Sunday, March 30, 2008

మేము పోటీ లో లేము!.

మా టీవీ సినిమా అవార్డ్స్ ప్రోగ్రాం చూసి, అనురూప్ గారి బ్లాగ్ చదివిన తరవాత ఇది రాయాలనిపించింది. ఎన్టీఆర్ చేసిన పని కొంచెం అనాలోచితం గా అనిపించినా, ముందు అసలు చిరంజీవి, నాగార్జున లు "మేము మా టీవీ యాజమాన్యం లో వుండడం వల్ల మా సినిమా లను పోటీలో వుంచవద్దని నిర్ణయించుకున్నాము" అని చెప్పడం ఎంత వరకు సమంజసమో చూడాలి. ఇదేమైనా పట్టు చీరాల షో రూం లో సంక్రాంతి బంపర్ ప్రైజ్ మారుతి కార్ గురించో, ఒక లక్ష రూపాయల నగదు గురించో అయితే "ఈ షాప్ లో పని చేసే వాళ్ళు పోటీ కి అనర్హులు" అని చెబుతారు. ఐతే ఈ అవార్డు లు నిజం గా ప్రజలు వోట్ చెయ్యడం వల్ల ఇచ్చేవే అయితే ఇంక సమస్య ఏమి వుంది? అంతగా కావలిస్తే ఏ సినిమా/హీరో కి ఎన్ని వోట్లు వచ్చాయో ప్రకటిస్తే పోయేది!. అన్ని సినిమా లు పోటీ లో వుంటే, ఇచ్చే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి ఆ "తుత్తి" దక్కి వుండేది :).

ఇది చదివినందుకు బోనస్: హేమంత్ (మా టీవీ లో భలే ఛాన్స్ నుంచి) షో లోని ఒక పోటీదారు తో "చూడమ్మ.. ఇప్పుడు ఇదే పాటని, మన దగ్గర బనీను లాంటి పొడుగు షర్టు లు వేసుకొని, మెళ్ళో కుక్క గొలుసులు కట్టుకొని వుంటారు చూడు, వాళ్ళ లాగ - rap స్టైల్ లో పాడాలి". Very funny :).

Saturday, March 29, 2008

వ్యాయామ కండూతి

కండూతి అనే మాట ఈ వ్యవహారం లో వాడొచ్చో లేదో తెలియదు గాని, జంధ్యాల చెప్పినట్టు "మాట బాగుంది అని వాడేసాను". చాల ఆశ్చర్యం అనిపిస్తుంది. మా శ్రీహర్ష గాడు పుట్టి నాలుగు నెలలయింది. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, తిక్క వచ్చినా, తోచకపోయిన సరే, అప్రతిహతం గా కాళ్ళు, చేతులు అలా కొట్టేసుకుంటూనే వుంటాడు. చూడబోతే దేముడు మన శరీరం లో వ్యాయామానికి కావాల్సిన instinct అంతా program చేసి పంపిస్తాడు కామోసు. అందుకే (వీడే కాదు.. అందరు) పిల్లలూ ఇలా వీర లెవెల్లో కాళ్ళు చేతులు వూపేస్తూ మొత్తం శరీరాన్ని వ్యాయామం చేయిస్తూ వుంటారు :). కాలం గడిచే కొద్దీ (అంటే exercise అవసరం అయ్యే కొద్దీ) మనకి ఇహ లోక వ్యవహారాలు ఎక్కువ అయి, వ్యాయామానికి తిలోదకాలు ఇచ్చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాము అనిపిస్తుంది.

Friday, March 14, 2008

బాలమిత్ర - చందమామ

ఇప్పటికీ వస్తున్నాయి అనుకుంటున్నా. చందమామ గురించి ఈనాడు లో చదివినట్టు గుర్తు. ఏది అయితేనేం? చిన్నప్పుడు ఈ రెండింటితో బాటు, బొమ్మరిల్లు, బాలజ్యోతి (అనే అనుకుంటున్నా.. ఎవరికైనా తెలిస్తే కరెక్టు చెయ్యండి) కూడా భారీ గానే చదివేవాళ్ళం. ఐతే, మొదటి రెండూ కొనుక్కుని ఇంట్లో చదివితే, చివరి రెండూ లైబ్రరీ లో అన్నమాట. అసలు రెండు పత్రికలూ కొనడం గురించి కూడా ఒక చిన్న విశేషం వుంది. మేము ఇద్దరం - అన్నయ్య, నేను. చిన్నప్పటినుంచీ మా నాన్న గారు మా ఇంట్లో ముష్టి యుద్ధాలు, రక్తపాతాలు, వీర బాదుడులు లేకుండా ఏది కొన్నా రెండు కొంటుండేవారు. మరి నెలకి రెండు చందమామలు అనవసరం కదా (ఆ విషయం మేము 1, 2 వ తరగతుల్లోనే కనిపెట్టేసి ఒప్పేసుకున్నాము), పోనీ అది ఏమైనా దిన పత్రిక లాగ వుంటే, మధ్య పేపర్ ఒకళ్ళు, కవర్ పేపర్ ఒకళ్ళు చదివేసుకోవచ్చు. అది పుస్తకమాయే!! - అందుకని తెలివిగా, డబుల్ డోస్ లాగ నెలకి రెండు కొనేవాళ్ళు అన్నమాట.. అది కూడా ఒక నెల చందమామ ముందు వచ్చేసి, బాలమిత్ర రాలేదు అనుకోండి.. రెండూ వచ్చే వరకూ, రిస్క్ తీసుకోకుండా, వెయిట్ చేస్తాము అన్నమాట రెండోది వచ్చే వరకు. లేకపొతే వ్యవహారం మొత్తానికి చెడుతుంది అని. సరే.. మొత్తానికి ఒక ఆ పుస్తకం, ఒక ఈ పుస్తకం ఇంటికి వచ్చేశాయండీ.. మరి ఏది ఎవరు చదవాలి? దేముడు ఈ ప్రాబ్లం చాల ఈజీ గా పరిష్కరించేసాడు. నేను ఇంటికి రాగానే నెమ్మదిగా టైం తీసుకొని, కుదుట పడి, అప్పుడు దాని పని పట్టడానికి ఉపక్రమించేవాడిని. ఐతే మా అన్నగారు మరిలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోకుండా, ఇంటికి రాగానే కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా (ఈ టపా వాడు చూసాడో నేను చచ్చానన్నమాటే), మంచం మీద అడ్డం గా పడిపోయి, వాడికి కావాల్సిన పుస్తకం తీసి చదివేసుకునేవాడు. ప్రతీ నెల నేను కూడా ఈ విషయం ఏదో చూడాలి అని ఎంత తీవ్రం గా ఒట్టు పెట్టుకున్నా, తరవాతి నెలకి మళ్ళీ మరిచిపోతుంఢేవాడిని. ఈ లోగా నేను నాకు వారిచే కేటాయించబడిన పుస్తకం చదివేసెయ్యడం, కొన్ని సార్లూ ఆ పుస్తకం మన అతి వేగం వల్ల మొదటి పుస్తకం కంటే ముందే ఫినిష్ అయిపోవడం తో, అన్నయ్య వెనక్కతలే చేరి "నేనూ చదూతా" అనడం.. వాడికి చిర్రేత్తి మనల్ని తిట్టడం, కొట్టడానికి ప్రయత్నించడం, ఇంక చూసుకోండి.. "వచ్చే నెల నుంచి వీళ్ళకి కనీసం మూడు పుస్తకాలూ కొని పడెయ్యాలి" అని మా నాన్న గారు బోల్డు సార్లు తప్పక ప్రతిజ్ఞ చేసుకొని వుంటారు!! :). ఎప్పుడూ ఆయన అలా చెయ్యలేదు గాని, చేసినా మనం ఏదో ఒక వంకన యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమే కదా!.

Wednesday, March 12, 2008

మంచు తుఫాను - మనకి పాఠం

కిందటి వీకెండ్ (ఇంచుమించు శుక్ర వారం సాయంత్రం మొదలుకొని ఆదివారం వరకు) కొందరికి ఒక రోజు అటూ, కొందరికి ఒక రోజు ఇటూ గా, ఒహాయో రాష్ట్రం మొత్తం అంతా స్నో తో నిండిపోయింది (మిగిలినవి కూడా నిండే వుంటాయి గాని, నాకు ఇదమిత్థం (ఈ పదాన్ని ఇంకా కొంతమంది వాడుతున్నారు అనే అనుకుంటున్నాను) గా తెలియదు). మా ఇంటికి బంధువుల రాక కూడా అదే వీకెండ్ జరగడం వల్ల నాకు ఆ స్నో అంతటినీ పూర్తి గా experinece చేసే అవకాశం దక్కింది (ఇంటికి, విమానాశ్రయానికీ మధ్య డ్రైవ్ చేస్తూ). రెండు రోజులూ కలిసి ఒక 16-18 అంగుళాల మందాన మంచు పేరుకుపోవడం తో పెద్దల సంగతేమో తెలియదు గాని, పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసారు. సిటీ ప్రభుత్వం వారు ఆఘ మేఘాల మీద (మంచు ice గా మారకుండా) దాని మీద వుప్పు జల్లించడం, రాకపోకలు ఆగకుండా యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్లని శుభ్రపరచడం చెయ్యడం చూసి నాకు అనిపించింది.. "ఔరా!! ఇంత ఖర్చు, శ్రమ తో కూడిన పని ఐనా, ప్రతీ ఏడాది తప్పని పని ఐనా వీళ్ళు పట్టుదలతో ప్రకృతి ని ఎదిరించడానికి కూడా వెనకాడకుండా ఎంత కష్టపడుతున్నారు" అని. ఇన్ని ఖర్చులు వున్నా (ప్రతీ ఇల్లు, ఆఫీసు, పాఠశాల , గొడ్ల సావిళ్ళతో సహ అన్నీ చలి కాలం అంతా కూడా వెచ్చగా వుంచాలి కదా మరి.. దానికి బోలెడు ఖర్చు తప్పదు), ఈ ఆర్ధిక వ్యవస్థ ఇన్నేళ్ళుగా అభివృద్ది చెందుతూ ఎలా వుంది?. వెంటనే చిన్నప్పటి పాఠం గుర్తు కి వచ్చింది - సహజ వనరులని సరిగా వుపయోగించుకోవడం మీదనే ఏ జాతి భవిష్యత్తు ఐనా ఆధారపడుతుంది అని. అలా అని, ఎక్కడో కాలిఫోర్నియా లో వేడిగా వుంటుంది కదా ఎప్పుడూ అని అందరూ అక్కడకి వలస పోవడం లేదు. చావో రేవో ఇక్కడే తెల్చుకోవాలన్న కోరిక తో జీవిస్తున్నారు - అలా బ్రతుకుతున్నారు కూడా. "తెల్ల వాళ్ళు చేసేవి అన్నీ మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు మెచ్చుకుంటాము - నీది బానిస మనస్తత్వం" అని నన్ను తిట్టడానికో, కొండొకచో కొట్టడానికో రాను అంటే ఒక మాట - మన దగ్గర ఇంతకంటే చాల ఎక్కువ వనరులు వున్నాయి (ఈ వనరులు అని టైపు చెయ్యడానికి ప్రయత్నించినప్పుడల్లా "వానరాలు" అని వచ్చేస్తోంది :) ). వాటిని మనం కొంచెమైన వుపయోగించుకుంటే ఇంతకంటే ఎక్కువ అభివృద్ది సాధించడం అసాధ్యం కాదు. "అమెరికా వాళ్ళు ప్రపంచం లో 5% వుండీ, 90% వనరులు వాడేసుకుంటున్నారు " అని అనడం నిజం గా "ఆడలేక మద్దెల ఓడు" అనడమే.. ఈ గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థలో డబ్బులు ఎవడు ఇస్తే సరుకు వాడికి వస్తుంది. అమెరికా వాళ్ళు చేసేది అంతా మంచే అని నేను అనను. ఐతే వీళ్ళ దగ్గర నేర్చుకోవలసింది మాత్రం చాలా వుంది అంటాను. ప్రస్తుతం మన ఇంధన వినియోగం అమెరికా చైనా ల స్థాయి కి వస్తుంది అంటున్నారు. అలా అయితే చాలా మంచిది. ఇంకో 100 ఏళ్లలో లుప్తమైపోతుందని ఇవాళే వాడడం మానేస్తే మనం మానేశాము కదా అని ఎవరూ ఆగిపోరు. మానవుడు తనకి వచ్చే సవాళ్ళని ఎదుర్కోవాలి గాని, భయపడితే ఇక్కడే ఉండిపోతాము.

Wednesday, March 5, 2008

మా బడి రేడియో

ఎందుకో గుర్తు వచ్చాయి.. మా 4, 5 వ తరగతి సంగతులు. మొగల్తూరు (ఇప్పుడంటే అందరికీ అనేక రకాలుగా తెలిసిపోయింది గాని, మేము చదువుకున్నప్పుడు "కృష్ణంరాజు" వూరు గానే తెలుసు అందరికీ - "చిరంజీవి" ఇల్లు ఊరి చివర్లో ఎక్కడో వుందని అనుకునేవాళ్ళం గాని వేలం వెర్రి గా వెంటబడడం లాంటివి తెలియదు). అక్కడ వున్న వాటిలో, (గవర్నమెంటు ది అయినప్పటికినిన్నీ) అభ్యుదయ ప్రాధమిక పాఠశాల కొంచెం పద్ధతి గా వుండేది. రోజూ 7 గంటలకి యోగ క్లాస్ లు, బడి కి ముందు అసెంబ్లీ, "ఔట్ బెల్" లో గోధుమ నూక ఉప్మా (ఎందుకు పెట్టేవారో నాకు కూడా తెలియదు.. మేము అందరం క్రమం తప్పకుండా స్కూల్ కి వెడుతూనే వుండేవాళ్ళం), మధ్యాహ్నం రేడియో కార్యక్రమం. 2:25 అయ్యేసరికల్లా హెడ్ మాస్టారి రూం లోంచి రేడియో ని తీసుకొని వచ్చి వరండా లో పెట్టడం, పిల్లలు అందరూ పొడుగునా కూర్చోవడం. సోమ వారం అయితే చిత్తరంజన్ గారి "పాట నేర్చుకుందామా" ప్రోగ్రాం. "పిల్లల్లారా.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. పాపల్లార.. ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ.." అంటూ మేము కూడా తన్మయత్వం తో వెనకాలే పాడేస్తూ వుండే వాళ్ళం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఆ రెండేళ్లలో కనీసం 10-15 పాటలు అలా నేర్చుకున్నాము. చిత్తరంజన్ గారు పిల్లలు ఎలా పాడినా సరే "చూడమ్మ.. 'రేపటి భారత పౌరుల్లారా' కాదు 'రేపటి భారత పౌరుల్లారా' అనాలి" అనేవారు (మీకు కూడా తేడా ఏమి కనిపించలేదు కదా.. మాకు కూడా అంతే - ఇంకా ఏమనుకున్నారు? ఆయన రాగ సహితం గా వాళ్ళు చెప్పినదే చెప్పి 'అలా కాదమ్మా.. ఇలా' అంటూ వుండే వారు). జోక్ చేస్తున్నాను గాని, ఆయన ప్రావీణ్యత ని కామెంట్ చేసే జ్ఞానం నాకు వుందని నేను అనుకోను. ఐతే అప్పట్లో నవ్వుకుంటూ వుండేవాళ్ళం ఇంటికి వచ్చి అమ్మకి చెప్పి. "నిదానమే ప్రధానము" అనే కధ ఒక రోజు, "నిదానమే ప్రమాదము" అనే కధ ఇంకో రోజూ - అలా వస్తూ వుండేవి రేడియో లో - ఏ సమయానికి ఏది అనుకూలం గా వుంటుందో అది అనుకోవాలి అని మేము అనుకునేలా :).

మార్చి 31, 2008 నాడు సవరించబడినది:

చదువరుల వ్యాఖ్యలు మరియు రాధిక, సుజాత గార్ల స్పందన వల్ల (వ్యాఖ్యల్లో చూడండి) ఈ పాట చాల ప్రాచుర్యం పొందినదని గ్రహించి, సాహిత్యం సంపాదించడానికి ప్రయత్నించాను. ఈ సైట్ లో కొంచెం దొరికింది. పూర్తిగా సరి కాకపోవచ్చు. సవరణ లు తెలియజేయగలరు.

--పల్లవి--
పిల్లల్లారా ఊఁ ఊఁ ఊఁ ఊఁ .... పాపల్లారా ఊఁ ఊఁ ఊఁ ఊఁ ......
రేపటి భారత పౌరుల్లరా ఊఁ ఊఁ ఊఁ......
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా .. పిల్లల్లారా ..
--చరణం--
మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు .. ఉన్నాడు అతడున్నాడు
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడు .. ఉన్నాడు.. పొంచున్నాడు
భారత మాటకు ముద్దుల పాపలు మీరేలే.. మీరేలే.. మీరేలే..
అమ్మకు మీపై అంతేలేని ప్రేమేలే .. ప్రేమేలే..
--చరణం--
జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం కాపాడండి..
బడిలో బయటా అంతా కలసి భారతీయులై మెలగండి.
కన్యాకుమారి కి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండి..
వీడని బంధం వేయండి.. పిల్లల్లారా.. పాపల్లారా ..

ఈ పైన వున్న సాహిత్యం ఈ సైట్ లోని పాట వినడం ద్వారా రాసినది. ఈ పాట మీరు కూడా వినండి. చిత్తరంజన్ గారి ట్యూన్ లో కాకుండా చాల వైవిధ్యం గా వుంది. మలయాళం భాష కు చెందిన వారు ఎవరో కృషి చేసినట్టు గా తెలుస్తోంది.

కాని, నాకెందుకో, ఈ లైన్ కూడా ఎక్కడో వుండాలి అనిపిస్తోంది:
భారత దేశం ఒకటే ఇల్లు.. భారత మాతకు మీరే కళ్లు.. మీరే కళ్లు.. మీరే కళ్లు..

Monday, March 3, 2008

నా తప్పు కాదు అనుకుంటున్నా!!

నిన్న వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోడానికి దుకాణానికి వెళ్ళా.. (ఇక్కడ ఇంతే లెండి .. ఆది వారమే అన్నీ తెచ్చేసుకోవాలి.. సోమ వారం వెళ్ళాము అంటే, కుంగి, కృశించి, ఆల్మోస్ట్ నశించిపోడానికి రెడీ గా వున్నా కూరలే దొరుకుతాయి :) ). సరే.. రెండు సంచీల నిండా కూరలు నింపామా? నా వెనక ఒక నలుగురు చేరారు చెక్ ఔట్ లైన్ లో. వెనక్కి చూద్దును కదా ఒకాయన చిన్న నూనె డబ్బా పట్టుకొని వున్నాడు.. సరే కదా.. కుర్రోడు (పెద్దోడే లెండి) నాది అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి అని "అయ్యా.. మీరు గాని మీ పని కానిచ్చుకుంటారా ముందు?" అని ఆఫర్ చేశా. అది నేను చేసిన పాపమేమో తెలియదు గాని, ఆ మానవుడు నన్ను "ఛీ.. పీనుగా.. ఈ ప్రపంచం లో వున్న కష్టాలన్నింటికీ నువ్వే కారణం" అన్నట్టు ఒక ఛీత్కారపు చూపు చూసి ముందుకెళ్ళి నూనె డబ్బా బిల్ చేయించుకొని లాగించేసాడు !! కనీసం ఒక థాంక్ యు ("కుదిరితే ఒక కప్పు కాఫీ" ఎలాగు లేదు :) ) కూడా చెప్పకుండా కాటు మొహం పెట్టుకోవడం ఎందుకో నాకు అర్ధం కాలేదు.. పోనీ ఆయన ముందుకి వెళ్లేటప్పుడు నేను కాలు ఏమైనా అడ్డం పెట్టానా అంటే అలా ఏమి గుర్తు లేదు.సీరియస్లీ, మన వాళ్ళు (అంటే నేను కూడా - నేనేదో దిగొచ్చాను అని అనడం లేదు) ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం వీక్ అనే చెప్పాలి. ఐతే, ఇప్పటికైనా ఎదగకపోతే ఎలా? గ్లోబలైజేషన్ అంటారు.. అమెరికా లో వుంటున్నాము అంటారు.. మరి ఇక్కడ వుండీ, ఈ మాత్రం కూడా నేర్చుకోకపోతే ఎలా? ఇటుపైన ఎవరికైనా ఇలాంటి ఫేవర్ చెయ్యాలంటే నాకు భయం వెయ్యదూ? (కొంచెం ధైర్యం పాలు ఎక్కువ కాబట్టి నాకు ఐతే ఒకే - మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?). కాబట్టి, అయ్యలారా, అమ్మలారా, మీకు సహాయం చేసిన వారికీ మీరు చెయ్యగలిగిన గొప్ప ఉపకారం, వారిని మరింత మందికి సహాయం చేసేలా ప్రవర్తించడం (modified స్టాలిన్ లాగ కనపడుతున్నానా? - మీ ఇష్టం). ఇది ఎక్కడైనా వర్తిస్తుంది.. ఇండియా అయినా, అమెరికా అయినా - అంతరిక్షం లోనైనా సరే.
గ్రహించగలరు.

Saturday, March 1, 2008

జల్సా ఆడియో సంరంభం

నిన్న రాత్రి మధుమాసం (ఈ సినిమా గురించి చూసిన తరువాత రాస్తాను) చూసిన తరువాత ఏమి లేస్తాములే అని టీవీ ముందర కూర్చునేసరికి జల్సా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షను రావడం మొదలు అయ్యింది "మా" లో.. ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ కూడా శతజయంతి ఉత్సవాలలాగా జరగడం (అందులో పెద్ద హీరో లవి అయితే మరీను) సాధారణం అయింది కాబట్టీ ఇది కూడా ఇంచు మించు అలాగే వుంటుంది అని అనుకున్నాను. దానికి తగ్గట్టు గానే అభిమానులు, సినిమారంగ ప్రముఖులతో బాటు చిరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరూ హాజరయ్యారు. కొన్ని డాన్సులు, మధ్య మధ్య లో అలీ, సునీల్ ల కబుర్లతో కార్యక్రమం నడిచింది. సునీల్ ఎందుకో (అంటే మరీ అసాధారణం కాదు గానీ ఆయన ఎప్పుడూ బయట వుండేప్పుడు సినిమాల లో వుండేంత ఫ్రీ గా, కామెడి గా వుండడం చూడలేదు - ఎందుకో చాల uncomfortable గా వుంటాడు వేదికలపై (నేను కూడా సునీల్ ఫ్యాన్ నే నండీ.. కాకపోతే మరి నిజం చెప్పాలి కదా)) కొంచెం out of place గా కనిపించాడు. అలీ పాత్ర ఏమిటంటే ఈ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడడం (కావాలనే అనుకోండి) - మిగిలిన వాళ్లు వచ్చి ఆయనకీ సమాధానం చెప్పడం లాగ design చేసారు ప్రోగ్రాం ని. కొన్ని సందర్భాల్లో (ఈ సినిమా తియ్యడానికి రెండేళ్ళు పట్టింది అన్నప్పుడు, పవన్ కల్యాణ్ డైరక్షన్ గురించి మాట్లాడినప్పుడు) అరవింద్ నిజం గానే కొంచెం ఫీల్ అయినట్టు కనిపించారు.

దేవి శ్రీ ప్రసాద్ ఇక్యనైనా శంకర్ దాదా ని వదిలిపెట్టాలి అని చూసిన ఎవరికైనా అనిపించడం సహజం.. ఎన్నాళ్ళు జనాల్ని "హూ హా.. హూ హా" అనిపిస్తారు చెప్పండి? కాని ఏ మాటకీ ఆ మాటే చెప్పుకోవాలి. దేవి మాత్రం స్టేజి మీద స్టెప్ లు "ఇరగదీస్తున్నాడు" అంటే, మన హీరో లు కొంతమంది వెయ్యడానికి కూడా చేతకాని స్టెప్ ల ని చాల సులువుగా వేసేస్తున్నాడు .. ఆలి చెప్పినట్టు సినిమాలలోకి రాబోతున్నాడేమో :). వేచి చూద్దాము.
ఏది ఏమైనా పాటలు మాత్రం బాగున్నట్టు అనిపిస్తున్నాయి. సిడి కొనుక్కొని సావకాసం గా విని చూస్తే చాలా నచ్చుతాయి అనిపిస్తోంది.
(ఈ బ్లాగు కి తెలుగు లో స్పందన తెలియజేయాలంటే http://lekhini.org కి గాని, http://www.google.com/transliterate/indic/Telugu కి గాని వెళ్లండి).