత్ర/డబ్బాలోకి మార్చుకోవాలి. మరి దీనిలో నీళ్ళు మిగిలిపోయాయి కాబట్టి వాటిని కూడా ఆవిరి చేస్తే, అగులు అటూ ఇటూ ఒలికిపోకుండా దాచుకోవడానికి బాగుంటుంది. దానికోసం, ఆ ద్రావణాన్ని ఎండలోపెట్టి మరింత నీటిని ఆవిరి అయ్యేలా చెయ్యాలి. ఆ క్రమం లో అగులు గట్టి పడుతుంది కూడా. అలా తయారైన అగులుని ఎంతకాలం అయినా దాచుకోవచ్చు.

అది వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ అగులు ముద్ద మీద ఒకటి రెండు చుక్కలు నీరు పోసి చూపుడు వేలితో రాస్తే తిలకం లాగ వేలికి వస్తుంది. దానిని మీ బంగారు తల్లి బజ్జున్నప్పుడు మెల్లిగా, తెలియకుండా, నుదుటి మీద, బుగ్గ మీద అలంకరిస్తే చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఒకటి రెండు నిముషాల్లో ఆరిపోతుంది. స్నానం చేయించినప్పుడు కొంచెం తడి చెయ్యి చేసుకొని నుదుటి మీద వేలితో మెత్తగా అద్దితే అది కరిగిపోయి చక్కగా ఊడి వచ్చేస్తుంది.

Friday, October 16, 2009

మనకి నోబుళ్ళు రావా?

మొన్న నోబెల్ ప్రైజులు ఒకటొకటిగా అనౌన్స్ అవుతూ ఉంటే "నోబెల్ ప్రైజులు అన్నీ అమెరికా వాళ్ళకీ యూరోప్ వాళ్ళకే వస్తాయేమో" అని మా నాన్నగారు అనడం నన్ను ఆలోచింపజేసింది. అదే సమయంలో శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారు వ్రాసిన "భవిష్యత్తులో భారత దేశానికి మరో స్వర్ణ యుగం ఉందా?" అనే వ్యాసం చదవడం కూడా జరిగింది. అందులో ప్రస్తుత స్థితి కి కారణాలని చాలా బాగా విశ్లేషించారు. వాతావరణం తేలిక చెయ్యడానికీ కాదు కాని, ఇక్కడ ఒక సరదా జోక్ గుర్తుకి వస్తుంది:
Sometimes I lie awake at night, and I ask, "Where have I gone wrong?"/ Then a voice says to me, "This is going to take more than one night." -Charles M. schulz
ఈ జోకులో లాగా, కర్ణుడి చావు లాగా, దీనికి కోటి కారణాలు.వేమూరి గారు చెప్పిన విధం గా మన విద్య ఉద్యోగాలు సంపాదించడానికి, ఉన్న దానిని వాడుకోవడానికి (లాంగ్వేజ్ ఉపయోగించి ప్రోగ్రాం రాసినట్టు (vs. లాంగ్వేజ్ నే కనిపెట్టకుండా)) పనికొస్తోంది తప్ప, కొత్తది కనిపెట్టే దిశగా ప్రోత్సాహం మన దగ్గర తక్కువ. సమాజం లో కూడా ఎవరైనా ఏ డాక్టరేట్ ఓ చేస్తాను అంటే, అలాంటి వ్యక్తిని ఏదో ఇతరగ్రహం నుంచి వచ్చిన వాడిని చూసినట్టు చూడడం కద్దు. పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు కంపెనీ లు కూడా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలని బాగా ప్రోత్సహిస్తాయి (ప్రొఫెసర్ ల కి గ్రాంట్స్ అవీ బాగా ఇవ్వడం ద్వారా) అందుకని వాళ్ళు ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకుండా తలలు పరిశోధనల్లో దూర్చి నిశ్చింతగా పని చేసుకోగలుగుతారు. ఇప్పుడిప్పుడే కార్పొరేట్ కల్చర్ మన దగ్గర ప్రబలుతోంది కాబట్టి, ఇటుపై మన దగ్గర కూడా ఈ ధనప్రవాహం ఉంటుందని కోరుకోవడం లో అత్యాశ లేదు. కంపెనీ లు కూడా ఇంకోడి టెక్నాలజీ ని ఉపయోగించి పని చేసే కంటే, టెక్నాలజీ ని కనిపెట్టడం లో పెట్టిన ఖర్చు మీద లాభం దానిని అమ్మడం ద్వారా వస్తుంది అని గ్రహించాలి. IIT ల లాంటి విద్యా పీఠాలు కూడా ఎక్కువ redtapism లేకుండా కార్పొరేట్ లతో నేరుగా deal చెయ్యగలిగితే ఈ పని తొందరగా జరుగుతుంది. పరిశోధనలకి డబ్బు ఎక్కువ కేటాయిస్తే, అంతో ఇంతో తెలివైన బుర్రలు "అటు వెడితే డబ్బు కూడా లేదు" అనుకోకుండా అటు వెళ్లడానికి సిద్ధపడతారు.
పెద్దల ఆలోచనల్లో కూడా ఎంతో కొంత మార్పు రావాల్సి ఉంది. మార్కుల కోసం ఉన్నది బట్టీయం వెయ్యమని పిల్లల్ని పుష్ చెయ్యకుండా, ఎన్ని మార్కులు వచ్చాయన్నది కాకుండా, ఏమి నేర్చుకున్నాము అన్నది ముఖ్యం అని తెలియజెప్పాలి. నా స్వానుభవం ప్రకారం పిల్లలని ఒక సారి ఆ దారిలో పెడితే ఆ attitude జీవితాంతం వెంట ఉంటుంది. పిల్లలకి "వాట్" కంటే "వై" మీద ఎక్కువ concentrate చెయ్యాలని పెద్దలు బోధించిన నాడు మనకి కూడా పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఒకటి రెండు తరాల్లో తప్పకుండా పెరుగుతారు.

Sunday, October 11, 2009

అదృష్టం (ఎవరికో కాని, ఇది మన దురదృష్టం)

కొన్ని వారాల నుంచి "మా" లో (ఆ ఛానల్ వాళ్ళు సినిమా ప్రకటనలు, కొత్త సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూలు అవీ వెయ్యడానికి ఏదో ప్రొబ్లెంస్ వచ్చీ అనేకానేక వింత కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుందామని ప్రయత్నిస్తునడంతో) "అదృష్టం" అని ఒక ప్రోగ్రాం మొదలు అయింది. మా అదృష్టం అడుగంటి, అమెరికాలో ఉండిపోవడం, వచ్చే నాలుగు చానెళ్ళలో (ఆ మిగిలినవి జెమిని, తేజ మరియు "దృశ్య శ్రవణ యంత్రం - తొమ్మిది" (tv9) - వీటి సంగతి ఇంకెప్పుడైనా చెప్పుకుందాము) ఇదే కొంచెం బెటర్ అనిపించడంతో, అప్పుడప్పుడు ఈ షోకి దొరికిపోతున్నాము. ఇది అమెరికాలో NBC అనే ఛానల్లో చాలా పాపులర్ అయిన "Deal Or No Deal" అనే కార్యక్రమానికి చాలా పేద (పూర్) కాపీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి "ఓంకార్" అనే కుర్రాడిని తీసుకొచ్చారు (ఈ టీవీ లో ఏదో ప్రోగ్రాంలో దుమ్ము దులిపిన కారణంగా అతడిని ఇందులో ఇరికించారు అని ఎక్కడో చదివా). ఉండడానికి ఆ కుర్రాడు బాగానే ఉన్నాడు, భావవ్యక్తీకరణ, భాష అన్నీ బాగానే ఉన్నాయి కాని - "ఇలాంటి షోలు నడపాలి అంటే నువ్వు పిచ్చ సీరియస్ గా ఉండాలిరా అబ్బాయి" అని ఎవరో తప్పుదారి పట్టించినట్టు ఉన్నారు. ఇన్ని వారాల్లో ఇప్పటివరకు ఒకసారే నవ్వాడు (అది కూడా నేను చూడలేదు - శాంతి చెప్పింది) - అప్పటికీ యండమూరి వచ్చిన షోలో అనుకుంటాను, యండమూరి మిత్రుడు ఒక ఆయన అడిగాడు కూడాను - "మీరు అలా సీరియస్ గా ఉండకపోతే వచ్చే నష్టం ఏమిటి" - అని. Deal or No Deal లో ఒక మిలియన్ డాలర్లు బహుమతి ఐతే ఇక్కడ ఐదు లక్షలు. ఎంత చెట్టుకి అంత గాలి కాబట్టి పరవాలేదు. కానీ మరీ నీరసంగా "ఇన్-ది-సెట్" ప్రేక్షకులు కూడా లేకుండా, గిఫ్టులు reveal చేసే డబ్బాలు కూడా మరీ అట్టవి పెట్టేసి కొంచెం పీనాసితనం చూపిస్తున్నారు.
అన్నీ ఒక ఎత్తు, ఓంకార్ ఈ షోలో ఆడుతున్న వారితో డీల్ చేస్తున్న విధానం ఒక ఎత్తు. ప్రతీ మనిషికీ ఒక "పర్సనల్ స్పేస్" ఉంటుంది అని ఎవరైనా ఇతనికి చెబితే బాగుణ్ను. కళ్ళల్లో కళ్ళు పెట్టేసి, ఊపిరి తగిలేంత మీదకి వచ్చి "నీ అదృష్టం నేను డిసైడ్ చేస్తా" అనుకుంటూ - ఇబ్బందిగా నవ్వుతుండే గెస్ట్ ల మీద సైకలాజికల్ (అని అనుకుంటూ) ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. మొన్న ఒక షోలో రశ్మి (అప్పుడు "యువ", ఇప్పుడు "లవ్") వచ్చినప్పుడు కొరకొరా చూస్తూ మాట్లాడుతుంటే ఆవిడకి ఏమనిపించిందో కానీ మాకు మాత్రం "అయ్యో" అనిపించింది.
మీరు ఇవన్నీ చూడాలి అంటే తొందరగా ఈవారమో వచ్చే వారమో ప్లాన్ చేసుకొని చూసేయ్యడం బెట్టరు. "కీడెంచి మేలు ఎంచాలి" అనే నానుడి ప్రకారం నాకు ఐతే కొన్నాళ్ల తరవాత ఈ షో ఉండదేమో అనిపిస్తోంది :).
To his defense - ఓంకార్ "ఛాలెంజ్" అని ఒక షో లో కూడా వస్తున్నాడు.. అది బాగానే ఉంది మళ్ళీ (at least అతని పార్ట్) - అందుకని అతనిని కాకుండా, ఈ "అదృష్టాన్ని" ఫైర్ చేస్తే "మా", "మేము" అందరం బయటపడతాము.
కింద వీడియోలో చూడండి (రశ్మి కాదు కాని, కథ మాత్రం అదే).

Monday, August 17, 2009

ఐడియా సూపర్ సింగర్ కాలక్షేపం

మామూలుగా మనం "కాలక్షేపం" అంటే, పాజిటివ్ అర్ధంలో వాడుతూఉంటాము. "పురాణ కాలక్షేపం" అనో, "బాగా కాలక్షేపం అయింది" అనో, "ఏదో అలా కాలక్షేపం అయిపోతోంది" అన్నట్టు.. ఐతే, ఈ కాలక్షేపం మాత్రం తప్పకుండ నేగటివ్ అర్ధంలోనే (అందులో నాకు ఏమాత్రం అస్పష్టత లేదు). ఇంచుమించు ఆరునెలల నుంచి సాగదీస్తున్నారు. మొదటినుంచీ, దీనికి ఏదో "రియల్" రియాల్టీ షో అన్నట్టు రంగు అద్దాలని ప్రయత్నాలు జరిగాయి. (గాయకులు ఇతర గాయకులని, జడ్జిలని ఛాలెంజ్ చెయ్యడం - అలాంటి "పెట్టుడు" నాటకీయతతో). కొంతవరకు పరవాలేదు. సుమ చాలా రోజులు తన క్రియేటివిటీ తో నెట్టుకొనివచ్చింది ఆంఖర్ గా.. అయితే ఇప్పుడు ఆవిడ అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలూ వాడబడి, ఇంకా ఏమి మిగిలినట్టు కనిపించడంలేదు. (ఆవిడ తప్పులేదు.. వారానికి కనీసం నాలుగు గంటలు అదే ప్రజలతో, అదే ప్రోగ్రాం చేస్తూ ఉంటే ఎవరి సృజనాత్మకత ఐనా సరే హరించుకుపోతుంది). ప్రతీ పాట తరవాత, "అద్భుతం", "ఆహా", "ఓహో" అని నచ్చినా నచ్చకపోయినా పొగడడం, గాయకులని ఏదో విధం గా మెచ్చుకోడానికి ప్రయత్నించడం తప్పకుండా చెయ్యమని ఆవిడకి ఆదేశాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు :).

మొదట్లో ప్రిలిమినరీ రౌండ్స్ అన్నారు. తరవాత క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ (మూడు టీంస్ తో అసలు ఇవి అన్నీ కూడా ఎలా సాధ్యమో ఆ దేముడికే "ఐడియా" ఉండి ఉండదు - సరి సంఖ్యలో టీం లు ఉన్నప్పుడే ఇవి వస్తాయి - లేకపోతె నాక్ అవుట్ మాత్రమే సాధ్యం), ఇప్పుడు ఫైనల్స్ ముందు పెద్ద సాగదీత. అప్పుడు కూడా, ఏ టీం ఎన్ని పాయింట్స్ సంపాదించిందో చెప్పడానికి "టోటల్ పాయింట్స్" ని సూచికగా వాడుకోవడం ప్రాధమిక లెక్కల జ్ఞానం ఉన్న ఎవరికీ ఐనా మింగుడు పడదు. ఉదాహరణకి: ఒక టీం నాలుగు పాటలు పాడి, ప్రతీ పాటకి పాతిక మార్కులు సంపాదించారు అనుకుందాం. వాళ్ళ మొత్తం వంద. ఇంకో టీం ఐదు పాటలు పాడి ప్రతీ పాటకి ఇరవై రెండు సంపాదించారు అనుకుందాము - వాళ్ళ మొత్తం నూట పది. అప్పుడు సూపర్ సింగెర్ లో announcement ఎలా ఉంటుంది అంటే, "టీం బీ నూట పది మార్కులతో ప్రధమ స్థానంలో ఉన్నారు - టీం ఏ వంద మార్కులతో ద్వితీయస్థానం" అని చెబుతారు. అక్కడ "average" మార్కులు ఎన్నో చెప్పడం అనేది వాళ్ళ స్థానాలకి సూచిక అని ఐదవ తరగతి చదువుకునే పిల్ల వాడు కూడా చెబుతాడు.

ఇక మొన్న మొన్నే ప్రతీ టీం నుండీ ఒక్కోకర్ని ఎలిమినేట్ చేసారు. ఐతే, చోట challengers నుంచి జయంత్ మాధుర్ ఎలిమినేట్ అవడంతో, అతడిని మళ్ళీ తీసుకొని రావడానికి (ratings కోసం కావచ్చు) మళ్ళీ రీ-ఎంట్రీ డ్రామా నడుస్తోంది ప్రస్తుతం. ఇది ఎప్పటికో అవుతుంది.. ఈ లోగా, Lux వాడు మధ్యలో దూరేడు. నిన్న ప్రోగ్రాం లో శ్రియని చూసి అదిరి పడ్డాము. అసలు శ్రియకి అంత ఉందా? ఆవిడకి ఒక ముక్క తెలుగు రాదు - వీళ్ళు పాడుతున్నది ఒక్కటి అర్ధం అవదు - చంద్రబోస్ గారి మాటలు ఐతే ఒక్క ముక్క కూడా అర్ధం అవదని ఘంటాపధంగా చెప్పగలను ("తెలుగు తన మాతృభాష కాదు" అని అభిమానులు అడ్డం పడచ్చు - కానీ, ఎప్పటినుంచో తెలుగులో నటిస్తూ, నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించకుండా ఉండే వాళ్ళని ఏమనాలో తెలియదు - లేకపొతే, ఒకప్పటి హైదరాబాద్ ఆటో డ్రైవర్స్ లాగ, తెలుగు వచ్చినా మాట్లాడట్లేదు అంటే, అది ఇంకా పెద్ద పాపం :) ). ఈ వారం శ్రియ, వచ్చే వారం ఇంకొకరు, పై వారం వేరొకరు ఇలా కొన్నాళ్ళు సాగుతుందేమో అనిపిస్తోంది నాకు.. ఈ లోగా, ఇక్కడ టూముచ్ లాగుడు అయిపోయి, చంద్రబోస్, అశోక్ తేజ గార్లకి పాటలు రాసే తీరిక, ఓపిక నశించి ఏమి అనర్ధాలు వస్తాయో అని ఇంకో భయం.


ఈ ప్రోగ్రాం లో ఉన్న challengers లో పిల్లలకి ఎంత బోర్ కొట్టిందో ఈ క్రింద వీడియో చూస్తే మీకే తెలుస్తుంది (మనో మాట్లాడుతుంటే, అతని ఎడమ చేతి వెనకాల అలేఖ్య చేస్తున్న పని, ఈ ప్రోగ్రాం ఎప్పుడు అవుతుందిరా బాబూ అనుకుంటూ సుమశ్రీ తలమీద సుగంధిని వాయిద్యం కూడా చూడండి). మన సొంత ఇల్లు కాబట్టి గోడ గోకేసి మన చికాకుని దాని మీద చూపించలేము కానీ, ఈ ప్రోగ్రాం తొందరగా ఒక కొలిక్కి వస్తే సంతోషించే వాళ్ళలో నేను మొదటి వాడిని.

Thursday, July 30, 2009

కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం (Telugu in your computer)

ఇంటర్నెట్ లో తెలుగు లో వ్రాయడం ఈ మధ్య సులభం కావడం చాలా మంది తెలుగు తెలిసిన వాళ్ళకి తెలుగులో వ్రాయాలనే ఉత్సాహం కలిగిస్తోంది - ఇది శుభ పరిణామం. మా బ్లాగ్ చూసో, మేము తెలుగు లో పంపించే వేగులు (ఈమైల్స్) చూసో చాలా మంది ప్రయత్నిద్దామని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒకోవిధంగా ఈమెయిలు లో వివరించే కంటే, ఒక చోట ఉంటే అందరికీ బాగుంటుంది అని ఈ ప్రయత్నం. ఇంటర్నెట్ లో ఈ సమాచారం అంతా ఉన్నా, కొన్ని సార్లు ఎక్కువ సమాచారం కూడా మనల్ని భయపెడుతుంది - ప్రయత్నించడం నుండి దూరం గా ఉంచుతుంది. అందుకని, సింపుల్ గా, తెలుగు లో ఈమెయిలు/చాట్ వ్రాయడం, అంతగా కావాలంటే వర్డ్ డాకుమేంట్ లో తెలుగు లో సేవ్ చేసుకోవడం ఎలా అనే విషయాల మీద ఇక్కడ దృష్టి కేంద్రీకరించాను.

ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:

ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org

వీటిలో మీరు కావాల్సిన తెలుగు టైపు చేసుకొని కంట్రోల్+సీ, కంట్రోల్+వీ ద్వారా ఎక్కడైనా పేస్టు చెయ్యవచ్చు. (ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి - అందుకని తెలుగు తెలుగు లాగే కనిపిస్తుంది).

గూగుల్ మరియు క్విల్‌ప్యాడ్ వారి ఉపకరణంతో, మీరు ప్రాధమిక జ్ఞానం ఉన్నా సరే (అంటే, మీరు "అంటే" అని టైపు చెయ్యాలి అనుకోండి - గూగుల్/క్విల్‌ప్యాడ్ లో ఐతే "ante" అని చేస్తే సరిపోతుంది - లేఖిని లో "anTE" అని వ్రాయాల్సి వస్తుంది - ప్రయత్నిస్తే తేడా మీకు తెలుస్తుంది), తెలుగు లో సులువు గా టైపు చేయవచ్చు. ఐతే, గూగుల్/క్విల్‌ప్యాడ్ కి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి - మీరు టైపు చేసిన ప్రతీ సారి, అది సర్వర్ కి అనుసంధానమై, ఇంతకూ ముందు ఈ అక్షరాల కంబినషన్ తో ఏ తెలుగు పదం వచ్చిందో, దానిని తెచ్చుకుంటుంది - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా అన్నమాట. మళ్ళీ వీటి రెండింటిలో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. క్విల్‌ప్యాడ్ తో ఫార్‌మ్యాటింగ్ కూడా ఎడిటర్ లో నే చేసేయ్యచ్చు. గూగ్లె ఐతే వేరే వర్డ్ ప్రోసెసింగ్ అప్లికేషన్ (వర్డ్ (మైక్రోసాఫ్ట్ లేదా ఓపెన్ ఆఫీస్), లేదా, తెలుగు అర్ధం చేసుకొనే ఏదైన పరికరం) వాడాల్సి ఉంటుంది. ఏది వాడడం అనేది ఎవరి ప్రాధాన్యత ని బట్టి వారు నిర్ణయించుకోవచ్చు.

లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని.ఆర్గ్ కి వెళ్ళిన తరవాత, ఫైల్/సేవ్ఆస్ మెనూ ని ఉపయోగించి, దానిని మీ కంప్యూటర్ మీదకి సేవ్ చేసుకుని offline లో వాడుకోవచ్చు.

యాహూ మెయిల్ లో తెలుగు:

పైన చెప్పినట్టు గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్ లేదా, లేఖిని వాడి, తెలుగు టైపు చేయడం, కాపీ పేస్టు చేసుకోవడం.

జిమెయిల్ లో తెలుగు:


జిమెయిల్ లో ఇప్పుడు చాలా భారతీయ భాషలని అనుసంధానం చేసారు. అందువల్ల మీరు కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. దానికి ముందు మీరు మీ జిమెయిల్ ఎకౌంటు లో తెలుగు ని ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం, ముందు "సెట్టింగ్స్" లింక్ నొక్కండి.

"జనరల్" టాబ్ లో, "ఎనేబుల్ ట్రాన్స్లిటరేషన్" అనే చెక్ బాక్స్ ని చెక్ చెయ్యండి. తరవాత, దాని కింద, "డిఫాల్ట్ ట్రాన్స్లిటరేషన్ లాంగ్వేజ్" అన్న చోట, తెలుగు ని ఎంచుకోండి. కింద కి స్క్రోల్ చేసి, "సేవ్ చేన్జస్" బటన్ ఒత్తండి.

ఇప్పుడు మీరు "కంపోసే మెయిల్" చేస్తున్నప్పుడు పైన "అ" అనే అక్షరం కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే ట్రాన్స్లిటరేషన్ పని చెయ్యడం మొదలు పెడుతుంది. ప్రయత్నించండి.. చాలా సులువు. (ఈ ఆదేశాలు ఇక్కడ కూడా లభ్యం: http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).

జీచాట్ లో (ఆ మాటకొస్తే ఏ వెబ్ సైట్ లోనైనా, ఏ టెక్స్ట్ బాక్స్ లోనైనా) తెలుగు:


గూగుల్ వాళ్ళు ట్రాన్స్లిటరేషన్ తో బాటుగా, దానిని ఒక బుక్మార్క్లేట్ గా అందిస్తున్నారు. ఏ బ్రౌజరు లోనైనా సరే, దీనిని ఒక సారి ఇన్స్టాల్ చేసుకుంటే, మీరు ఏ వెబ్ సైట్ కి వెళ్ళినా సరే - అక్కడ ఉన్న ఏదేని టెక్స్ట్ బాక్స్ లో తెలుగు లో టైపు చెయ్యడానికి దానిని ఉపయోగించవచ్చు. మీరు ఏ బ్రౌజరు వాడుతున్నా, ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు దొరుకుతాయి: http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store

వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:

మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. మీరు వేరేగా ఏమి చెయ్యక్కర్లేదు. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ చాలా వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm

తెలుగు చదవగలిగిన వాళ్ళు అందరికీ తెలుగు లోనే ఈమెయిలు పంపించండి. అన్నట్టు, లేఖిని లో ఇంకో ఉపకరణం కూడా ఉంది. నిఖిలే (లేఖిని ని తిరగేసి :) ). అంటే, అది ఏమి చెయ్యబోతోందో తెలిసింది కదా? ఉదాహరణకి, మీరు ఎవరికైనా తెలుగు లో ఈమెయిలు పంపించారు అనుకోండి, వాళ్ళకి తెలుగు తెలుసు, కాని, చదవడం రాదు. అంటే, వాళ్ళకి "elaa unnaavu" అంటే అర్ధం అవుతుంది కాని, "ఎలా ఉన్నావు" అంటే క్వశ్చన్ మార్క్ ముఖం వేయచ్చు. అటువంటి వాళ్ళు, మీరు పంపించిన తెలుగు సందేశాన్ని నిఖిలే కి అందిస్తే, అది దానిని ఇంగ్లీష్ లో కి మార్చి పెడుతుంది. నాకు ఐతే, ఈ ఉపకరణం చాలా బాగా నచ్చింది. ప్రయత్నించి చూడండి: http://lekhini.org/nikhile.html

ఈ పైన ఇచ్చిన లింకులు ఏవైనా విరిగిపోయినా, ఏమైనా మీకు అర్ధం కాకపోయినా, తప్పక కామెంట్ పోస్ట్ చెయ్యండి - మీ సందేహాలు తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.

Wednesday, July 8, 2009

మా ఊరిలో చంద్రబోస్ గారు


జూలై నాలుగున జరిగిన తానా సభలకి వచ్చిన శ్రీ చంద్రబోస్ గారు మా ఊరు (డేటన్) కి నిన్న (7/6/2009) విచ్చేశారు. ఇక్కడ ఉండేది పన్నెండో తారీఖు వరకు మాత్రమే అయినా, మధ్యలో మళ్ళీ వేరే ఊర్లలో మరిన్ని ప్రోగ్రాములున్నా, ఒక్క రోజే నోటీసు ఇచ్చి తొందర పెట్టినా సరే, పెద్దమనసు చేసుకొని మాదగ్గరకి రావడం మాకు సంతోషం కలిగించింది. మా ఊరి మొనగాళ్ళు, ముఖ్యంగా విజయ్ బొర్రా, శ్రీనివాస్ భవనం, ఫణి తెల్లా ఒక పట్టుపట్టి, ఒక్కరోజులో మొత్తం ఊరిలో ఉన్న చాలామందికి ఈ విషయాన్ని చేరవేసి, సాహిత్యాభిమానుల్ని బాగానే కూడగట్టారు. చంద్రబోస్ గారు పాటల రచయితగానే కాకుండా, ఈమధ్య ఐడియా సూపర్ సింగర్ లో న్యాయనిర్ణేతగా మనటీవీల ద్వారా ముందు మన ఇళ్ళలోకి, తరవాత ఆ కార్యక్రమంలోని తన సహజ, సుతిమెత్తని ప్రవర్తనద్వారా మా హృదయాలలోకి చొచ్చుకొని రావడం కూడా ఎక్కువమంది ఈ ప్రోగ్రాంకి రావడానికి సహాయం చేసింది.
వారిని మంగళ వారం పొద్దున్నే ఊరికి తీసుకొని వచ్చి మా ఊరిలో ఉన్న ఏకైక ఆకర్షణ ఐన ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి తీసుకొనివెళ్లి (తెలియదు కాని, లోపల అంతాకలిపి ఒక రెండు మూడు మైళ్ళు నడక ఉంటుంది) బాగా తిప్పి తీసుకొనివచ్చాడు భవనం. మరి సాయంత్రం ప్రోగ్రాంకి భోజనాలు అవీ ఏర్పాటుచేసి, "తీసుకురావడం మాపని కాని, ప్రోగ్రాం నడిపించడం మీపని" అంటూ వాళ్ళు మాకు అప్పగించారు. సరే, ఇంక చేసేదేముంది? నెమ్మదిగా ఆఫీసులో కూర్చొని, బోస్ గారిని అడగానికి కొన్నిప్రశ్నలు వ్రాయడం మొదలుపెట్టాను. ఈమధ్య ఏ ఇంటర్వ్యూ చూసినా, "ట్యూన్ కి వ్రాయడం సులువా, స్వేచ్ఛగా రాయడం సులువా" అనో, "మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు" లాంటి స్టాక్ ప్రశ్నలు పెరిగిపోయాయి రచయితలకి. అందుకని వాటికి దూరంగా ఉండడానికి నిశ్చయించి, కొన్ని వ్రాసాను. నాకు ఆయన వ్రాసిన చాలా పాటలు ఇష్టం అవడంవల్ల, ఇంచుమించు ఆయన కెరీర్ అంతాకూడా మన కళ్ళముందరే జరుగుతూ ఉండడంవల్ల (ఆయన మొదటి పాట నేను ఇంటర్ లో ఉండగా వచ్చింది), ఆ పని పెద్ద కష్టం కాలేదు.
పనిదినం (వీక్ డే) కావడంవల్ల "ఎంతమంది వస్తారో" అనుకుంటూ నెమ్మదిగా క్లబ్హౌస్ కి చేరుకున్నాము. చెప్పిన సమయానికే చాలమంది వచ్చి బుద్ధిగా కూర్చోవడం చూసి భలే ముచ్చటవేసింది (అంటే, లేట్ అయినాసరే, కొంచెం చిరాకుపడకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ - ఎన్నాళ్ళకో కలిసిన స్నేహితుల్లా.. చిన్న ఊరిలో ఉంటే అదే లాభం కామోసు). సరే పెద్ద హడావిడి చెయ్యకుండా బోస్ గారు క్లబ్ హౌస్ కి చేరుకున్నారు. "అరెరే మన టీవీలో ఈయనే కదా", "భలే సింపుల్ గా ఉన్నారే" అనుకుంటూ నెమ్మదిగా చుట్టూచేరాము. అందరినీ ఆయనే కుశల ప్రశ్నలు వేసేసి, సమయానికి సమయం చూసుకొని పాడయిపోయిన మైక్ సెట్ ని బిగించడంలో నిమగ్నం అయిపోయారు. "ఇదేదో బాగానే ఉందే? ఈయన చెబితే వింటుందేమోలే! " అని మేము కూడా పక్కన నించొని చూస్తున్నాము. పాత మైక్ లు పనిచెయ్యకపోవడంతో వేరేది బిగించి ఇక కార్యక్రమంలోకి దిగాము.
ముందుగా లక్ష్మి మంగిపూడి గారు "యాకుందేందు" ప్రార్ధనాగీతాన్ని అద్భుతంగా పాడి బోస్ గారికి సవాల్ విసిరారు ("సవాల్" అని ఎందుకు అన్నానో తరవాత అర్ధం అవుతుంది) తరవాత ఆపాటకి ఆయన స్టైల్లో చిన్నగా నవ్వుతూ నైన్ అవుట్ అఫ్ టెన్ ఇచ్చేసారు అనుకోండి అది వేరే విషయం. డాక్టర్ సతీష్ కత్తుల ఏమో, బోస్ గారు పాటలు వ్రాసిన సినిమాల పేర్లతో కూడిన పరిచయాన్ని సభికులకి వినిపించి ప్రోగ్రాం మొదలు పెట్టారు.

తరవాత తనతో తెచ్చుకున్న చిన్న "చీట్ షీట్" ఓపెన్ చేసి ఒక అరగంట సేపు ఆయన తనదైన స్టైల్లో తను వ్రాసిన పాటలని వివరిస్తూ, కొన్నింటిని వీనులవిందుగా పాడుతూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసారు. ఆయన పాడిన కొన్ని పాటలు - "గుర్తుకొస్తున్నాయి", "అమెరికా అమెరికా", "చీరలోని గొప్పదనం", "నీ నవ్వుల తెల్లదనాన్ని", "మౌనం గానే", "జై జై గణేశ", "పెదవే పలికిన", "ఎక్కడో పుట్టి". అమెరికా రావడం ఇదే మొదటిసారి అయినా, ఇక్కడ పదేళ్ళు ఉండి, అన్నీ చూసివచ్చి రాసినట్టుగా ఉంది ఆపాట ("అమెరికా అమెరికా"). మల్లాది ట్రావెలాగ్ చదివి రీసెర్చ్ చేసి వ్రాసానని చెప్పగానే అవాక్కవడం మావంతు అయింది. తరవాత సెగలుకక్కే టీ కోసం ఒక నిముషం బ్రేక్ తీసుకున్నప్పుడు మా సకలకళావల్లభుడు విజయ్ భాస్కర్ గారిని ముందుకిపంపించాము.. ఆయన తన కళలపొదిలోంచి దాన వీర శూర కర్ణలో ధూళిపాళగారు చెప్పిన డైలాగులు బయటకి తీసి ఒక దీర్ఘ సమాసంతో తనదైన టచ్ ఇచ్చి, ఏమీ ఎరగనట్టు వెనక్కివచ్చి కూర్చున్నారు (ఇక్కడ చప్పట్లు).

దాని తరవాత, మరి తాను చెప్పదలచుకున్నది అంతాచెప్పానని, ఇప్పుడు ఎవరైనా మాట్లాదలుచుకుంటే, తలపడడానికి రెడీ అని ప్రకటించారు. ఇంక మనకి అడ్డేముంది? కాగితాల బొత్తి తీసుకొని ఎగబడ్డాను.. కొన్ని ప్రశ్నలు, వాటికీ సమాధానాలు (అన్నీ కూడా ఇక్కడ కుదించడం జరిగింది) :
డేటన్: మీరు పరిశ్రమ లో కాలు పెట్టినప్పుడు సిరివెన్నెల, వేటూరిలాంటి ఉద్ధండులు అప్పటికే వ్రాస్తూఉండేవారు కదా.. మరి వాళ్ళ సమకాలికులుగా మీరు ఏమి జాగ్రత్తలు తీసుకున్నారు.. బిక్కు బిక్కు మంటూ వచ్చి ఉండాలి?
చంద్ర: అందుకే మొదట్లో "బిక్కు బిక్కుమంటూ" అంటూ ఒక పాట కూడా వ్రాసాను (పెళ్లి సందడి లో) :).(నిజమే.. పెద్ద వాళ్ళ మధ్య ఒద్దికగా ఉంటూనే, సర్వజనామోదాన్ని, ఆ పెద్దవాళ్ళ మెప్పుని పొందడం కూడా కష్టమైన పనే. అది బోస్ గారు చేసిచూపించారు.)
డేటన్:మీరు వచ్చినప్పుడు కొంచెం క్లిష్టమైనతెలుగు, సరళపదాలతో కలిసి వస్తూఉండేది. ఇప్పుడు కొన్ని సరళపదాల తెలుగు చాలా ఇంగ్లీష్పదాలతో కలిసి వస్తోంది సినిమాపాటల్లో.. ఈ ట్రెండ్ కి కారణం? అలాగే, మీరు అటువంటి పాటలు వ్రాయలేకపోయాను అని అనుకుంటున్నారా (ముఖ్యం గా విశ్వనాధ్ గారి దర్శకత్వంలో సిరివెన్నెలగారు, సిరివెన్నెల, స్వర్ణకమలం లాంటి సినిమాలకి రాసేటువంటి అవకాశం మీరు వచ్చేసరికి తగ్గడం, ఇప్పుడు అన్నీ కూడా ఒకే రకమైన ప్రేమ పాటలు తప్ప వేరేవి ఎప్పుడో కాని లేకపోవడం మీద మీ అభిప్రాయం).
చంద్ర: ట్రెండ్ ని బట్టి మనం నడవాల్సిఉంటుంది. నేను ఒకచోట పనిచేస్తుంటే, వారికి ఏదికావాలో అది నేను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ నాకున్న పరిధుల్లో నాపాటకి నేను బాగానే న్యాయం చేసాను అని అనుకుంటున్నాను (అది తప్పకుండా నిజం అని నాకు అనిపించింది - ఉన్న పరిధుల్లో కూడా, సరళమైన పదాలు వాడుతూ ఎప్పటికి అప్పుడు కొత్త భావాలతో ముందుకి వస్తూ, పదప్రయోగాలో కొత్తదారులు వెతుకుతూ చంద్రబోస్ గారి ప్రయాణం సాగుతోంది)
డేటన్:ఒక పాట కష్టపడి వ్రాసిన తరవాత, సినిమా సరిగ్గా నడవకపోతే మీపాట మీరు చేరుతుంది అనుకున్నంత మందికి చేరకపోవడం మీద మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాగే చాలా మంది హీరోని చూసి పాటల ఆల్బం కొంటారు కూడా.
చంద్ర: నాకు సంబంధించినంత వరకు ఒక సినిమాతో నాపని పాటలువ్రాసి, ఆడియో రిలీజ్ అవడంతో ముగుస్తుంది. జయాపజయాలు మనచేతిలో లేవుకాబట్టి, దాని గురించి మనం ఏమి చెయ్యలేము.(జనాలు కూడా హీరోని , హిట్టు ఫ్లోప్ ని కాకుండా, రచయితని, సంగీత దర్శకుడిని చూసి ఆల్బం కొనే రోజు ఎపుడు వస్తుందో).
డేటన్:పరభాషా గాయకులు మీరు వ్రాసిన పాటలని సరిగ్గా ఉచ్చరించకుండా పాడుతూ ఉంటే, మీరు దానిని ఆపడానికి, సరిదిద్దడానికి ఏమైనా ప్రయత్నించారా? (రెండు ఉదాహరణలు: రామదాసులో హరిహరన్ (ఇది బోస్ గారు రాయకపోయినా) "దసరత రామా గోవిందా - మము దయచూడు పాహి ముక్కుందా" అని, రాజకుమారుడు లో కవిత కృష్ణమూర్తి "కాటన్ జీన్స్ లో మీముందుకొస్తే అల్లర్లు ఎంతందీ" ని ఉదహరించాను).
చంద్ర: ఇప్పుడు ఉన్న స్పీడ్ యుగంలో మనం ప్రతీపాటనీ దగ్గర ఉండి చూడడం కుదరడం లేదు.. అందులోను, పాట హైదరాబాద్ లో వ్రాస్తే, చెన్నైలో మ్యూజిక్, బొంబాయిలో మిక్సింగ్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు కూడా రచయితని బొంబాయి తీసుకొని వెళ్లి వాళ్ళు సరిగ్గా పలుకుతున్నారో లేదో చూసే ప్రయత్నం చెయ్యట్లేదు. "చింతకాయల రవి" కి మాత్రం నేను అది చెయ్యగలిగాను. (పరభాషా గాయకుల మీద వెర్రి కాకపొతే, అంత ఖర్మ మనకి ఎందుకు? చక్కగా మన దగ్గరే బోలెడంతమంది పాడేవాళ్ళు ఉంటే, ఆ రికార్డింగ్ ఏదో హైదరాబాద్ లోనే అఘోరించవచ్చు కదా!! - మన మ్యూజిక్ డైరెక్టర్ లు ఎప్పుడు నేర్చుకుంటారో).
డేటన్:ఒక దశలో, మణిశర్మ, మీరు మరియు శంకర్ మహదేవన్ కాంబినేషన్లో బోలెడన్ని సందేశాత్మక/హీరో పరిచయ గీతాలు వచ్చాయి.. అన్ని పాటలు మీరు విభిన్న భావాలతో (ఏ హీరో కి ఎలా కావలిస్తే అలా) రాయడం నిజంగా అబ్బురపరుస్తుంది. అన్ని ఎలా వ్రాయగలిగారు?
చంద్ర: ఆ పాటలన్నీ వేర్వేరు భావాలతో వ్రాయగలిగాను కాబట్టే అన్ని వ్రాయగలిగాను. (ఈ చమత్కారం నాకు నచ్చింది. నా ప్రశ్నలోనే సమాధానం చూపించారు - మరి ఏ రెండైన ఒకేలాగా ఉంటే మూడవ నిర్మాత అడగరు కదా!).
డేటన్:మీ నుండి విషాద గీతాలు ఎక్కువ వినిపించవు?
చంద్ర: నాకు ఎక్కువగా ఇష్టం ఉండవు, అందుకని అవాయిడ్ చేస్తాను. (ఆయన పాటల్లో ఉండే ఒక కిక్ వల్ల కావచ్చు, పదాల్నిఉపయోగించడం లో హాస్య చతురత కావచ్చు, ప్రజలకి చంద్రబోస్ గారి నుండి ఎప్పుడూ "సంతోషం" ధ్వనించే పాటలు ఆశించడం అలవాటు అయింది. ఆయనకీ అదే కావాలి, మనకే అదే కావాలి అంటే, ఇంక గొడవే లేదు :). )
డేటన్:ఇప్పటి వరకు ఎన్ని పాటలు వ్రాసారు?
చంద్ర: ఆరువందల సినిమాలలో ఇంచుమించు రెండు వేలు. (ఇది నిజంగానే పెద్ద ఫీట్ - అంటే, యావరేజ్ లో రెండు రోజులకి ఒక పాట).
డేటన్:రాజ్ పైడా, ఇంకా శశి థక్కర్ గార్లు మధ్యలో అడిగారు: డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, నటుల పిల్లలు నటులు అవడానికి టాలెంట్ అక్కర్లేదు.. కానీ, రచయితల పిల్లలు రచయితలు అవుతారని తప్పకుండా చెప్పలేము. మరి అటువంటప్పుడు రచనలో తరవాతి తరాన్ని తీసుకొని రావడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా?
చంద్ర: మా టీవీ లో ఇదివరలో ఒక ప్రోగ్రాం చేసాము.. "పాటల పల్లకి" అని. అందులో కాన్సెప్ట్ ఇదే. ఒక పాట వ్రాయడం. "మా" టీవీ ఆస్థాన గాయకుల చేత దానిని పాడించడం. నేను అందులో న్యాయ నిర్ణేత గా ఉన్నాను. ఐతే, సరైన ఆదరణ లేని కారణం గా ఆ ప్రోగ్రాం ని ఇరవై ఎపిసోడ్ల తరవాత ఆపెయ్యల్సి వచ్చింది. (అది దురదృష్టకరం - కాకపోతే ఇప్పుడు తెలుగు లో కధలు, నవలలు, కవితలు వ్రాసేవాళ్ళు బాగానే కనిపిస్తున్నారు. వాళ్ళలో ఎందరు గొప్ప పాటలు రాసే రచయితలుగా ఎదుగుతారో చెప్పలేము కాని, ఎదగాలని మనం తప్పక ఆశించడం లో తప్పు లేదు).
వందన పవన్ అడిగిన ప్రశ్నకు, "ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను" పాటను తను వ్రాయడం గురించి, తన భార్య నృత్యరచన చెయ్యడం గురించిన సరదా సంగతులు పంచుకున్నారు.

ఇవి కాకుండా ఐడియా సూపర్ సింగెర్ గురించి, తన దినచర్య, ఏ టైం లో పాటలు వ్రాస్తారు, తన భార్య, పిల్లలు, కుటుంబం, తనకు ఇష్టమైన సంగీత దర్శకుడు కీరవాణిల గురించి ఎన్నో వివరాలు మాతో పంచుకున్నారు (అన్నీ చెప్పేస్తే ఎలా? :) ). అక్కడ డిన్నర్ చేసి, నెమ్మదిగా డాక్టర్ సతీష్ గారి ఇంటికి బయల్దేరాము. అక్కడ మళ్ళీ మరిన్ని కబుర్లు చెప్పుకొని, తప్పనిసరై ఇంటికి కదిలాను. ఈరోజు వంద గంటలు ఉంటే బాగుండునని కనీసం వెయ్యి సార్లు అనిపించింది. మా ఊరిలో తెలుగు సంఘం గురించి, మేము చేసే కార్యక్రమాల గురించి కూడా ఆసక్తి తో అడిగి తెలుసుకున్నారు. నాకు అన్నింటికంటే నచ్చినది ఏమిటంటే, మేము ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత తిక్క ప్రశ్నలు వేసినా , ముఖంలో చిరునవ్వు చెరగకుండా, గత వారం రోజులుగా ఉన్న యమబిజీ షెడ్యూల్ వల్ల వచ్చిన అలసటని ముఖంలో కనిపించనివ్వకుండా అందరినీ ఎంతో ఎంటర్టెయిన్ చేసారు. నిజంగా, మనస్ఫూర్తిగా ఇది చాలాకాలం గుర్తుంచుకోదగిన సాయంత్రం.

Monday, June 1, 2009

తెలుగునాడి

మే-జూన్ 2009 తెలుగునాడి సంచిక సంపాదకీయం చూసి ఖంగారుపడ్డాను. అందులో, తెలుగునాడి వచ్చేనెల నుంచి రాదనీ, ఇంత తక్కువ ఆదరణతో పత్రిక నడపడం సాధ్యం కాదనీ తెలియజేసారు. ఐదేళ్ళ క్రితం మొదలు అయినప్పటినుంచీ తెలుగునాడి పత్రికను (చందా చెల్లించే) చూస్తున్నాను. ఏదో ఒక థీమ్ కింద కాకుండా, అందరికీ నచ్చే అన్ని అంశాలు (పాత కాలపు పద్యాల మొదలుకొని, అలనాటి కధ, సీరియల్, పిల్లల సెక్షన్, కార్టూన్లు, ప్రత్యేక వ్యాసాలూ, అలనాటి సినిమా, ఈనాటి సినిమా ల వరకు) గుదిగుచ్చి అందిస్తూ వచ్చారు. ఏ దశలోను కూడా పత్రిక క్వాలిటీ పెరిగిందనే తప్ప తగ్గిందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఐతే, మొదటినుంచీ కూడా, సరిపడినందరు చందాదారులు లేకపోవడం అనేది ఈ పత్రికకి ఉన్న ఎటర్నల్ సమస్యగా కనిపించింది. అంటే, అమెరికాలో ఒక తెలుగు పత్రిక survive అవడానికి సరిపడినంతమంది తెలుగువాళ్ళు లేరా? (ఇది వరకు ఎప్పుడో 1000 మంది చందా దారులు ఉన్నట్టు పత్రికలో ప్రచురించిన నోటీసులో చూసిన గుర్తు). ఇన్ని వేలమంది తెలుగు కుటుంబాల్లో ఒక్క వేయి మనదేనా? సిగ్గు కదూ? ప్రతీ వాళ్ళు, "ఇండియాని మిస్ అయిపోతున్నాము, తెలుగుని, పండగలని, సరదాలని కోల్పోతున్నాము" అనే వాళ్ళే తప్ప (అలా అంటూ కూడా ఇక్కడ వీలైనంత కాలం మాత్రం ఉండేవాళ్ళే), మనకి ఇండియాని దగ్గరకి తీసుకొని వచ్చే ప్రయత్నానికి మాత్రం చేయూతని ఇవ్వలేకపోయారు. గుర్తు చేసుకుంటే, నేను ఈ ఐదేళ్ళలో కలిసిన అనేక మిత్రుల, బంధువుల ఇళ్ళలో చాల కొద్ది మంది మాత్రమే ఇలాంటిది ఒకటి ఉందనీ, దానికి మేము చందాదారులమనీ చెప్పారు. మిగిలిన వాళ్ళకి నేను చెప్పినా, అదేదో పెద్ద తలనొప్పి అయినట్టు, తెలుగు చదివితే పాపం అన్నట్టు ఊరుకున్నారు. పెళ్లి పందిరి ప్రకటనల్లో మాత్రం "మా అమ్మాయి/అబ్బాయి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలలో పెరిగార"నీ, మాకు "ఇండియన్ వాల్యూస్" ఉన్న కోడలు/అల్లుడు కావాలని కోరుకోవడమే తప్ప, ఆ వాల్యూస్ పిల్లలకి నేర్పించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం ఆశ్చర్యకరం. ఇంట్లో ఒక తెలుగు పత్రికో, పేపరో పడి ఉంటే, పది సార్లకి ఒక సారైనా దాని వంక చూడడమో, ఆ "వింత" భాష ఏమిటో తెలుసుకోవాలని పిల్లలకి అన్పించడమో జరుగుతుంది. పెద్దలకే ఆ బుద్ది లేకపోతె పిల్లల వరకు ఎందుకులెండి? ఈ మధ్య తెలుగులో ఈమెయిలు చేసే సదుపాయం రావడంతో నేను తెలుగు చదివే మిత్రులు/బంధువులకి తెలుగులో వేగులు పంపించడం మొదలు పెట్టాను. ఇంగ్లీష్ లో పంపిస్తే వెంటనే వాళ్ళకి వీలైనన్ని వ్యాకరణ దోషాలతో రిప్లై చెయ్యడానికి ఎగబడే అందరూ, మాతృభాషలో మాట్లాడే అవకాశం వున్నా (ఎలా చెయ్యాలో నేను నా మెయిల్ లో చెప్పినా), తెలుగులో సమాధానం చెబితే ఎక్కడ తమ prestige కి భంగమో అని రిప్లై లు కూడా చెయ్యకుండా ఊరుకుంటున్నారు. ఇటువంటి అనుభవం మరి ఎవరికైనా అయిందో లేదో నాకు తెలియదు. కానీ, నా ఒక్కడికే జరగలేదేమో అని నా అనుమానం ("మన" జనాల సంగతి నాకు బాగానే తెలుసు కాబట్టి చెబుతున్నా). చెప్పొచ్చేదేమిటంటే, ఇటువంటి జనాల మీద ఆశ పెట్టుకొని, లాభాపేక్ష లేకుండా పత్రికని నడపడానికి కృషి చేసిన వాళ్ళని ఉసూరుమనిపించేలా చేసినందుకు అమెరికాలో తెలుగువాళ్ళు తలదించుకోవాలి.ఈ ఐదేళ్లు, పత్రికని సమర్ధవంతంగా నడిపినందుకు చౌదరి గారు మరియు టీంకి అభినందనలు.

గమనిక: తెలుగునాడి తో పాఠకుడిగా ఐదేళ్ళ అనుబంధమే తప్ప, నాకు ఏ విధమైన భాగస్వామ్యం లేదు.

Monday, May 18, 2009

"సత్తా" చూపాలి.

ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడినా, లోక్సత్తా నుండి జయప్రకాశ్ నారాయణ్ గారు గెలవడం నాకు చాల సంతోషం కలిగించింది. రాజకీయాలంటే మురికి కూపాలని, రాజకీయ నాయకులంటే (సినిమాలలో చూపించినట్టు హత్యలు, నేరాలు చేస్తూ బ్రతికే) క్రిమినల్స్ తప్ప వేరెవ్వరూ కాదనే జనాల నమ్మకం విశ్వాసం గా మారడానికి ఇంకెంతో దూరం లేదనిపిస్తున్న ఈ కాలం లో, రాజకీయాల్లోకి చదువుకున్నవాళ్ళు/సత్చరిత్రులు కూడా రావాలని, వస్తే ఎలా ఉంటుందో చూపించాలని, వచ్చి వ్యవస్థ ని మార్చడానికి ప్రయత్నించాలని, వాళ్ళు అది చెయ్యడం చూడాలని నాకెప్పటి నుంచో కోరిక. అలా అనుకోవడమే తప్ప, ఆ మొదటి అడుగు వెయ్యలేకే, నాలాంటి వాళ్ళు వేలమంది ఎదురు చూడడం తప్ప వేరే ఏమి చెయ్యకపోవడం వల్ల ఇవాళ మనం ఈ స్థితి లో ఉన్నాము - అది వేరే విషయం అనుకోండి. ఐతే ఒక సారి ఇటువంటి మార్పు రావడం మొదలు పెడితే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఆయన ఒక దారి చూపించాడు కాబట్టి, అది మరీ చెయ్యకూడని పని కాదనీ, కొంతమందికే (డబ్బు, దన్ను ఉన్న వాళ్ళకే) పరిమితం కాదనీ వేలమంది ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఆయన ఎన్నిక కావడం అనేది, సొంతం గా ఆయనకి ఎంత ఉపయోగిస్తుందో ("ఉపయోగం" అంటే, మిగిలిన రాజకీయనాయకులకి ఉపయోగించినట్టు కాదు) తెలియదు కానీ, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మార్పులు తప్పక తీసుకొని వస్తుందని నా నమ్మకం.మిగిలిన మూర్ఖ శిఖామణులు ఆయన్ని అసెంబ్లీ లో మాట్లాడనిస్తారనీ, మాట్లాడింది అర్ధం చేసుకొని మంచి పాలన ని అందిస్తారనీ, రాబోయే రోజుల్లో లోక్ సత్తా రాజకీయాల్లో తన ఉనికిని మరింత బలంగా చాటుతుందనీ నా ఆశ.Go JP!!.

Friday, March 6, 2009

Breakfast that kids love:







Here is something that worked with our 15 month old. We tried various recipes for breakfast - but one thing that kids always want is "change". If you try to give them something without a break, they turn away and you can never force them to eat - that is the rule. But well, there are exceptions to rules - such as this.

Whole grains is always good, both for you and your kid. We took a couple of whole grain cereals - Raisin Bran and Honey Bunches of Oats. Mix them in equal amounts (dont worry if you dont stock up on both, it will work even if you choose one of these - but usually, the taste of "honey" in the Bunches of Oats helps them adapt to this quickly). Remove raisins from the Raisin Bran and Almond pieces from the Honey Bunches if you think he can't chew on them. Crush the cereal with your fingers so that it turns into little pieces (not so much as to make a powder). Add Soy Milk (Natural Silk, for example, as shown, which is available everywhere, need not necessarily the brand shown). Let the mixture soak for an hour and go for it. This is working for our child for the past couple of months - I am sure your kid will love this too. We asked and found out from our pediatrician that Soy Milk is safe for babies over 1 year old (You can find from yours if you want to make sure - especially if you know that your kid is allergic).

We eat the Raisin Bran and Honey Bunches of Oats ourselves, hence we tried his breakfast with them. This process can be followed with any other cereal of your choice and see how it works. This breakfast can be made with regular milk, but we felt that Soy Milk has a distinct taste that makes it more attractive for both kids and adults alike.

Monday, February 23, 2009

పొద్దుతిరుగుడు గింజల పొడి

పొద్దు తిరుగుడు గింజలు ఉత్తివి తింటే మరీ మట్టిలా వుంటాయి అని నా స్వంత అభిప్రాయం. ఐతే, మరి వాటిలో వున్న మంచి గుణాలు (http://www.nutritiondata.com/facts/nut-and-seed-products/3079/2) రావాలి అంటే తినక తప్పదు కదా.. ఇది ట్రై చెయ్యండి. మాకు ఐతే మహా బాగా నచ్చింది.

పొద్దు తిరుగుడు గింజలు : 250 గ్రాములు
ఎండు మిరపకాయలు : తగినన్ని
ఉప్పు: తగినంత
(ఇంక రేసిపె ఏమి వుంది అంటారా? :) - "పొద్దు తిరుగుడు గింజలతో పొడి చేసుకోవచ్చు" అని చెప్పడమే దీని ఉద్దేశ్యం)

ముందుగా గింజలని తీసుకొని, ఒక మూకుట్లో దోరగా వేయించండి. (నూనె వెయ్యక్కర్లేదు). అయిన తరవాత, పక్కకి తీసుకొని, ఎండు మిరపకాయలని తీసుకొని వాటిని కొంచెం (చాల కొంచెం అన్నమాట) నూనెతో వేయించండి. ఇవి రెండూ చల్లారిన తరవాత మిక్సీ లో వేసుకొని మరీ ఎక్కువ కాకుండా (ముక్క-చెక్క లాగ) తిప్పుకొని, రుచిని బట్టి ఉప్పు చేర్చండి. అన్నం లో వేసుకొని తింటే అధ్బుతం గా వుంటుంది.
మిక్సీ పట్టేప్పుడు మాత్రం జాగ్రత్త.. ఎక్కువ తిరిగింది అంటే నూనె ఊరి, ముద్ద అయిపోతుంది.

ఈ పొడిని నూపొడి కి ప్రత్యామ్నాయం గా కూడా వాడుకోవచ్చు.

మరింక ఎంజాయ్ చేసుకోండి.

(ఇదే రేసిపె ని గుమ్మడి కాయ గింజలతో, మరి ఏ ఇతర గింజలతో ఐనా ప్రయత్నించవచ్చు.)

Tuesday, February 10, 2009

బిర్యానీ పాటలు..

ఈ మధ్య నాకు బాగా నచ్చిన పాటల్లో ఈ ఆవకాయ్ బిర్యాని పాటలున్నాయి. ముందు విన్నప్పుడు సంగీతం బాగుందనీ, పాటలు బాగా పాడారు (ముఖ్యం గా కార్తీక్ వల్ల) అని అనిపించింది - కానీ, వినేకొద్దీ ఈ పాటల లోతు మరింత తెలవడం మొదలు పెట్టింది. సంగీత దర్శకుడు మణికాంత్ saxophone ప్లేయర్ ఏమో తెలియదు - మరి అలా కావడం వల్లో, లేదా, తన తండ్రి (కద్రి గోపాలనాధ్) saxophone విద్వాంసుడు కావడం వల్లో తెలియదు.. చాలా పాటల్లో రాగాలన్నీ (రాగం అంటే, పాట base అయిన రాగం కాదు - పాటలో గాయకులు "తీసే" రాగం) ఎంతో చక్కగా, సాఫ్ట్ గా, saxophone తో వాయించినట్టు వీనులవిందు గా వున్నాయి. ఇంకొన్ని సార్లు వినేకొద్దీ ఈ tunes అన్నీ కూడా చాలా కాంప్లెక్స్ గా అనిపించడం మొదలు పెట్టాయి. అంటే, సంగీత పరం గా కాదు (అవునేమో నాకు తెలియదు), సాహిత్యాన్నీ ఎంతో చక్కగా, ముందు రచయితకి చాలా స్వతంత్రం ఇచ్చి రాయించినట్టు, తరవాత ఆ సాహిత్యాన్ని, భావం కోల్పోకుండా tunes లో అత్యంత ప్రతిభ తో సర్దినట్టు, ఇంక ఏమేమో!!. అప్పుడు ఈ సాహిత్యాన్నీ మరికొంచెం క్లోజ్ గా వినడం మొదలు పెట్టాను.. వనమాలి పాటలు ఇదివరకు విన్నాము కానీ, ఇంట భావగర్భితం గా వ్రాయడం చూడలేదు.. భవిష్యత్తులో ఒక మంచి పాటల రచయిత గా ఆయన తప్పక నిలబడతాడు అనే అనిపిస్తోంది. ప్రస్తుత తెలుగు చిత్రసీమ లో రెండు స్కూళ్ళు వుంటే (ఒకటి సిరివెన్నెలది, ఇంకోటి వేటూరిది) ఈయన తప్పక వేటూరి స్కూల్ కి చెందుతాడు - లేదా, తన సొంత స్కూల్ తనే పెడతాడో వేచి చూడాలి.సంగీతం, సాహిత్యం చక్కని పాళ్ళలో కలిసిన వీనుల విందైన పాటలు ఇవి.. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా చాలా కాలం నిలుస్తాయి అని మాత్రం చెప్పగలను.

నన్ను చూపగల అద్దం - నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే... ౨
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిముషానాఇన్నాళ్ళకు నీలో నను దాచిన సంగతి కనుగొన్నా..
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిముషానానేనిక లేనా? నువ్వయ్యానా? నన్ను చూపగల

ఈ క్షణమే.. మనకై వేచి, మనసులనే ముడివేసే..కడదాకా, నీతో సాగే కలలేవో చిగురించే..నిలువెల్లా నాలోనా.. తడబాటే చూస్తున్నా....
నిను చేరే వేళల్లో, తపనేదో ఆగేనా? నన్ను చూపగల

=====================================
వీరుడేనా, వీడినేనా నేను కోరుకున్నా.. దగ్గరయ్యే వాడేనాదాచుకోనా?
వూరు వాడా మెచ్చినోడు వీడేనా, నాకు కూడా నచ్చినోడు నాకేనా, ఏనాటికైనా..
రేపువైపు, చూపులేని కళ్ళతోనా.. కొత్త ఆశే చూస్తున్నా వాడి వలన..
లోకమంతా, ఏకమైనా, వాడివేంటే, సాగిపోనా.. నీడలాగ మారిపోన..........

నిన్నూ నన్నూ ఇలా ఏకం చేసే కల తీరేలా దరి చేరేదెలా..
చేరువైనా, దూరమైనా ప్రేమలోనా, వాడి ఊహే హాయేగా..
గుండెలోనాజాలువారే, వూసులన్నీ , వాడితోనే పంచుకోనా ఊపిరల్లె వుండిపోనా..
ఏలుకోడా ప్రాణమల్లే చూసుకోడ, నన్ను కూడా నా లాగే కోరుకోడా
బాధలోనూ వెంటరాడా, బంధమల్లె, అల్లుకోడా? వీడిపోని తోడుకాడ?
====================================
నడిచే ఏడు అడుగుల్లో.. అడుగొక జన్మ అనుకోనా.. ౨
వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా..
చిలకా గోరువంకా చెలిమే మనది కాదాపిల్లా పాపలింకా కలిమే కలిసిరాదా
నేలైనా ఇక పైనా నీ పాదాల వేలైనా తాకేనా..

కురిసే పండు వెన్నెల్లో కునుకే చాలు వళ్ళో
మెరిసే మేడలెందుకులే మదిలో చోటు చాల్లే
ఊగే డోలలో సిరులే పాపలు - నీతో కబురులే నా మునిమాపులు
ఈ కలలే నిజమయ్యే బ్రతుకే పంచితే చాలునువ్వేలే..
==================================
మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది..కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచింది..
కొత్తావకాయే తన కంటి ఎరుపాయే.. ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే
కారాలు నూరే సందళ్ళు కొలువాయే... కాలాలు మారే కధలే ఇక మొదలాయే..

గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అమ్మాయీ.. గుండెల్లో ఆశలు వున్నాయి
కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి, నీ కోసం మా చిరునవ్వులు వేంచేస్తున్నాయి..

ఏ నది తో ఏ వైరం ఈ నావను వెంటాడిందో ఒంటరిగా చేరిందీ ఈ తీరం
గుండెల్లో ఈ భారం ఎందాకా నడిపిస్తుందో తేల్చదుగా ఎన్నటికీ ఈ దూరం..
దారే పూలే పరచీ కడదాకా నిన్నే రమ్మంటే - చేరే గమ్యం ఎంతో గొప్పైనా అర్ధం వుంటుందా..
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదవుతుందా .. తెగువే వుంటే గెలుపే సైతం నీతో నీడై రాదా..గువ్వల్లే

ఏ ఓటమి ఎదురైన ఆశే నీ వెన్నంటేనా.. వేకువకై పరుగే ఆగేనా
చినుకల్లే మొదలైనా చిగురించిన పరిచయమేదో చివరికి ఆ సంద్రం లా మారేనా..
నింగీ నేలా రెండూ ఎపుడైనా కలిసే వీలుందా పొంగే వానే వంతెన వేసిందా ఆ కల నిజమవదా..
ఏ నాడు కలవని దిక్కులు కలిసిన వింతలు కంటికి ఎన్నో కనబడలేదా చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదే..గువ్వల్లే
==============================================
అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు..
ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఏవో వైనాలు
ఎగిరొచ్చే ఆ గువ్వలా చిగురించే ఈ నవ్వులాసాగే సావాసం
ప్రతి హృదయం లో ఆ కల, నిజమైతే ఆపేదెలా, పొంగే ఆనందంకలైనా, ఏదో కధైనా, రచించే ఏవో రాగాలే.
ఈ సమయం ఏ తలపులను తన గురుతుగ విడిచెళుతుందో - ఏ మనసుకి జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో..

వరమనుకో దొరికిన జీవితం.. ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపే దారేది ..
వరించే ప్రతీ క్షణాన్నీ జయించే స్నేహం తోడవనీ..
తన గూటిని వెతికే కళ్లు గమనించవు ఎద లోగిళ్ళు తల వాల్చిన మలి సంజల్లో సెలవడిగెను తొలి సందళ్ళు..

Saturday, February 7, 2009

మిర్చి/వంకాయ కా సాలన్

ఈ బ్లాగర్ HTML తో ఇంకా కుస్తీ పడుతున్నా.. ప్రస్తుతానికి scroll down చేసి చూడండి.



















కావలసిన పదార్థాల పట్టిక
సంఖ్యపదార్థంపరిమాణంకొలత
1దాల్చిన చెక్క6ఒక అంగుళం ముక్కలు
2లవంగాలు6సంఖ్య
3ఏలక్కాయలు4సంఖ్య
4ఉల్లిపాయలు2పెద్దవి
5అల్లం-వెల్లుల్లి ముద్ద3టీ స్పూన్
6కొత్తిమీర¼కట్ట
7పుదీనా12ఆకులు
8వేరుశనగగుడ్లు1గుప్పెడు(ళ్ళు)
9నువ్వులు1 ½టేబుల్ స్పూన్
10ధనియాలు1 ½టేబుల్ స్పూన్
11మెంతులు½టీ స్పూన్
12జీలకర్ర1టీ స్పూన్
13గసగసాలు1 ½టేబుల్ స్పూన్
14ఎండుమిరపకాయలు4సంఖ్య
15కొబ్బరికోరు3టేబుల్ స్పూన్
16టమాటో ముద్ద½డబ్బా
17చింతపండు గుజ్జు1టీ స్పూన్

ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కాగాక మిరపకాయలు/వంకాయలు వేసి, కొద్దిగా ఉప్పు కూడా వేసి మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మెత్తగా కాకుండా మూడు వంతులు ఉడికేక పొయ్య ఆపెయ్యాలి.

ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, కాగాక దాల్చినచెక్క, లవంగాలు, ఏలక్కాయలు వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు వెయ్యాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం-వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదినా కూడా వేసి ఉల్లిపాయలు బాగా వేగేవరకు వేయించాలి.

ఈ క్రింది వస్తువులన్నింటినీ విడివిడిగా నూనె లేకుండా పొడిగా వేయించాలి: మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వేరుశనగ గుడ్లు, గసగసాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరికోరు.

పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించి, చల్లరేక పొడిగా తిప్పాలి. దీనిలో వేయించిన ఉల్లిపాయలు వేసి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి, కొద్దిగా నీరు పోసి ముద్దలా తిప్పుకోవాలి. (బాగా మెత్తగా కాకుండా కొద్దిగా మొరెంగా తిప్పుకోవాలి.)
ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకుని కాగాక, తిప్పుకున్న ముద్ద వేసుకుని కాసేపు వేయించాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ (లేదా టమాటోలను ముద్ద చేసుకుని) కలపాలి. ఇంక కొద్దిగా పుల్లగా ఉండాలి అంటే కొద్దిగా చింతపండు గుజ్జు కలుపుకోవచ్చు. రుచి చూసుకుని కావలిస్తే ఉప్పు, కారం, ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక పది నిముషాలు ఉడికించి, దీనిలో మిరపకాయలు/వంకాయలు చేర్చుకుని తక్కువ మంట మీద బాగా ఉడకనివ్వాలి.
[మిరపకాయలు/వంకాయలు చేర్చుకున్న తరువాత పొయ్య మీద బదులు ఓవెన్ లో కూడా ఉడికించుకోవచ్చు. ఉష్ణోగ్రత 250F - 300F మధ్య పెట్టి నూనె కూర నించి విడివడే వరకు బేక్ చేసుకోవాలి.]

Thursday, January 22, 2009

బొమ్మన చందన..

(ఇది వ్రాసి చాలా రోజులు అయిపొయింది కానీ, అభిప్రాయం మాత్రం మారలేదు).

వీకెండ్ లో బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమా చూసాము. EVV సమర్పించేసుకున్నాడు అని తెలియగానే కొంచెం ఖంగారు పడిన మాట వాస్తవమే కాని, ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ లేకుండా మేమిద్దరమే చూడడం వల్ల ప్రమాదం ఏమి లేదు అని సమాధానపడి కూర్చున్నాము. సినిమాని కొంచెం నెమ్మదిగా మొదలు పెట్టినా, మధ్య మధ్యలో కొంచెం బోర్ కొడుతోందేమో అని అన్పించినా, మొత్తానికి కామెడీతో చాల బాగా నెట్టుకొని వచ్చేసాడు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. అల్లరి నరేష్ శ్రీరామదాసు పేరడీ కొంచెం తగ్గించినా పెద్ద ప్రాబ్లం ఏమి అయి వుండేది కాదు. కొంచెం శ్రుతి మించుతోంది అనిపించగానే అది వదిలేసి కధలోకి వచ్చాడు. కృష్ణ భగవాన్ ఎప్పటిలాగే సంభాషణల రచయిత బలం మీద నెగ్గుకొని వచ్చేసాడు. ఐతే, కొన్ని పంచ్ లు ముందుగా వ్రాస్తారో లేక కృష్ణ భగవాన్ అప్పటికప్పుడు పుట్టిస్తాడో తెలియదు గాని, చెవులు రిక్కించి వింటే తప్ప వినపడని పంచులు చాల వాడేడు సినిమాలో. కోవై సరళ ఓవర్ ఆక్షన్ చెయ్యకుండా భరణి successful గా అడ్డు పడ్డాడు అనే చెప్పాలి. సినిమా చివర్లో మాత్రం ఆవిడ కామెడీ బాగా చేసింది. రెగ్యులర్ కమెడియన్ లు (బ్రహ్మ, సునీల్, MS etc) లు లేకుండా సినిమా మొత్తాన్ని బాగానే నడిపించారు. మామూలు పద్ధతి లో కాకుండా, చేతిని తిరగేసి ఇతరుల చెవుల్లో రహస్యాలు చెప్పే తనికెళ్ళ మేనరిజం బాగుంది. నరేష్ హీరోయిన్ ఫర్హానా కొంచెం బొద్దుగా వున్నా పరవాలేదన్నట్టు వుంటే, కృష్ణ భగవాన్ హీరోయిన్ మాత్రం మరీ అతనికి తగ్గట్టు గానే కొంచెం భారీ గా వుంది. శ్రీలేఖ సంగీతం ఎప్పటిలాగే ఎక్కడో విన్నట్టు వున్నా, ఒక్క పాట మాత్రం మంచి బీట్ తో సాగింది. ఆ పాటలో స్వతహాగా dancer అయిన ఫర్హానా స్టెప్ లు అదరగొట్టి నరేష్ ని తేలిపోయేలా చేసింది.ఎప్పుడూ క్లాసు సినిమాలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ఒకటి రెండు పడుతూ వుంటే, మనలోని "హాస్యపు ఎముక" కి కితకితలు పెట్టడానికి పనికొస్తూ వుంటాయి :)

అన్నీ సరదా పాత్రలే తప్ప, నెగటివ్ పాత్రలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్ గా చెప్పచ్చు.