Friday, July 25, 2008

బొమ్మరిల్లు లో ఆంగ్లగోల

చూసే వుంటారు "మా" లో సుహాసిని నడిపిస్తున్న బొమ్మరిల్లు వస్తోంది కదా. నాకు ఎందుకో సుహాసిని వి ఈ మధ్య సినిమాలు చూసి ఆవిడ అంటే కొంచెం భయం కలిగిన మాట వాస్తవం ("నువ్వు నాకు నచ్చావు" లో బరువు డైలాగులు, "రాఖీ" (ఇది చూడలేదులెండి కానీ, చూసిన యాడ్లే చాలు) లో కొంచెం ఓవర్ గా కన్పించే నటన చూసి). కానీ, ఈ షో చూసాక, నాకు అలా అనిపించడానికి ఆయా సినిమాలలో ఆవిడ పాత్రల్ని దిద్దిన డైరెక్టర్లు, మాటలు వ్రాసిన రచయితలూ కారణం అని అనిపించింది. రూల్స్ మరీ "ఎవరికీ మేము ఏమీ ఇవ్వం" టైపులో వున్నా, ఈ ప్రోగ్రాం జనరల్ నాలెడ్జ్ వరకు ఐతే పరవాలేదు. సుహాసిని కూడా "ప్రశ్న అడిగామా, ఆన్సర్ చెప్పారా" అన్నట్టు కాకుండా, వీలు ఐన చోట్ల సమాచారం ఇస్తూ, కబుర్లు చెబుతూ బాగానే నడిపిస్తోంది అనే అనిపించింది.
కానీ, నాకు ఈ ప్రోగ్రాం లో చిర్రెత్తుకొని వచ్చే అంశం ఒకటి వుందండోయ్. అదే "మన" వాళ్ల ఆంగ్ల భాషా దుర్వినియోగం (అంటే, అవసరం అయిన దానికంటే, చాల ఎక్కువగా మాట్లాడడం). ఏదో కొంచెం ఇస్త్రి చేసిన షర్టు వేసుకొని కాస్త ప్యాంటు, బూట్ వేసుకొని, మరకలు లేని కళ్ళజోడు మొహానికి తగిలించుకోగానే, ఎక్కడినుంచో దిగివచ్చినట్టు, తెలుగంటే ఏమిటో తెలియనట్టు, "this", "this" అనుకుంటూ వచ్చీరాని (అన్నీ గ్రామర్ తప్పులే మళ్ళీ) ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించడం. ఇందులో మగ/ఆడ అని లేదు. అందరికీ ఇదే జబ్బు. మళ్ళీ తమ టీం మేట్స్ తో గొణగడానికి మాత్రం తెలుగు పనికివస్తుంది "ఆన్సర్ అదే అంటావా" అనో, "ఇది చెప్పేద్దాం" అనో కూసే కూతలు మాత్రం మైక్ లో గుస గుసగా వినిపిస్తూనే వుంటాయి. నాకు అన్నింటికంటే అసహ్యం కలిగించే సందర్భం మాత్రం సుహాసిని ఏదైనా అడిగినప్పుడు వీళ్ళ ప్రవర్తన!. ఆవిడ ఆంధ్ర లో పుట్టకపోయినా, తెలుగు మాతృభాష కాకపోయినా, తెలుగు ప్రోగ్రాం అనే స్పృహ తో ఏది మాట్లాడినా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దానికి కూడా ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవాడిని ఆంధ్ర లోంచి వెళ్ళగొట్టి సముద్రంలో పారెయ్యాలి - అప్పుడైనా "అమ్మా" అని తెలుగులో అరుస్తాడో లేదో చూడాలి. అది నాకు నిజంగా కంపరం కలిగిస్తుంది. తల్లి తన హోదాకు తగ్గట్టు లేదని ఆమెను పనిమనిషిగా పరిచయం చేసిన పాపాత్ముల కధలు వింటుంటాము. వాళ్ళకి వీళ్ళు ఏమాత్రం తీసిపోరు. ఇటువంటి ఘనులని చూసి వాళ్ళ పిల్లలు ఏమి నేర్చుకుంటారో గ్రహించడం పెద్ద కష్టం ఏమీ కాదు.
ఇది వ్రాసి కొద్ది రోజులయింది.. ఈలోగా, ఒక రోజు బొమ్మరిల్లులో వరుణ్ సందేశ్ (హ్యాపీ డేస్ చందు) వచ్చాడు శేఖర్ కమ్ములతో. అదే రోజో, ఆ ముందు రోజో, ఏదో సుత్తి ఇంటర్వ్యూ కోసం రాహుల్ (హ్యాపీ డేస్ టైసన్) కూడా (రైన్బో సినిమా కోసం). వరుణ్, తను పుట్టిన నాలుగేళ్ల తరవాత అమెరికా వెళ్లి మళ్ళీ హ్యాపీ డేస్ కోసం ఇండియా వచ్చాడుట (మధ్యలో వస్తూ పోతూ వున్నా, ఎక్కువ కాలం వున్నది హ్యాపీ డేస్ కే). బొమ్మరిల్లులో శేఖర్ ఐనా తెలుగు మాట్లాడడానికి తడుముకున్నాడేమో తెలియదు గానీ, వరుణ్ మాత్రం చక్కని తెలుగు మాట్లాడేడు. ఇంకోపక్క రాహుల్ మాత్రం మొత్తం ఇంటర్వ్యూ అంతా ఇంటర్వ్యూ చేసే అమ్మాయి తెలుగులో ఎన్ని అడిగినా, ప్రతీ దానికి వచ్చీ రాని ఇంగ్లీష్ తప్ప తెలుగు ముక్క బయటపడనివ్వలేదు. ఎంత తేడా?

Friday, July 18, 2008

సెన్సార్ కత్తెర

సెన్సార్ కత్తెరని ఈమధ్య మార్కెట్ లోకి తీసుకొని వెళ్లి పదును పెట్టించి తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరిగాయని తెలిసి సంతోషించాను. దాని వల్ల ఏమి ఒరుగుతుంది, ఏమి ఒరగదు అనేదానికన్నా ముందు, ప్రయత్నం జరగడం హర్షణీయం. అందులో నాకు నచ్చినవి రెండున్నాయి. ఒకటి కులం పేరు మీద వ్యంగ్యం, లేదా కులానికి సంబంధించిన రెఫెరెన్సుల మీద సీరియస్ గా వుండాలి అని నిర్ణయించుకోవడం. బయట కొట్టుకు చచ్చేది కాక మళ్ళీ సినిమాలలో కూడా కులం గోల ఎందుకు? మనం సినిమాలలో చూపించేది (చెడు మాత్రం) తు.చ. తప్పకుండ పాటించడానికి ఏళ్ళనుంచీ అలవాటు పడ్డాము. మంచి చెప్పకపోతే పోయే, చెడు నేర్పకుండా వుంటే చాలు అనుకునే టైం వచ్చింది. ఇది కొంచెం స్లో పాయిసన్ లాంటిది. వెంటనే effect చూపించకపోయినా, సమాజంలో మనం ప్రవర్తించే తీరుని తప్పక ప్రభావితం చేస్తుంది. అందుకని, దానిని కొంచెమైనా కంట్రోల్ చేద్దామని అనుకోవడం మంచిదే. రెండోది వ్యక్తుల physical disabilities ని వెక్కిరించే పిలుపులు, తిట్లు. "పోట్టోడా, గుడ్దోడా, కుంటోడా, ముసలోడా" లాంటి పిలుపులు. ఎవడైనా ఇంకొకడిని వాడి రూపు రేఖలని, అవిటి తనాన్ని బట్టి పిలవడం ఒక మానసికరుగ్మత!. ఏం? ఇవాళ చక్కగా ఉన్నవాడు రేపు ఏ యాక్సిడెంటో అయితే "కుంటోడో, గుడ్దోడో" అవడా? ఇంక పదేళ్ళు పొతే ఇవాళ ఇతరులని పిలిచే వాడు రేపు "ముసలోడు" అవడా? దానిని ముందు సినిమాలలోనుంచి బయటకి పంపిస్తే తరవాత జనాలు ఉపయోగించడం తగ్గిస్తారు (ఇది కూడా పైన చెప్పిన కారణం వల్లనే - మనం సినిమాలని గంగిరెద్దుల్లా ఫాలో అయే అలవాటు వున్నవాళ్ళం కావడం వల్ల). అలాగే, కత్తులతో పొడుచుకోడాలు , గొడ్డళ్ళతో నరుక్కోడాలు, వెకిలితనం (as in vulgarity) వున్న సినిమాలకి కూడా కళ్ళెం వేస్తె సమాజం సగం బాగుపడుతుంది.

Monday, July 7, 2008

సిరివెన్నె(ఎ)లా?


ये जिंदगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగీ ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
चल चकदे चकदे అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాటా అనుకో తమాషగా తలవూపీ
వెరైటీగా శబ్దం విందాం అర్ధం కొంచెం సైడ్ కి జరిపి
అదే మనం తెలుగు లో అంటే, dont worry bee haapee
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి ...

ఆగండాగండి.. సీతారామ శాస్త్రి గారు.. ఏమిటండీ ఇది? "dont worry be happy" అనే వాక్యాన్ని తెలుగు అనుకోమంటారా (మళ్ళీ "మన" తెలుగు అని కూడా అన్నారు)? మీరు రాసింది త్రివిక్రమ్ తిరగారాశాడా లేక దేవిశ్రీ దిద్దుబాటు చేశాడా లేక మీకే అలా అనిపించిందా?? బాగుంది!! :).