కావలసిన పదార్థాలు:
బియ్యం - 3 రైస్ కప్పులు.
పాలకూర - ఒక పెద్ద కట్ట.
ఉల్లిపాయలు - పెద్దది ఒకటి.
పచ్చిమిరపకాయలు - 6.
జీడిపప్పు - 1/2 కప్పు.
మిరియాలు - 1/2 చెంచా.
లవంగాలు - 4.
మినప్పప్పు - 1 చెంచా.
ఆవాలు - 1/2 చెంచా.
జీలకర్ర - 1 చెంచా.
ఉప్పు - తగినంత.
గరం మసాలా పొడి - 1/2 చెంచా.
తయారు చేయు విధానం:
ముందుగా అన్నం వండుకోవాలి.
మిరియాలని పొడి చేసుకోవాలి.
పాలకూరని శుభ్రంగా కడిగి, తరగాలి. ఈ పాలకూర తరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు మిక్సీలో వేసి ముద్దలా తిప్పాలి.
మూకుట్లో నూనె వేసి లవంగాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి అవి బాగా వేగాక ఈ పాలకూర ముద్దని వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని కాస్త తగ్గించి ఈ ముద్దని 10-15 నిముషాలు బాగా ఉడకనివ్వాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నం వేసి అంతా బాగా కలపాలి. మంట మరికాస్త తగ్గించి, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 నిముషాలు ఉంచాలి. ఉప్పు అవీ చూసుకుని ఇంక ఆపెయ్యచ్చు.
ఇది తయారు అయ్యాక ఒక పావుగంట అయినా మూట పెట్టి ఉంచాలి. దీన్ని తయారు చేస్తున్నప్పుడు ఇది బాగా ముద్దగా ఉన్నట్టు ఉంటుంది కానీ, కాసేపు అలా ఉంచితే అన్నం ఆ పాలకూర ముద్దని పీల్చుకుని కాసేపట్లో విడివిడిగా అవుతుంది.
గమనికలు:
1. పోపులో పాలకూర ముద్ద వేసే ముందు అల్లం-వెల్లుల్లి పేస్టు కూడా వేసుకోవచ్చు. కానీ, ఆఫీసు లో డబ్బా మూత తీయగానే ఘాటుగా వాసన రాకుండా ఉండడానికి దీనిని నేను వేయను.
2. పోపు ఇలాగే వెయ్యాలి అని నిబంధన ఏమీ లేదు. ఇది నా సొంత కల్పన. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ, ముద్ద తిప్పినప్పుడు వేశాము కాబట్టి, దానికి బదులు వేరుశనగ గుడ్లు వేసుకోవచ్చు.
3. అదే విధంగా, వండిన అన్నాన్ని కలపడానికి బదులు బియ్యాన్ని ఉడికించిన పాలకూర ముద్దలో వేసి కూడా వండుకోవచ్చు. మీకు ఏది సులువు అయితే అది.
4. మా ఇంట్లో, మా స్నేహితులలో ఈ వంటకం చాలా ప్రాచుర్యం పొందింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు. పాలకూర ముద్ద తిప్పినప్పుడు పచ్చిమిరపకాయలు బాగా తగ్గించుకుని, అలాగే, నేతి పోపు వేసి వాళ్ళకి ఈ వంటకం చేసి పెడితే ఎగరేసుకుపోతారు. (అని నా అనుభవం చెబుతోంది). పైగా ఎంతో ఆరోగ్యం కూడాను.
4 comments:
చాలా బాగుంది, మంచి ఆరోగ్యకరం కూడా, అభినందనలు . మీకు దీపావళి శుభాలు కలుగుగాక
try chesthanu santhi.
Try chesthanu santhi
Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up
Teluguwap,Telugu4u,
Tollywood,Tollywood Updates , Movie Reviews
Post a Comment