ఎప్పటినుంచో అనుకుంటున్న ఇలాంటిది ఏదో ఎక్కడో వుండాలి అని (మా పిల్లవాడు పుట్టిన మొదట్లో నేనే ఒక సైట్ పెట్టేద్దామా అని కూడా అనుకున్నా). ప్రపంచం లో ఫ్యాషన్ ల కంటే తొందరగా మారిపోయే వస్తువులు ఏమైనా వున్నాయి అంటే అవి తప్పకుండ పిల్లల బొమ్మలే. అప్పుడే పుట్టిన పిల్లలకి బొమ్మలు వేరు, నెల వయసు వారి బొమ్మలు వేరు, కొద్దిగా ఎదిగి రంగులు, జంతువులు గుర్తు పట్టే వయసు వచ్చే వారి బొమ్మలు వేరే, ఆడపిల్లల బొమ్మలు వేరు, మగ పిల్లల బొమ్మలు వేరు. పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోయే లక్షణం కలవారు అవటం వల్ల, ఇవాళ కొన్న బొమ్మలు నెల రోజుల్లో (రంగు, షైనింగు చెడకుండానే) పాతబడిపోయి మళ్ళీ బొమ్మల దుకాణానికి వెళ్ళే పని పెడతాయి. అలా ప్రతీ తల్లితండ్రులు పదుల కొద్దీ (కొండొకచో వందల కొద్దీ) బొమ్మలు కొని ఇల్లు నింపుతూ వుంటారు. జ్ఞాపకాలు గా దాచుకుందామన్నా, కొద్ది రోజులు పోయేసరికి అవి కాలికి అడ్డం గాను, జేబుకి చిల్లు పెట్టిన శత్రువులు గాను కనిపించడం మొదలు పెట్టి వాటిని నెమ్మదిగా బయటకి తరలించడమో, లేక రీసైకిల్ వారికి ఇచ్చేయ్యడమో జరుగుతుంది.
ఎవరికైనా ఇద్దామన్నా, వాళ్ళు వాడేసిన బొమ్మలు ఇస్తున్నారు అనుకుంటారు, "మా పిల్లలకి మేము కొనలేమా" అని అహంకారానికి పోయి మొహం మీదే వద్దంటారు అని ఒక అనుమానం. తల్లితండ్రులకేమో ఎవరినన్నా, "మీ పిల్లల బొమ్మలు వున్నాయా - మేము తీసుకుంటాము" అనాలి అంటే "లేకి" గా అడుగుతున్నారు అనుకుంటారు అని భయం. అందుకని ఇరు పక్షాలు అలా బిగిసి పోయి, బొమ్మల కొట్ల వాళ్ళకి డబ్బులు ధారాళం గా పోస్తూ వుంటారు (మీరు కాదనలేరు - ఎందుకంటే, ఇది అంతా స్వానుభావమే (పిల్లలు వున్న వారు) అందరికీ). ఈ వస్తువులన్నీ వాటి కాలం మూడే వరకు బేస్మెంట్ లలో, క్లోసేట్ లలో, అటకల మీద దుమ్ము తింటూ బ్రతుకుతూ వుంటాయి.మన పిల్లలు మనకి ఎంత అపురూపం ఐన ప్రాక్టికల్ గా ఆలోచిస్తే శుభ్రం గా వాడేరు అని తెలిసిన బొమ్మలు మన పిల్లలకి ఇవ్వడం లో అభ్యంతరం ఏముంది? ఎక్కడైనా అవి పిల్లలు వాడినవే కదా? అంతగా కావలిస్తే వాటిని శుద్ధి (శుభ్రం) చేసే పద్ధతులు బోలెడన్ని వున్నాయి. ఈ మధ్య పుట్టిన కొత్త వాదం ఏమిటంటే, బొమ్మలు రీసైకిల్ చెయ్యడం ద్వారా (తద్వారా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ద్వారా) హరిత భూమి (గ్రీన్ ప్లానెట్) కి మన చేయూత ఇచ్చినట్టు అవుతుంది అని. నిజమే మరి.
ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ రోజు ఈ సైట్ చూసాను: www.zwaggle.com. దీనిలో మన పిల్లల బొమ్మలు మరొకరికి ఇవ్వడం, మరొకరివి మనం తీసుకోవడం చెయ్యవచ్చు. బార్టర్ సిస్టమ్ లాగ అన్నమాట. ఐతే అప్పుడే పుట్టిన పిల్లలు మనకి వుంటే మనం వేరొకరికి ఇవ్వడానికి మన దగ్గర ఎక్కువ వుండకపోవచ్చు. కాకపోతే మన దగ్గర బొమ్మలు చేరేకొద్దీ దీనిని ఉపయోగించుకొని అన్ని వర్గాలు లబ్ది పొందొచ్చు. బొమ్మలే కాదు, అనేక ఇతర వస్తువులు దీనిలో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి మన దేశం లో కూడా అవసరం!. ఇంటర్నెట్ ద్వారానే అక్కర్లేదు. మీ దగ్గర మీ పిల్లలు ఆడుకున్న బొమ్మలు, వాడిన వాకర్ లు, ఇప్పుడు వాడలేని సైకిళ్ళు, ఏమైనా వుంటే అవి మీకు తెలిసిన వారికి ఆఫర్ చెయ్యండి. పిల్లలు కూడా తమ బొమ్మలు మరొకరు ఆడుకోవడం చూసి షేర్ చేసుకోవాలి అనే గుణం చిన్నప్పటినుంచే అలవాటు చేసుకుంటారు. మనం గమనించినా, నిన్చకపోయినా పిల్లలు మనం చేసే ప్రతీ పని ని నిశితం గా పరిశీలిస్తూ, ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళలో అటువంటి మంచి లక్షణాలు పాదుకొల్పడానికి ఇది కూడా ఒక అవకాశం గా పనికి వస్తుంది. ఎటు నుంచి చూసిన, మినిముం మన ఇంట్లో కాళ్ళకి అడ్డం పడే "పనికిరాని" వస్తువులు తగ్గుతాయి :).
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago
4 comments:
మంచి పద్ధతే...
మీరే మొదలెట్టండి మరి.
ఇది చాలా మంచి అలోచన. నేను స్వాగతిస్తున్నాను. నా ఏడాదిన్నర కొడుక్కి ఇప్పుడు బొమ్మల అవసరం చాలా ఉంది. నాకు ఇది స్వానుభవమే.
శ్రీనివాసకుమార్
మంచి ఆలోచన.
ప్రవీణ్ గారు.. తప్పకుండా!. నేను ఈ పద్ధతి అవలంబించబోతున్నానని ఈ టపా ద్వారా చెప్పకనే చెప్పాను :).
Post a Comment