మంచి మనిషి.

ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏమి చెయ్యాలా అన్న విషయం ఇంజనీరింగ్ చేస్తున్నన్నాళ్ళూ పెద్దగా ఏమి అనుకోలేదు. అందరూ గేటు రాస్తున్నారంటే నేను కూడా రాసా.. ఏదో జరిగి మార్కులూ బాగానే పడ్డాయి - ఐ ఐ టీ మిస్ అయి మద్రాస్ లో అన్నా యూనివర్సిటీ లో చేరాను కంట్రోల్ సిస్టమ్స్ లో. అసలే ఇంటి బయట ఉండడం మొదటి సారి, మన భాష/ఊరు కాని ప్రదేశం, ముఖ్యం గా ముందు గా తెలిసి ఉన్న స్నేహితులు లేకపోవడం (అందుకే తరవాత ఇంకా ఎక్కువ దూరం అయిన అమెరికా వచ్చినా కూడా ఇక్కడ అప్పటికే తెలిసిన స్నేహితులు ఉండడం తో అస్సలు ఇబ్బంది లేకుండా కలిసిపోయాను), నన్ను అక్కడ ఉండనివ్వలేదు. దానికి తోడు చీకటి గుయ్యారాల లాంటి హాస్టల్ రూములు, రోజుకొకసారి కనిపించే ఈనాడు పేపర్, రుచీ పచీ లేని హాస్టల్ భోజనం - మనకి ఒకటి నచ్చక పొతే అన్నీ భూతద్దాలలోంచి కనిపిస్తాయి కదా - మొత్తానికి ఈ కాలేజీ మనకోసం కాదు అన్న విషయం నిర్ణయం అయిపొయింది. దానికి తోడు, అక్కడ చేరిన ఒక వారం రోజులకి విశాఖపట్నం గీతం లో నాతో చదివిన స్నేహితుడు అమెరికా వీసా కి రావడం, అతని ద్వారా జీ ఆర్ ఈ కి ఎలా తయారవాలి తదితర విషయాలు తెలుసుకోవడం వల్ల అమెరికా పురుగు గట్టిగా కుట్టింది. మనం ఏదైనా పని చెయ్యడానికి...