డాన్ - మిస్టర్ మేధావి - అత్తిలి సత్తిబాబు LKG
లాంగ్ వీకెండ్ కావడం వల్ల కిందటి వారాంతం లో మూడు సినిమా లు చూడడం తటస్థించింది. మేము అనుకొని చూడలేదు గాని, మూడూ మూడు రకాలైన సినిమా లు దొరికాయి. డాన్ లో చెప్పుకోడానికేమీ పెద్దగా కనిపించలేదు. లారెన్స్ స్టైల్ లో పగలు రాత్రీ తేడా లేకుండా సినిమా లో ప్రతీ పాత్రధారీ (హీరోయిన్ లు తప్ప) "చలవ" కళ్ళజోళ్ళు వాడేస్తూ ప్రాణం అంటే లెక్క లేనట్టు ఒకళ్ళని ఒకళ్ళు తుప్పు తుప్పుమని కాల్చేసుకుంటూ వుంటారు (తుపాకీ లతో). నాగార్జున వెనకాలే వున్నట్టు కనిపిస్తున్నా, అవకాశం వచ్చిన ప్రతీ సారి (కొండొకచో అవకాశం సృష్టించుకున్న ప్రతీ సారీ) లారెన్స్ ముందుకు వచ్చి తన నేటివిటి కి సంబంధించిన ఓవరాక్షన్ తో మనల్ని అలరించడానికి ప్రయత్నించాడు. నాగార్జున జుట్టు దువ్విన విధానం వల్లనో ఎందుకో, కొంచెం వయసు, నుదుటి మీద ముడతలు కన్పించాయి (నాకు తెలియదు. మరి డాన్ అంటే అలాగే వుండాలేమో!!). ఈ సినిమా అంతటిలోకి మాకు నచ్చిన వ్యక్తీ విలన్ గా నటించిన కెల్లీ జార్జి. "నటుడు అనే వాడికి భాషా బేధాలు లేవండి.. వాళ్ళని ఏదో భాషలో నోరు కదపమని చెప్పండి.. మనం డబ్బింగ్ లో చూసుకుందాము" అని అనే భావ దారిద్ర్యం తో కొట్టు మిట్టాడే ప్రొడ్యూసర్ లు...