చూసే వుంటారు "మా" లో సుహాసిని నడిపిస్తున్న బొమ్మరిల్లు వస్తోంది కదా. నాకు ఎందుకో సుహాసిని వి ఈ మధ్య సినిమాలు చూసి ఆవిడ అంటే కొంచెం భయం కలిగిన మాట వాస్తవం ("నువ్వు నాకు నచ్చావు" లో బరువు డైలాగులు, "రాఖీ" (ఇది చూడలేదులెండి కానీ, చూసిన యాడ్లే చాలు) లో కొంచెం ఓవర్ గా కన్పించే నటన చూసి). కానీ, ఈ షో చూసాక, నాకు అలా అనిపించడానికి ఆయా సినిమాలలో ఆవిడ పాత్రల్ని దిద్దిన డైరెక్టర్లు, మాటలు వ్రాసిన రచయితలూ కారణం అని అనిపించింది. రూల్స్ మరీ "ఎవరికీ మేము ఏమీ ఇవ్వం" టైపులో వున్నా, ఈ ప్రోగ్రాం జనరల్ నాలెడ్జ్ వరకు ఐతే పరవాలేదు. సుహాసిని కూడా "ప్రశ్న అడిగామా, ఆన్సర్ చెప్పారా" అన్నట్టు కాకుండా, వీలు ఐన చోట్ల సమాచారం ఇస్తూ, కబుర్లు చెబుతూ బాగానే నడిపిస్తోంది అనే అనిపించింది.
కానీ, నాకు ఈ ప్రోగ్రాం లో చిర్రెత్తుకొని వచ్చే అంశం ఒకటి వుందండోయ్. అదే "మన" వాళ్ల ఆంగ్ల భాషా దుర్వినియోగం (అంటే, అవసరం అయిన దానికంటే, చాల ఎక్కువగా మాట్లాడడం). ఏదో కొంచెం ఇస్త్రి చేసిన షర్టు వేసుకొని కాస్త ప్యాంటు, బూట్ వేసుకొని, మరకలు లేని కళ్ళజోడు మొహానికి తగిలించుకోగానే, ఎక్కడినుంచో దిగివచ్చినట్టు, తెలుగంటే ఏమిటో తెలియనట్టు, "this", "this" అనుకుంటూ వచ్చీరాని (అన్నీ గ్రామర్ తప్పులే మళ్ళీ) ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించడం. ఇందులో మగ/ఆడ అని లేదు. అందరికీ ఇదే జబ్బు. మళ్ళీ తమ టీం మేట్స్ తో గొణగడానికి మాత్రం తెలుగు పనికివస్తుంది "ఆన్సర్ అదే అంటావా" అనో, "ఇది చెప్పేద్దాం" అనో కూసే కూతలు మాత్రం మైక్ లో గుస గుసగా వినిపిస్తూనే వుంటాయి. నాకు అన్నింటికంటే అసహ్యం కలిగించే సందర్భం మాత్రం సుహాసిని ఏదైనా అడిగినప్పుడు వీళ్ళ ప్రవర్తన!. ఆవిడ ఆంధ్ర లో పుట్టకపోయినా, తెలుగు మాతృభాష కాకపోయినా, తెలుగు ప్రోగ్రాం అనే స్పృహ తో ఏది మాట్లాడినా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దానికి కూడా ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవాడిని ఆంధ్ర లోంచి వెళ్ళగొట్టి సముద్రంలో పారెయ్యాలి - అప్పుడైనా "అమ్మా" అని తెలుగులో అరుస్తాడో లేదో చూడాలి. అది నాకు నిజంగా కంపరం కలిగిస్తుంది. తల్లి తన హోదాకు తగ్గట్టు లేదని ఆమెను పనిమనిషిగా పరిచయం చేసిన పాపాత్ముల కధలు వింటుంటాము. వాళ్ళకి వీళ్ళు ఏమాత్రం తీసిపోరు. ఇటువంటి ఘనులని చూసి వాళ్ళ పిల్లలు ఏమి నేర్చుకుంటారో గ్రహించడం పెద్ద కష్టం ఏమీ కాదు.
ఇది వ్రాసి కొద్ది రోజులయింది.. ఈలోగా, ఒక రోజు బొమ్మరిల్లులో వరుణ్ సందేశ్ (హ్యాపీ డేస్ చందు) వచ్చాడు శేఖర్ కమ్ములతో. అదే రోజో, ఆ ముందు రోజో, ఏదో సుత్తి ఇంటర్వ్యూ కోసం రాహుల్ (హ్యాపీ డేస్ టైసన్) కూడా (రైన్బో సినిమా కోసం). వరుణ్, తను పుట్టిన నాలుగేళ్ల తరవాత అమెరికా వెళ్లి మళ్ళీ హ్యాపీ డేస్ కోసం ఇండియా వచ్చాడుట (మధ్యలో వస్తూ పోతూ వున్నా, ఎక్కువ కాలం వున్నది హ్యాపీ డేస్ కే). బొమ్మరిల్లులో శేఖర్ ఐనా తెలుగు మాట్లాడడానికి తడుముకున్నాడేమో తెలియదు గానీ, వరుణ్ మాత్రం చక్కని తెలుగు మాట్లాడేడు. ఇంకోపక్క రాహుల్ మాత్రం మొత్తం ఇంటర్వ్యూ అంతా ఇంటర్వ్యూ చేసే అమ్మాయి తెలుగులో ఎన్ని అడిగినా, ప్రతీ దానికి వచ్చీ రాని ఇంగ్లీష్ తప్ప తెలుగు ముక్క బయటపడనివ్వలేదు. ఎంత తేడా?
ఒక యోగి జీవన గాథ
4 days ago
3 comments:
మరందుకే నాకు అమితాబ్ బచ్చన్ అంటే పరమ ఇష్టం. ఆయన ఇంగ్లీషు లో మాటాడితే హిందీ పదం ఒక్కటి కలపడు. హిందీ లో మాట్లాడితే ఒక్క ఇంగ్లీషు మాట పడదు. అంత మంచి వక్త (వక్తే మరి. తొణక్కుండా బెణక్కుండా.. మాట్లాడితే ఎవరైనా వక్తే!) శుద్ధ్ హిందీలోనో, ప్యూర్ ఇంగ్లీష్ లోనో చెక్కగా మాట్లాడుతుంటే, వినేవాడికి ముచ్చట వేస్తుంది మరి.
మాట్లాడటం ఒక మంచి కళ. భాషా జ్ఞానం మంచిదే. మొన్నీ మధ్యే, ఈ టీవీ ఒక కుకరీ షో లో బంగళదుంపలు మళ్ళీ 'స్మాష్ ' అయిపోతే మీరే గుర్తొచ్చేరు.
నాకు ఈ తెలుగు నాట నచ్చనిది అదే. ఎందుకు ఇంగ్లీష్ మాటాదతారో తెలియదు. పోనీ మాటాడితే శుభ్రంగా అయినా మాటాడరు. ఇండియన్ ఇంగ్లీష్ అంటూ ఒకటి ఉంటే, అందులో ఆంధ్రా ఇంగ్లీష్ ఇంకోటి తయారు. మన స్కూళ్ళు కూడా అలానే ఏడిచేయి అనుకుంటాను. మీ బాధ అర్ధం చేసుకోగలను ! నేనూ బాధితురాలినే గాబట్టి.
మీ ఆక్రోశం అర్థం చేసుకోదగ్గదే!
సుహాసిని ఆ మధ్య ఎక్కడో చెప్పగా చదివాను కూడా.. 'తెలుగువాళ్ళు తెలుగు మాట్లాడేటపుడు ఇంగ్లీషు ఎక్కువగా కలుపుతారు, అది నాకు నచ్చదు' అని. సరిగ్గా ఇవే మాటలుకాదుగాని, ఇలాంటివే!
మన తెలుగువాళ్ళలో కొన్ని ఇంగ్లీషుముక్కలు కలిపి మాట్లాడితేగాని "ఎడ్యుకేటడ్" అనుకోరని ఒక నమ్మకం. ఇదిలా కొనసాగాల్సిందే.ప్రస్తుతానికి మార్పు అసాధ్యం.
Post a Comment