ఐడియా సూపర్ సింగర్ కాలక్షేపం
మామూలుగా మనం "కాలక్షేపం" అంటే, పాజిటివ్ అర్ధంలో వాడుతూఉంటాము. "పురాణ కాలక్షేపం" అనో, "బాగా కాలక్షేపం అయింది" అనో, "ఏదో అలా కాలక్షేపం అయిపోతోంది" అన్నట్టు.. ఐతే, ఈ కాలక్షేపం మాత్రం తప్పకుండ నేగటివ్ అర్ధంలోనే (అందులో నాకు ఏమాత్రం అస్పష్టత లేదు). ఇంచుమించు ఆరునెలల నుంచి సాగదీస్తున్నారు. మొదటినుంచీ, దీనికి ఏదో "రియల్" రియాల్టీ షో అన్నట్టు రంగు అద్దాలని ప్రయత్నాలు జరిగాయి. (గాయకులు ఇతర గాయకులని, జడ్జిలని ఛాలెంజ్ చెయ్యడం - అలాంటి "పెట్టుడు" నాటకీయతతో). కొంతవరకు పరవాలేదు. సుమ చాలా రోజులు తన క్రియేటివిటీ తో నెట్టుకొనివచ్చింది ఆంఖర్ గా.. అయితే ఇప్పుడు ఆవిడ అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలూ వాడబడి, ఇంకా ఏమి మిగిలినట్టు కనిపించడంలేదు. (ఆవిడ తప్పులేదు.. వారానికి కనీసం నాలుగు గంటలు అదే ప్రజలతో, అదే ప్రోగ్రాం చేస్తూ ఉంటే ఎవరి సృజనాత్మకత ఐనా సరే హరించుకుపోతుంది). ప్రతీ పాట తరవాత, "అద్భుతం", "ఆహా", "ఓహో" అని నచ్చినా నచ్చకపోయినా పొగడడం, గాయకులని ఏదో విధం గా మెచ్చుకోడానికి ప్రయత్నించడం తప్పకుండా చెయ్యమని ఆవిడకి ఆదేశాలు...