లాంగ్ వీకెండ్ కావడం వల్ల కిందటి వారాంతం లో మూడు సినిమా లు చూడడం తటస్థించింది. మేము అనుకొని చూడలేదు గాని, మూడూ మూడు రకాలైన సినిమా లు దొరికాయి.
డాన్ లో చెప్పుకోడానికేమీ పెద్దగా కనిపించలేదు. లారెన్స్ స్టైల్ లో పగలు రాత్రీ తేడా లేకుండా సినిమా లో ప్రతీ పాత్రధారీ (హీరోయిన్ లు తప్ప) "చలవ" కళ్ళజోళ్ళు వాడేస్తూ ప్రాణం అంటే లెక్క లేనట్టు ఒకళ్ళని ఒకళ్ళు తుప్పు తుప్పుమని కాల్చేసుకుంటూ వుంటారు (తుపాకీ లతో). నాగార్జున వెనకాలే వున్నట్టు కనిపిస్తున్నా, అవకాశం వచ్చిన ప్రతీ సారి (కొండొకచో అవకాశం సృష్టించుకున్న ప్రతీ సారీ) లారెన్స్ ముందుకు వచ్చి తన నేటివిటి కి సంబంధించిన ఓవరాక్షన్ తో మనల్ని అలరించడానికి ప్రయత్నించాడు. నాగార్జున జుట్టు దువ్విన విధానం వల్లనో ఎందుకో, కొంచెం వయసు, నుదుటి మీద ముడతలు కన్పించాయి (నాకు తెలియదు. మరి డాన్ అంటే అలాగే వుండాలేమో!!). ఈ సినిమా అంతటిలోకి మాకు నచ్చిన వ్యక్తీ విలన్ గా నటించిన కెల్లీ జార్జి. "నటుడు అనే వాడికి భాషా బేధాలు లేవండి.. వాళ్ళని ఏదో భాషలో నోరు కదపమని చెప్పండి.. మనం డబ్బింగ్ లో చూసుకుందాము" అని అనే భావ దారిద్ర్యం తో కొట్టు మిట్టాడే ప్రొడ్యూసర్ లు డైరెక్టర్ ల మధ్య ఎక్కడో ఇలాంటి వాళ్ళు తగులుతారు అనుకుంటాను (నటన విషయం పక్కన పెడితే, ఇలాంటి ఇంకొక వ్యక్తి సాయాజీ షిండే - భాష ని యాసతో పలికితే పలికాడు.. అసలు కి పలకడానికి ప్రయత్నిస్తాడు). ఏ డైలాగ్ కి ఐనా సరే ఒకే విధం గా నోరు కదిపే మన ఉత్తరాది (కొందరు దక్షిణాది) భామలు ఈయన్ని చూసి బోలెడు నేర్చుకోవాలి. వాళ్ళని అలాగే వున్నా పరవాలేదంటూ ప్రోత్సహిస్తున్న నిర్మాత దర్శకులు సిగ్గుతో తల వంచుకోవాలి. మొత్తానికి కాలక్షేపం సినిమా అనిపించింది.
తరవాత శనివారం రాత్రి మిస్టర్ మేధావి చూసాము. ఇంతకూ ముందు నీలకంఠ సినిమాలు చూసి వుండడం చేత, ఈ సినిమా కొంచెం డీసెంట్ గా వుంది అని వినడం చేత, కొంచెం ముందస్తు అంచనాలతో కూర్చున్నాము. అక్కడక్కడా కొంచెం నీరసం గా అనిపించినా, మొత్తానికి పాయింట్ బాగుంది. MS నారాయణ పాత్రని ధర్మవరపు, ధర్మవరపు పాత్రని MS వేస్తే బాగుండేదేమో అనిపించింది. నేను అనుకోవడం, ఈ సినిమా లో నీలకంఠ సాధించిన గొప్ప విజయం, జెనీలియా చేత ఎప్పుడూ చేసే "బబ్లి" మూస నటన కాకుండా, కొంచెం నిజం నటన చేయించడం. డైలాగులు కూడా చక్కగా పలికింది (డబ్బింగ్ చెబితే చెప్పారులెద్దురూ.. ముందు ఆ స్క్రీన్ మీద కన్పించేది ఈ ముఖమే కదా.. వీళ్ళు మాట్లాడే దానిని బట్టి, అప్పుడప్పుడు స్త్రైట్ సినిమా లు కూడా డబ్బింగ్ సినేమల్లాగా కన్పిస్తుంటాయి). ఆవిడకి విగ్గు కొంచెం పెద్దది అయినట్టు కన్పించింది. క్లైమాక్స్ లో డ్రాకులా లా మొహం ఎందుకు పెట్టిందో అర్ధం అవలేదు. రాజా బాగానే వున్నాడు. సుమన్ నటన కూడా బాగుంది.
చివరిగా అత్తిలి సత్తిబాబు. అప్పుల అప్పారావు రేంజ్ లో లేకపోయినా వున్నంతలో EVV సినిమా కి న్యాయం చేసాడు అనే అనిపించింది. EVV మార్కు వెకిలి దృశ్యాలు అక్కడక్కడా కనిపించినా, అలవాటు అయిపోయి, వదిలేసాము. సినిమా ని నడిపించిన తీరు కూడా బాగుంది. ఎప్పటిలాగే, సంభాషణల రచయితలు విజృంభించి రాసేరు (వేగేస్న సతీష్ ఏదో సినిమా కి దర్శకత్వం కూడా చేపడుతున్నట్టు చదివినట్టు గుర్తు). సినిమా మొత్తంలో ప్రేక్షకులకు హీరో మీద పేరుకుపోయిన అసహ్యాన్నంతా చివరి రెండు నిముషాలలో తీసెయ్యడం లో దర్శకుడి ప్రతిభ కన్పిస్తుంది. ఎలా ఆడిందో తెలియదు గాని, రెండో సారి చూడొచ్చు.
లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
1 week ago