మనలో చాలా మందికి చిన్నప్పటి ఫోటోలలో ఒకటి కామన్ గా ఉంటుంది. అది - అబ్బాయైనా, అమ్మాయైనా, పాలుగారే పసిమోము మీద కనుబొమ్మల మధ్యలో పెట్టే నల్లటి అగులుచుక్క. దానిని మరి అందరూ అగులు అంటారో లేదో తెలియదు కాని, తూ గో లో మాత్రం అంటారని తెలుసు. పేరు ఏదైనా, అందాలొలికే ముద్దుల పాప మీద నుంచి దృష్టి మరల్చడానికి కొందరు, అలంకారం కింద కొందరూ, రెంటికిందా మరి కొందరు పిల్లలకి చుక్కపెడతారు. ఇప్పుడు కొంతమంది దానిమీద (చర్మానికి పడదు అనే) సందేహంతోనో, అగులు దొరక్కో, అది చెయ్యడం తెలియకో బొట్టుబిళ్ళలు, తిలకం వంటివి పెడుతున్నారు. సహజసిద్ధంగా తయారుచేసే అగులు చేసే హాని ఏమీ లేకపోగా, ఈ కెమికల్స్ తో చేసిన జిగుర్లు, తిలకాలు చర్మానికి చేటుచేస్తాయి. అందుకని అగులు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాము.
కావలసిన వస్తువులు: సగ్గుబియ్యం, మూకుడు (స్టైల్ గా "బాండీ"), అగ్గిపెట్టె, నీళ్ళు, టీ వడకొట్టుకునే చిక్కం (మెత్తటి (ఫైన్) జల్లెడ కూడా వాడవచ్చు).
ముందుగా కొంచెం సగ్గుబియ్యం తీసుకొని, దానిని మూకుట్లో వేసి, చిన్న సెగమీద కలుపుతూ వేయించాలి. అది నల్లగా అయే వరకూ వేయించి, మూకుడుకి అంటుకుపోతుంది అనిపించే ముందు పొయ్యిమీదనుంచి దించాలి. ఆ తరువాత దానిని ఒక అగ్గిపుల్లతో వెలిగించి మండనివ్వాలి. పూర్తిగా మండితే బూడిద అయిపోయి ఏమీ మిగలదు కాబట్టి, బొగ్గులా మారిన తరువాత మంటని ఆర్పెయ్యాలి. ఇప్పుడు దానిలో కొంచెం (తగినన్ని) నీళ్ళుపోసి, చేతితో నలపాలి. అలా వచ్చిన నల్లని ద్రావణాన్ని చిక్కం/జల్లెడ లోంచి పోసి, వడగట్టాలి. మూకుడు లో మిగిలిపోయిన బొగ్గు ముక్కలు, నీరు పారబోసి, మూకుడు తొలిచి రెడీ గా పెట్టుకోవాలి. వడగట్టినప్పుడు కిందకి చాలా మెత్తటి సగ్గుబియ్యంబొగ్గుపొడితో కలిసిన నీళ్ళు దిగుతాయి. అలా వచ్చిన నల్లటి నీళ్ళని, ఖాళీ చేసిన మూకుట్లోకి మార్చి, మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. కొంచెం ఉడుకు పట్టాక నీళ్ళు ఆవిరి అవుతూ ఉంటాయి. ఐతే, నీళ్ళు పూర్తిగా ఆవిరి అయిపోతే, ఈ మిశ్రమం మూకుడికి అంటుకొనిపోతుంది. అందువల్ల, కొంచెం నీళ్ళుగా (పల్చగా) ఉండగానే, దానిని తీసి వేరే పాత్ర/డబ్బాలోకి మార్చుకోవాలి. మరి దీనిలో నీళ్ళు మిగిలిపోయాయి కాబట్టి వాటిని కూడా ఆవిరి చేస్తే, అగులు అటూ ఇటూ ఒలికిపోకుండా దాచుకోవడానికి బాగుంటుంది. దానికోసం, ఆ ద్రావణాన్ని ఎండలోపెట్టి మరింత నీటిని ఆవిరి అయ్యేలా చెయ్యాలి. ఆ క్రమం లో అగులు గట్టి పడుతుంది కూడా. అలా తయారైన అగులుని ఎంతకాలం అయినా దాచుకోవచ్చు.
అది వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ అగులు ముద్ద మీద ఒకటి రెండు చుక్కలు నీరు పోసి చూపుడు వేలితో రాస్తే తిలకం లాగ వేలికి వస్తుంది. దానిని మీ బంగారు తల్లి బజ్జున్నప్పుడు మెల్లిగా, తెలియకుండా, నుదుటి మీద, బుగ్గ మీద అలంకరిస్తే చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఒకటి రెండు నిముషాల్లో ఆరిపోతుంది. స్నానం చేయించినప్పుడు కొంచెం తడి చెయ్యి చేసుకొని నుదుటి మీద వేలితో మెత్తగా అద్దితే అది కరిగిపోయి చక్కగా ఊడి వచ్చేస్తుంది.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago