Monday, August 17, 2009

ఐడియా సూపర్ సింగర్ కాలక్షేపం

మామూలుగా మనం "కాలక్షేపం" అంటే, పాజిటివ్ అర్ధంలో వాడుతూఉంటాము. "పురాణ కాలక్షేపం" అనో, "బాగా కాలక్షేపం అయింది" అనో, "ఏదో అలా కాలక్షేపం అయిపోతోంది" అన్నట్టు.. ఐతే, ఈ కాలక్షేపం మాత్రం తప్పకుండ నేగటివ్ అర్ధంలోనే (అందులో నాకు ఏమాత్రం అస్పష్టత లేదు). ఇంచుమించు ఆరునెలల నుంచి సాగదీస్తున్నారు. మొదటినుంచీ, దీనికి ఏదో "రియల్" రియాల్టీ షో అన్నట్టు రంగు అద్దాలని ప్రయత్నాలు జరిగాయి. (గాయకులు ఇతర గాయకులని, జడ్జిలని ఛాలెంజ్ చెయ్యడం - అలాంటి "పెట్టుడు" నాటకీయతతో). కొంతవరకు పరవాలేదు. సుమ చాలా రోజులు తన క్రియేటివిటీ తో నెట్టుకొనివచ్చింది ఆంఖర్ గా.. అయితే ఇప్పుడు ఆవిడ అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలూ వాడబడి, ఇంకా ఏమి మిగిలినట్టు కనిపించడంలేదు. (ఆవిడ తప్పులేదు.. వారానికి కనీసం నాలుగు గంటలు అదే ప్రజలతో, అదే ప్రోగ్రాం చేస్తూ ఉంటే ఎవరి సృజనాత్మకత ఐనా సరే హరించుకుపోతుంది). ప్రతీ పాట తరవాత, "అద్భుతం", "ఆహా", "ఓహో" అని నచ్చినా నచ్చకపోయినా పొగడడం, గాయకులని ఏదో విధం గా మెచ్చుకోడానికి ప్రయత్నించడం తప్పకుండా చెయ్యమని ఆవిడకి ఆదేశాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు :).

మొదట్లో ప్రిలిమినరీ రౌండ్స్ అన్నారు. తరవాత క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ (మూడు టీంస్ తో అసలు ఇవి అన్నీ కూడా ఎలా సాధ్యమో ఆ దేముడికే "ఐడియా" ఉండి ఉండదు - సరి సంఖ్యలో టీం లు ఉన్నప్పుడే ఇవి వస్తాయి - లేకపోతె నాక్ అవుట్ మాత్రమే సాధ్యం), ఇప్పుడు ఫైనల్స్ ముందు పెద్ద సాగదీత. అప్పుడు కూడా, ఏ టీం ఎన్ని పాయింట్స్ సంపాదించిందో చెప్పడానికి "టోటల్ పాయింట్స్" ని సూచికగా వాడుకోవడం ప్రాధమిక లెక్కల జ్ఞానం ఉన్న ఎవరికీ ఐనా మింగుడు పడదు. ఉదాహరణకి: ఒక టీం నాలుగు పాటలు పాడి, ప్రతీ పాటకి పాతిక మార్కులు సంపాదించారు అనుకుందాం. వాళ్ళ మొత్తం వంద. ఇంకో టీం ఐదు పాటలు పాడి ప్రతీ పాటకి ఇరవై రెండు సంపాదించారు అనుకుందాము - వాళ్ళ మొత్తం నూట పది. అప్పుడు సూపర్ సింగెర్ లో announcement ఎలా ఉంటుంది అంటే, "టీం బీ నూట పది మార్కులతో ప్రధమ స్థానంలో ఉన్నారు - టీం ఏ వంద మార్కులతో ద్వితీయస్థానం" అని చెబుతారు. అక్కడ "average" మార్కులు ఎన్నో చెప్పడం అనేది వాళ్ళ స్థానాలకి సూచిక అని ఐదవ తరగతి చదువుకునే పిల్ల వాడు కూడా చెబుతాడు.

ఇక మొన్న మొన్నే ప్రతీ టీం నుండీ ఒక్కోకర్ని ఎలిమినేట్ చేసారు. ఐతే, చోట challengers నుంచి జయంత్ మాధుర్ ఎలిమినేట్ అవడంతో, అతడిని మళ్ళీ తీసుకొని రావడానికి (ratings కోసం కావచ్చు) మళ్ళీ రీ-ఎంట్రీ డ్రామా నడుస్తోంది ప్రస్తుతం. ఇది ఎప్పటికో అవుతుంది.. ఈ లోగా, Lux వాడు మధ్యలో దూరేడు. నిన్న ప్రోగ్రాం లో శ్రియని చూసి అదిరి పడ్డాము. అసలు శ్రియకి అంత ఉందా? ఆవిడకి ఒక ముక్క తెలుగు రాదు - వీళ్ళు పాడుతున్నది ఒక్కటి అర్ధం అవదు - చంద్రబోస్ గారి మాటలు ఐతే ఒక్క ముక్క కూడా అర్ధం అవదని ఘంటాపధంగా చెప్పగలను ("తెలుగు తన మాతృభాష కాదు" అని అభిమానులు అడ్డం పడచ్చు - కానీ, ఎప్పటినుంచో తెలుగులో నటిస్తూ, నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించకుండా ఉండే వాళ్ళని ఏమనాలో తెలియదు - లేకపొతే, ఒకప్పటి హైదరాబాద్ ఆటో డ్రైవర్స్ లాగ, తెలుగు వచ్చినా మాట్లాడట్లేదు అంటే, అది ఇంకా పెద్ద పాపం :) ). ఈ వారం శ్రియ, వచ్చే వారం ఇంకొకరు, పై వారం వేరొకరు ఇలా కొన్నాళ్ళు సాగుతుందేమో అనిపిస్తోంది నాకు.. ఈ లోగా, ఇక్కడ టూముచ్ లాగుడు అయిపోయి, చంద్రబోస్, అశోక్ తేజ గార్లకి పాటలు రాసే తీరిక, ఓపిక నశించి ఏమి అనర్ధాలు వస్తాయో అని ఇంకో భయం.


ఈ ప్రోగ్రాం లో ఉన్న challengers లో పిల్లలకి ఎంత బోర్ కొట్టిందో ఈ క్రింద వీడియో చూస్తే మీకే తెలుస్తుంది (మనో మాట్లాడుతుంటే, అతని ఎడమ చేతి వెనకాల అలేఖ్య చేస్తున్న పని, ఈ ప్రోగ్రాం ఎప్పుడు అవుతుందిరా బాబూ అనుకుంటూ సుమశ్రీ తలమీద సుగంధిని వాయిద్యం కూడా చూడండి). మన సొంత ఇల్లు కాబట్టి గోడ గోకేసి మన చికాకుని దాని మీద చూపించలేము కానీ, ఈ ప్రోగ్రాం తొందరగా ఒక కొలిక్కి వస్తే సంతోషించే వాళ్ళలో నేను మొదటి వాడిని.

1 comment:

గీతాచార్య said...

Hahaha very well said. :-) The pic is very apt. 'Super' singer