6:21 కారు అంటే ఇదేదో ఫస్ట్ బస్సు టైం కాదు (మా నాయనమ్మ గారు బస్సు ని "కార్" అనేవారు - ఆ కాలం నాటి చాలామంది లాగే). మేము ఉన్న కమ్యూనిటీ లో ఒక పొరుగాయన ఉన్నాడు. వాన రానీ, మంచు పడనీ, కొంపలు మునిగిపోనీ - వీకెండ్ ఐతే తప్ప, ప్రతీ రోజూ పొద్దున్న ఆరుగంటల ఇరవై ఒక్క నిముషం అయ్యేసరికి కార్ స్టార్ట్ చేసి, గరాజ్ లోంచి బయటకి తీస్తాడు (6:21 ఏమిటో పెళ్లి ముహూర్తం లాగ అనిపిస్తుంది నాకు - అలా అనుకుందాము అంటే, ఇండియా వాడు కూడా కాదు). ఆ కార్ స్టార్ట్ చేసింది మొదలు, మఫ్లర్ (మనం సైలెన్సర్ అంటాము కదా - అదేలెండి - పొగ గొట్టం) చిల్లులతో జల్లెడ అయిపోయినట్టు ఉంది - గుర్రు మంటూ మంచి కోపం మీద ఉన్న కుక్కలాగా శబ్దం చేస్తూ ఉంటుంది. మనం ఇంట్లో ఎక్కడ ఉన్నా, అన్ని తలుపులూ, కిటికీ లు వేసి ఉన్నా సరే అది వినిపిస్తుంది. అది వినిపిస్తే 6:21 అయినట్టు లెక్క - 6:21 అయితే అది వినిపించాలని లెక్క. నేను కొన్ని ఏళ్ళ నుంచి 6:15 కి లేచి ఆఫీసు కి ఎనిమిదింటికల్లా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను కదా ("ఇదెప్పుడు చెప్పావు" అంటారా? ఇప్పుడే). అందుకని 6:21 కి పక్క మీద దొర్లుతూ "ఆ 8 కి ఆఫీసు కి వెళ్ళే పని రేపటినుంచి మొదలు పెడదాము" అనుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడు ఈ శబ్దం వినిపించేసరికి సిగ్గు వేసి మొత్తానికి లేచాము అనిపిస్తాను.
ఐతే ఉన్నట్టుండి, నిన్న ఈ శబ్దం ఆగిపోయింది! (నేను తొందరగా లేచా లెండి). "అరె.. ఏమయింది పాపం? ఒంట్లో బాగోలేదా? సైలెంట్ గా ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడా? కార్ ఎవరైనా కొట్టేసారా? లేక గరాజ్ డోర్ రావట్లేదా? లేదా నా చెవులు గాని సమ్మె చేస్తున్నాయా" అనే అనేక సందేహాలు ముప్పిరి గొంటూ ఉండగా - కిటికీ లోంచి చూద్దును కదా - ఆ కార్ ఎప్పటి లాగే మెయిన్ రోడ్ దిశగా వెళ్ళిపోతోంది.. అప్పుడు తట్టింది - మొత్తానికి మా గురుడు మఫ్లర్ బాగుచేయించాడు అని. ఏ మాటకి ఆ మాటే. వీళ్ళ సమయ పాలన మన వల్ల కాదనిపిస్తుంది. 6:21 కి ఈయన బయల్దేరుతాడా? 6:50 కి ఒక స్కూల్ బస్సు వస్తుంది. 8:29 కి ఇంకోటి. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి ఆ బస్సులు రెండూ గంట కొట్టినట్టు ఒకే సమయానికి పిల్లల్ని తీసుకొచ్చి దించేస్తాయి. మరింక పిల్లలకి ఆ వయసులో ఇలాంటి సమయ క్రమశిక్షణ నేర్పేస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా జీవితాంతం ఏ 6:21 కో, 7:18 కో ఆఫీసు లకి వెళ్ళడం అలవాటు చేసుకొని, వాళ్ళ పిల్లలు 8:29 బస్సు...... అలా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట.
పిల్లలకి ఏమి నేర్పాలో అర్ధం అయింది కదా??.
1 comment:
రామ గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు
హారం
Post a Comment