హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి విమానం మారుతున్నప్పుడు ఈ వాటర్ ఫౌంటెన్ నాకు స్వాగతం చెప్పింది. చూడబోతే ఇది ఫౌంటెన్ (నీళ్ళు కింద నుంచి పైకి చిమ్మే)లా కాకుండా "కుళాయి" (నీళ్ళు పై నుంచి కిందకి పడే)లాగ ఉంది.
కళ్ళతో చుట్టూ వెదికాను దగ్గరలో కాగితం గళాసులు ఏమైనా ఉన్నాయేమో అని. కనిపించలా. పక్కన కాసేపు నక్కి గమనించాను ఎవరైనా దానితో తాగడం చూసి ఎలా తాగాలో నేను కూడా నేర్చుకుందామని. అందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు వెళ్ళిపోతున్నారు తప్ప ఆగి అది వాడడం లేదు. పక్కనే ఒకాయన ఇద్దరు పిల్లలతో వెడుతూ నాలాగే అనుమానం గా దానికేసి చూస్తున్నాడు. "ఇదెలా..." అని నేను పూర్తి చేసేలోగా "హి హ్హి" అని మల్లిక్ కార్టూన్ లో లాగ నవ్వి మౌనం వహించాడు. అప్పుడు ఇంక లాభం లేదు అని, అటుగా వెడుతున్న ఒక ఎయిర్ పోర్ట్ ఉద్యోగినిని అడిగా "దీనిలో నీళ్ళు తాగడం ఎలాగండి" అని - ఆవిడ ప్రశ్న ని తెలుగు లో అర్ధం చేసుకొని ఇంగ్లీష్ లో సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. "You put head under" అంటూ.. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకంటే, సామాన్య పీక నిర్మాణం కలిగిన మానవుడు ఎవడూ నేల మీద రెండు కాళ్ళూ ఉంచి ఆ పడుతున్న నీళ్ళ కింద మూతి పెట్టలేడు - కొండొకచో పెట్టినా నోట్లో పడిన నీళ్ళని మింగలేడు. అలా నేను కాసేపు సతమతమై, ఇంకా అవలేక దగ్గరలో ఉన్న కొట్లో నీళ్ళ సీసా కొనుక్కొని బయటపడ్డాను.
ఇలాంటిది ఏదో పెడదామని వాళ్ళ గుత్తేదారు (contractor) హృదయం కాబోలు.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago