మే-జూన్ 2009 తెలుగునాడి సంచిక సంపాదకీయం చూసి ఖంగారుపడ్డాను. అందులో, తెలుగునాడి వచ్చేనెల నుంచి రాదనీ, ఇంత తక్కువ ఆదరణతో పత్రిక నడపడం సాధ్యం కాదనీ తెలియజేసారు. ఐదేళ్ళ క్రితం మొదలు అయినప్పటినుంచీ తెలుగునాడి పత్రికను (చందా చెల్లించే) చూస్తున్నాను. ఏదో ఒక థీమ్ కింద కాకుండా, అందరికీ నచ్చే అన్ని అంశాలు (పాత కాలపు పద్యాల మొదలుకొని, అలనాటి కధ, సీరియల్, పిల్లల సెక్షన్, కార్టూన్లు, ప్రత్యేక వ్యాసాలూ, అలనాటి సినిమా, ఈనాటి సినిమా ల వరకు) గుదిగుచ్చి అందిస్తూ వచ్చారు. ఏ దశలోను కూడా పత్రిక క్వాలిటీ పెరిగిందనే తప్ప తగ్గిందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఐతే, మొదటినుంచీ కూడా, సరిపడినందరు చందాదారులు లేకపోవడం అనేది ఈ పత్రికకి ఉన్న ఎటర్నల్ సమస్యగా కనిపించింది. అంటే, అమెరికాలో ఒక తెలుగు పత్రిక survive అవడానికి సరిపడినంతమంది తెలుగువాళ్ళు లేరా? (ఇది వరకు ఎప్పుడో 1000 మంది చందా దారులు ఉన్నట్టు పత్రికలో ప్రచురించిన నోటీసులో చూసిన గుర్తు). ఇన్ని వేలమంది తెలుగు కుటుంబాల్లో ఒక్క వేయి మనదేనా? సిగ్గు కదూ? ప్రతీ వాళ్ళు, "ఇండియాని మిస్ అయిపోతున్నాము, తెలుగుని, పండగలని, సరదాలని కోల్పోతున్నాము" అనే వాళ్ళే తప్ప (అలా అంటూ కూడా ఇక్కడ వీలైనంత కాలం మాత్రం ఉండేవాళ్ళే), మనకి ఇండియాని దగ్గరకి తీసుకొని వచ్చే ప్రయత్నానికి మాత్రం చేయూతని ఇవ్వలేకపోయారు. గుర్తు చేసుకుంటే, నేను ఈ ఐదేళ్ళలో కలిసిన అనేక మిత్రుల, బంధువుల ఇళ్ళలో చాల కొద్ది మంది మాత్రమే ఇలాంటిది ఒకటి ఉందనీ, దానికి మేము చందాదారులమనీ చెప్పారు. మిగిలిన వాళ్ళకి నేను చెప్పినా, అదేదో పెద్ద తలనొప్పి అయినట్టు, తెలుగు చదివితే పాపం అన్నట్టు ఊరుకున్నారు. పెళ్లి పందిరి ప్రకటనల్లో మాత్రం "మా అమ్మాయి/అబ్బాయి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలలో పెరిగార"నీ, మాకు "ఇండియన్ వాల్యూస్" ఉన్న కోడలు/అల్లుడు కావాలని కోరుకోవడమే తప్ప, ఆ వాల్యూస్ పిల్లలకి నేర్పించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం ఆశ్చర్యకరం. ఇంట్లో ఒక తెలుగు పత్రికో, పేపరో పడి ఉంటే, పది సార్లకి ఒక సారైనా దాని వంక చూడడమో, ఆ "వింత" భాష ఏమిటో తెలుసుకోవాలని పిల్లలకి అన్పించడమో జరుగుతుంది. పెద్దలకే ఆ బుద్ది లేకపోతె పిల్లల వరకు ఎందుకులెండి? ఈ మధ్య తెలుగులో ఈమెయిలు చేసే సదుపాయం రావడంతో నేను తెలుగు చదివే మిత్రులు/బంధువులకి తెలుగులో వేగులు పంపించడం మొదలు పెట్టాను. ఇంగ్లీష్ లో పంపిస్తే వెంటనే వాళ్ళకి వీలైనన్ని వ్యాకరణ దోషాలతో రిప్లై చెయ్యడానికి ఎగబడే అందరూ, మాతృభాషలో మాట్లాడే అవకాశం వున్నా (ఎలా చెయ్యాలో నేను నా మెయిల్ లో చెప్పినా), తెలుగులో సమాధానం చెబితే ఎక్కడ తమ prestige కి భంగమో అని రిప్లై లు కూడా చెయ్యకుండా ఊరుకుంటున్నారు. ఇటువంటి అనుభవం మరి ఎవరికైనా అయిందో లేదో నాకు తెలియదు. కానీ, నా ఒక్కడికే జరగలేదేమో అని నా అనుమానం ("మన" జనాల సంగతి నాకు బాగానే తెలుసు కాబట్టి చెబుతున్నా). చెప్పొచ్చేదేమిటంటే, ఇటువంటి జనాల మీద ఆశ పెట్టుకొని, లాభాపేక్ష లేకుండా పత్రికని నడపడానికి కృషి చేసిన వాళ్ళని ఉసూరుమనిపించేలా చేసినందుకు అమెరికాలో తెలుగువాళ్ళు తలదించుకోవాలి.ఈ ఐదేళ్లు, పత్రికని సమర్ధవంతంగా నడిపినందుకు చౌదరి గారు మరియు టీంకి అభినందనలు.
గమనిక: తెలుగునాడి తో పాఠకుడిగా ఐదేళ్ళ అనుబంధమే తప్ప, నాకు ఏ విధమైన భాగస్వామ్యం లేదు.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago