చిన్నప్పుడెప్పుడో ఒకసారి (అంటే ఇంచుమించు 1986 అనుకుంటా) - రాజమండ్రి నుంచి వాయుదూత్ విమానంలో హైదరాబాద్ వెళ్ళాము. విమానం ఎక్కడం అదే మొదటిసారి - ఆ వాయుదూత్ లో అంత ప్రమాదం ఉంటుంది అని తెలియదు - విమానం ఎక్కాలి అనే సరదాయే తప్ప. ప్రమాదం అని ఎందుకు అన్నానంటే మేము ఎగిరిన చాలా రోజుల తరువాత వేరే వాయుదూత్ విమానం కూలి పాపం అందులో వాళ్ళు అందరూ పోయారు. వెంటనే ప్రభుత్వం వారు మేల్కొని మొత్తం వాయుదూత్ నే రద్దు చేసారు అనుకోండి అది వేరే విషయం. అప్పుడు ఇప్పటిలా విరివిగా విమాన సర్వీసులు, వాటిమీద ప్రభుత్వ నిఘా ఉండేది కాదు. రాజమండ్రి విమానాశ్రయానికి బయల్దేరి, సగం దూరంలో మా వాహనం (ఆటో లెండి) చెడిపోతే అటుగా వెడుతున్న విమానాశ్రయం వారి జీప్ లో ఎక్కడం, అందులో ఉన్న ఆఫీసర్ - ఎంత పెద్ద ఉద్యోగమో మనకి తెలియదు కాని, ఆ ఎయిర్ పోర్ట్ అంతా తనదేననీ, విమానాలు ఎక్కడానికి వచ్చేవాళ్ళకి తను విమానం ఎక్కే అవకాశం ఉచితం గా ఇస్తూ మహా సేవ చేసేస్తున్నాననీ - అందువలన గారంటీ గా స్వర్గానికే వెడతాననీ నమ్మకం పెట్టుకున్నవాడిలా మొహం వేసుకొని మా వైపు మహా చిరాకుగా చూడడం ఇంకా గుర్తు :). అన్నట్టు ఆ ఫ్లైట్ లో కూర్చొని ఆ విశేషాలు వర్ణిస్తూ మా అమ్మగారికి ఉత్తరం కూడా రాసేము మా అన్నయ్య, నేను - అది హైదరాబాద్ వెళ్ళాక పోస్ట్ చేసాము.
ఏదైనా, మొన్న మళ్ళీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి కి కింగ్ ఫిషేర్ వారి విమానం లో వెడుతూ ఉంటే ఇవన్నీ గుర్తుకి వచ్చాయి. ప్రపంచం అంతా మారిపోయింది కాని, మా రాజమండ్రి విమానాశ్రయం మాత్రం ఇంకా అలాగే ఉంది (ఇంకోటి కడుతున్నారు - ఇంచుమించు తయారు అయిపోయినట్టే ఉంది). మళ్ళీ వచ్చేసరికి ఇది ఉంటుందో, తీసేస్తారో అని ఇలా కొన్ని ఫోటోలు తీశాను. చిన్నప్పుడు ఎలా ఉందో గుర్తు లేదు కాని, నాకు ఇప్పుడు ఉన్న ఎయిర్ పోర్ట్ మాత్రం భలే నచ్చింది. ఏదో నలుగురు సెక్యూరిటీ వాళ్ళు, ఇద్దరు ముగ్గురు అధికారులు, పది మంది కూలీలు, వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ఒక ఇరవై వరకు కార్లు, వాటితో వచ్చిన జనం, "మనం మేకప్ ఎక్కడ వేసుకోవాలి" అనుకుంటూ దిక్కులు చూస్తున్న విమాన వనితలు - అంతే. ఎనౌన్స్మెంట్లు, అనవసరంగా వాగుతూ ఉండే టీవీలు, కిచ కిచ శబ్దం చేసుకుంటూ తిరిగే కన్వేయర్ బెల్టులు అవీ లేకుండా మహా ప్రశాంతంగా ఉంది. ద్వారపూడి రైల్వే స్టేషన్ కూడా ఇంత నిశ్శబ్దంగా ఉండదు. అందులో మధ్యాహ్నం పదకొండు ప్రాంతంలో దిగామేమో, అప్పుడే గోదావరినీ, లంకల్లోని కొబ్బరి చెట్లనీ పైనుంచి చూస్తూ "ఇంటికొచ్చేసాము" అనుకుంటూ ఉండడంతో ఆ ఫీలింగ్ చాలా చక్కగా అనిపించింది. ఆఖరికి లగేజ్ కూడా ఎంచక్కా రెండు తోపుడు బళ్ళలో వేసుకొని వచ్చి మా ముందు పడేసారు. సింపుల్ గా ఏరేసుకున్నాము.
ఇదిగో మరి ఆ ఫోటోలు. గోదావరి మీద కడుతున్న లేటెస్ట్ వంతెన (మరి పేరు ఏమి పెడతారో తెలియదు) కూడా ఉంది చూడండి.
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago
5 comments:
రమాశాంతిగారు మన రాజమంద్రి విమానాశ్రయం గురించి చక్కగా చెప్పినందుకు
ధన్యవాదాలండి. ఎంతోకాలంగా రాజమండ్రిలో వుంటున్నా ఎయిర్పోర్ట్ చూసే అవకాశం
రాలేదు. మా కజిన్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడల్లా వైజాగ్ లో దిగి ఇక్కడికి కారులో
రావటం వల్ల ఎయిర్పొట్కు వెళ్ళాల్సిరాలేదు. ....సెలవు రేఖాచిత్రం సురేఖ.
అవునండీ.. అమెరికా నుంచి గంటలు గంటలు ప్రయాణించి వచ్చాక ఇక చివర్లో రైలు ఎక్కేకంటే ఈ ఆప్షన్ చాలా బాగుంది. గంటలో రాజమండ్రి, అక్కడ నుంచి ఇంకో గంటలో కాకినాడ. ఆవకాయతో మధ్యాహ్న భోజనం :).
"luggage thopudu balla meeda" chaala baagundi. i never tried rajahmundry by flight, after reading this post, i want to try it next time.
రాజమండ్రి పర్యటన గురించి ఆలోచించిన తక్షణం బ్లాగర్ల దృష్టిలో రాజమండ్రి గురించి వెదుకుతుండగా విమానశ్రయం గురించి మీ చక్కటి విశ్లేషణ, జ్ఞాపకాలు చదివే అవకాశం లభించింది... ధన్యవాదములు.
- డా.సి. జయ శంకర బాబు
మురళి, డాక్టర్ గారు - ఇద్దరికీ ధన్యవాదములు.
Post a Comment