ఇంటర్నెట్ లో తెలుగు లో వ్రాయడం ఈ మధ్య సులభం కావడం చాలా మంది తెలుగు తెలిసిన వాళ్ళకి తెలుగులో వ్రాయాలనే ఉత్సాహం కలిగిస్తోంది - ఇది శుభ పరిణామం. మా బ్లాగ్ చూసో, మేము తెలుగు లో పంపించే వేగులు (ఈమైల్స్) చూసో చాలా మంది ప్రయత్నిద్దామని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒకోవిధంగా ఈమెయిలు లో వివరించే కంటే, ఒక చోట ఉంటే అందరికీ బాగుంటుంది అని ఈ ప్రయత్నం. ఇంటర్నెట్ లో ఈ సమాచారం అంతా ఉన్నా, కొన్ని సార్లు ఎక్కువ సమాచారం కూడా మనల్ని భయపెడుతుంది - ప్రయత్నించడం నుండి దూరం గా ఉంచుతుంది. అందుకని, సింపుల్ గా, తెలుగు లో ఈమెయిలు/చాట్ వ్రాయడం, అంతగా కావాలంటే వర్డ్ డాకుమేంట్ లో తెలుగు లో సేవ్ చేసుకోవడం ఎలా అనే విషయాల మీద ఇక్కడ దృష్టి కేంద్రీకరించాను.
ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
వీటిలో మీరు కావాల్సిన తెలుగు టైపు చేసుకొని కంట్రోల్+సీ, కంట్రోల్+వీ ద్వారా ఎక్కడైనా పేస్టు చెయ్యవచ్చు. (ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి - అందుకని తెలుగు తెలుగు లాగే కనిపిస్తుంది).
గూగుల్ మరియు క్విల్‌ప్యాడ్ వారి ఉపకరణంతో, మీరు ప్రాధమిక జ్ఞానం ఉన్నా సరే (అంటే, మీరు "అంటే" అని టైపు చెయ్యాలి అనుకోండి - గూగుల్/క్విల్‌ప్యాడ్ లో ఐతే "ante" అని చేస్తే సరిపోతుంది - లేఖిని లో "anTE" అని వ్రాయాల్సి వస్తుంది - ప్రయత్నిస్తే తేడా మీకు తెలుస్తుంది), తెలుగు లో సులువు గా టైపు చేయవచ్చు. ఐతే, గూగుల్/క్విల్‌ప్యాడ్ కి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి - మీరు టైపు చేసిన ప్రతీ సారి, అది సర్వర్ కి అనుసంధానమై, ఇంతకూ ముందు ఈ అక్షరాల కంబినషన్ తో ఏ తెలుగు పదం వచ్చిందో, దానిని తెచ్చుకుంటుంది - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా అన్నమాట. మళ్ళీ వీటి రెండింటిలో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. క్విల్‌ప్యాడ్ తో ఫార్‌మ్యాటింగ్ కూడా ఎడిటర్ లో నే చేసేయ్యచ్చు. గూగ్లె ఐతే వేరే వర్డ్ ప్రోసెసింగ్ అప్లికేషన్ (వర్డ్ (మైక్రోసాఫ్ట్ లేదా ఓపెన్ ఆఫీస్), లేదా, తెలుగు అర్ధం చేసుకొనే ఏదైన పరికరం) వాడాల్సి ఉంటుంది. ఏది వాడడం అనేది ఎవరి ప్రాధాన్యత ని బట్టి వారు నిర్ణయించుకోవచ్చు.
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని.ఆర్గ్ కి వెళ్ళిన తరవాత, ఫైల్/సేవ్ఆస్ మెనూ ని ఉపయోగించి, దానిని మీ కంప్యూటర్ మీదకి సేవ్ చేసుకుని offline లో వాడుకోవచ్చు.
యాహూ మెయిల్ లో తెలుగు:
పైన చెప్పినట్టు గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్ లేదా, లేఖిని వాడి, తెలుగు టైపు చేయడం, కాపీ పేస్టు చేసుకోవడం.
జిమెయిల్ లో తెలుగు:
జిమెయిల్ లో ఇప్పుడు చాలా భారతీయ భాషలని అనుసంధానం చేసారు. అందువల్ల మీరు కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. దానికి ముందు మీరు మీ జిమెయిల్ ఎకౌంటు లో తెలుగు ని ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం, ముందు "సెట్టింగ్స్" లింక్ నొక్కండి.
"జనరల్" టాబ్ లో, "ఎనేబుల్ ట్రాన్స్లిటరేషన్" అనే చెక్ బాక్స్ ని చెక్ చెయ్యండి. తరవాత, దాని కింద, "డిఫాల్ట్ ట్రాన్స్లిటరేషన్ లాంగ్వేజ్" అన్న చోట, తెలుగు ని ఎంచుకోండి. కింద కి స్క్రోల్ చేసి, "సేవ్ చేన్జస్" బటన్ ఒత్తండి.
ఇప్పుడు మీరు "కంపోసే మెయిల్" చేస్తున్నప్పుడు పైన "అ" అనే అక్షరం కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే ట్రాన్స్లిటరేషన్ పని చెయ్యడం మొదలు పెడుతుంది. ప్రయత్నించండి.. చాలా సులువు. (ఈ ఆదేశాలు ఇక్కడ కూడా లభ్యం: http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).
జీచాట్ లో (ఆ మాటకొస్తే ఏ వెబ్ సైట్ లోనైనా, ఏ టెక్స్ట్ బాక్స్ లోనైనా) తెలుగు:
గూగుల్ వాళ్ళు ట్రాన్స్లిటరేషన్ తో బాటుగా, దానిని ఒక బుక్మార్క్లేట్ గా అందిస్తున్నారు. ఏ బ్రౌజరు లోనైనా సరే, దీనిని ఒక సారి ఇన్స్టాల్ చేసుకుంటే, మీరు ఏ వెబ్ సైట్ కి వెళ్ళినా సరే - అక్కడ ఉన్న ఏదేని టెక్స్ట్ బాక్స్ లో తెలుగు లో టైపు చెయ్యడానికి దానిని ఉపయోగించవచ్చు. మీరు ఏ బ్రౌజరు వాడుతున్నా, ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు దొరుకుతాయి: http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store
వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:
మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. మీరు వేరేగా ఏమి చెయ్యక్కర్లేదు. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ చాలా వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm
తెలుగు చదవగలిగిన వాళ్ళు అందరికీ తెలుగు లోనే ఈమెయిలు పంపించండి. అన్నట్టు, లేఖిని లో ఇంకో ఉపకరణం కూడా ఉంది. నిఖిలే (లేఖిని ని తిరగేసి :) ). అంటే, అది ఏమి చెయ్యబోతోందో తెలిసింది కదా? ఉదాహరణకి, మీరు ఎవరికైనా తెలుగు లో ఈమెయిలు పంపించారు అనుకోండి, వాళ్ళకి తెలుగు తెలుసు, కాని, చదవడం రాదు. అంటే, వాళ్ళకి "elaa unnaavu" అంటే అర్ధం అవుతుంది కాని, "ఎలా ఉన్నావు" అంటే క్వశ్చన్ మార్క్ ముఖం వేయచ్చు. అటువంటి వాళ్ళు, మీరు పంపించిన తెలుగు సందేశాన్ని నిఖిలే కి అందిస్తే, అది దానిని ఇంగ్లీష్ లో కి మార్చి పెడుతుంది. నాకు ఐతే, ఈ ఉపకరణం చాలా బాగా నచ్చింది. ప్రయత్నించి చూడండి: http://lekhini.org/nikhile.html
ఈ పైన ఇచ్చిన లింకులు ఏవైనా విరిగిపోయినా, ఏమైనా మీకు అర్ధం కాకపోయినా, తప్పక కామెంట్ పోస్ట్ చెయ్యండి - మీ సందేహాలు తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago