Thursday, January 14, 2010

"స్వరపేటిక" మీద అదుపు

కొంతమంది ఏమి అంటున్నామో అని చూసుకోకుండా ఎంతొస్తే అంత గబుక్కున అనేస్తుంటారు. అవతలి వారి మీద అది ఎలా పని చేస్తుందో అని ఒక్కసారైనా ఆలోచిస్తే వాళ్లకి ఈ మాటల వల్ల కలిగే బాధని కొంతైనా నివారించవచ్చు. మనిషికి దేముడిచ్చిన పెద్ద ఆయుధం నోరే. రాయిని ఎలాగైతే దేముడి బొమ్మ చెయ్యడానికీ, ఇంకోడి తల బద్దలు కొట్టడానికీ వాడొచ్చో అలాగే, దీనిని కూడా ఇంకొకళ్ళని ఆహ్లాదపరచడానికీ (ఫీల్ గుడ్ చెయ్యడానికి), బాధ పెట్టడానికీ సమానంగా వాడొచ్చు.

విషయం ఏమిటంటే కిందటి శనివారం ఒక స్నేహితుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి అని పిలిచేరు, వెళ్ళాము. పదిన్నరకి వ్రతం అని పిలిస్తే చాలామంది భోజనానికి మాత్రమే పిలిచినట్టుగా నెమ్మదిగా లేచి పన్నెండు అయిందో లేదో చూసుకొని మరీ వచ్చారు అనుకోండి. అందులో కొంతమంది ఆస్తికులు వస్తూనే , "వ్రతం అయిపోయిందా (లేదా)" అని కూడా confirm చేసుకోవడానికి ప్రయత్నించారు. మా మటుకు మాకు ఎవరైనా ఇటువంటి సందర్భాలలో పిలిస్తే వాళ్ళు పీటల మీద కూర్చొనే సమయానికి వెళ్ళి కాస్త వాళ్ళని సంతోషపెట్టాలని వుంటుంది. ముఖ్య కార్యక్రమం వ్రతం కదా!. బిక్కుబిక్కుమంటూ భార్య, భర్త కూర్చుని ఒక పక్క "ఎవరూ రావట్లేదు" అనుకుంటూ, మరో పక్క పురోహితుడు గారు చెప్పేవి యాంత్రికంగా చేస్తూ ఉంటే చూడడానికి బాధ. సరే పక్కదారి పడుతోంది, వీటి గురించి మరోసారి రాస్తాను.

ఈ వ్రతానికి పిలిచిన వాళ్ళకి దగ్గరి స్నేహితులు ఒక భార్య భర్త ఉన్నారు. వాళ్ళిద్దరూ ముందు రోజు సాయంత్రం నుంచి వీళ్ళతో ఉండి, వంటలు, ఏర్పాట్లు, క్లీనింగులు, ఒకటి అని కాకుండా అన్నింటిలోనూ సహాయం చేస్తూ ఉన్నారు. వ్రతం రోజు కూడా గృహస్తు, భార్య వ్రతం చేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళకి కావలసినవి అందిస్తూ, వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తూ నడిపిస్తున్నారు. భోజనాల దగ్గరకి వచ్చేసరికి బెండకాయ కూర కింద ఒక ఎగస్ట్రా కొవ్వొత్తి పెట్టడం వల్ల ఒక గుప్పెడు కూర మాడి మాడు వాసన రావడం మొదలు పెట్టింది. ఒకరిద్దరు చూసి, దానిని ఆర్పేరు, విషయం సర్దుకుంటోంది. ఈ లోగా, పైన చెప్పిన భోజనాల బాచ్ లోంచి ఒక ఆవిడ ముందుకొచ్చి వెటకారంగా "మంట ఎక్కువ పెట్టేశారా?, మాడిపోయింది" అని అతని మొహం మీద అడిగింది అందరూ వినేలా. ("మంటెక్కువ పెట్టి కూర తగలేసినట్టున్నావు?" అనే అర్ధం వచ్చేలా). అతను అంతవరకూ చేసిన పని అంతా ఆ ఒక్క మాటతో గాలికి ఎగిరిపోయింది. పాపం ఒక్కసారిగా embarass అయి తలదించుకున్నాడు.

చెబితే "ఇంతేనా" అనిపిస్తుంది. కాని, ఇలాంటివి మనవాళ్ళు తెగ చేస్తూ ఉంటారు. అప్పటివరకు అతను పడిన కష్టాన్ని మాత్రం గుర్తించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక చిన్న పని తేడా వచ్చేసరికి ఎవరికి వారే పెద్ద మేనేజర్ లాగా ఫీల్ అయిపోయి మొట్టేయ్యడానికి రెడీ. ఇలాంటివి చాలా అవుతూ ఉంటాయి. కొందరికి ఇతరులని ఫీల్ బాడ్ చేసే విద్య చాలా సులువుగా వస్తుంది అనుకుంటాను.. కొన్నాళ్ళు అలా చేస్తూ వస్తే అలవాటు అయిపోయి, "నేను అన్నదానిలో తప్పేముంది? మీరు మరీను, అన్నింటికీ ఫీల్ అయిపోతారు" అని రివర్స్ లో తిరిగి మనమీదకే గిల్టీ ఫీలింగ్ పట్టుకొచ్చి పోస్తారు. ఇటువంటి వాళ్ళు మనల్ని అననూ అంటారు, వాళ్ళని మనం ఏమైనా అన్నా కూడా దులుపుకొని వెళ్ళిపోతారు. ఎటొచ్చీ, తలనొప్పి మనకే అన్నమాట. మరికొందరు ("చిరునవ్వుతో" లో త్రివిక్రమ్ "అతనిని చూడు - శనిగ్రహం మీద ఇల్లు కట్టుకునే వాడిలా ఫేస్" అని చెప్పినట్టు) negativity నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. "పిల్లాడికి ఒంట్లో బాగా లేదు" అనగానే "హాస్పిటల్ కి తీసుకెళ్ళలేదా?" అంటూ మొదలు పెడతారు. తీసుకెళ్ళకుండా మనం ఉంటామా? ఏదో ఒకటి చేస్తాము కదా? ఈ మందు వెయ్యలేదా, humidifier పెట్టలేదా అనుకుంటూ చిట్టా విప్పుతారు. అసలు ఆ negativity ఎందుకు? ముందుగా మనల్ని వెర్రిపీనుగులుగా ఊహించేసుకొని "వీళ్ళు చేసి ఉండరులే" అని అనేసుకొని ఎంత అనిపిస్తే అంత అనెయ్యడమే!. ఇటువంటి సందర్భాలు వస్తే సంయమనం పాటించి, నోరు పవర్ తెలుసుకొని (మన పెద్దవాళ్ళు అంటారు కదా - "కాలు జారితే తీసుకోగలము కాని, నోరు జారితే తీసుకోలేము" అని) ఏమి మాట్లాడుతున్నామో, ఆ మాట ఎవరైనా మనల్ని అంటే మనకి ఎలా ఉంటుందో అని ఒకసారి అనుకొని ప్రవర్తిస్తే అనేక తలనొప్పులు తగ్గుతాయి.

3 comments:

cbrao said...

ఆహ్లాదంగా మాట్లాడటం ఒక కళ.

శిశిర said...

అవునండి. "నోరా చేటు తేకే అనే" సామెత ఊరికే చెప్పలేదు మన పెద్దలు.

Unknown said...

మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు