కలెక్టర్ కూడా సామాన్య ఆసుపత్రికే (ఈనాడు తూర్పు గోదావరి లో ఈ రోజు వచ్చిన కధనం - కొంచెం కూర్పు జరిగింది - విషయం మాత్రం అదే)."
అది కాకినాడ సర్వజన ఆసుపత్రి. సమయం మధ్యాహ్నం 12:30జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది వాహనం మెయిన్ గేటు ద్వారా ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం వద్దకు వచ్చి ఆగింది. ఇది గమనించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పరుగులు తీసారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారేమోనని బెంబేలెత్తారు. ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమవుతున్న వైద్యులు, సిబ్బంది కూడా లోపలకి వెనుదిరిగారు.
ఇంతలొ ఆ వాహనం నుంచి కలెక్టర్తో సహా మరో వృద్ధ జంట దిగింది. కలెక్టర్ వెంటే నడుస్తూ 18 వ నెంబర్ లో వున్న కంటి చికిత్సా విభాగానికి చేరుకున్నారు.మరోపక్క ఆసుపత్రి అధికారులు కలెక్టర్ ఎక్కడున్నారోనని వెదుకులాట మొదలుపెట్టారు. కలెక్టర్ మాత్రం తన వెంట వచ్చిన వృద్ధ దంపతులకు వైద్య పరీక్షలకోసం ఔట్ పేషెంట్ లో పేర్లు నమోదు చెయ్యాలని సిబ్బందిని కోరారు. ఆ దంపతులు తమపేర్లు హరివంశి ద్వివేది, తారాదేవి ద్వివేది గా వైద్యులకు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలెక్టర్ తమ తల్లితండ్రులనే ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. దీంతో వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దంత వైద్య విభాగానికి వెళ్లి అక్కడ కూడా దంత పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు కలెక్టర్ పనిలో పనిగా అక్కడ వున్నా కొందరు రోగుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు."
"ఆ.. కలెక్టర్ కదా.. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినా వైద్యం సరిగ్గానే చేస్తారు" - అనే పెస్సిమిస్ట్ వాళ్ళకి ఇంక చెప్పేది ఏమి లేదు గాని, నాకు మాత్రం ఆయన చేసిన దానిలో మంచి ఆదర్శం కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలో తప్ప చదివించని ఈ రోజుల్లో, ఒక ప్రభుత్వాధికారి తన ఆరోగ్యావసరాలకి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడం మిగిలిన వారికి మార్గదర్శకంగా పనికివస్తుంది. అసలు అందరు అధికారులు, నాయకులు ఇలా తమ అవసరాలకోసం ప్రభుత్వాసుపత్రులకి వస్తే, అక్కడి పరిస్థితులు ఇట్టే మెరుగుపడతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. పనిలో పనిగా వాళ్ళకి సామాన్య ప్రజల అవసరాలు ఏమిటో, వారు పడే కష్టాలు ఏమిటో వేరే ఎవరూ చెప్పక్కర్లేకుండా అవగతమవుతాయి. అక్కడ పని చేసి డాక్టర్లు, సిబ్బంది కూడా అప్రమత్తం గా వుంటూ వల్ల విధిని సరిగా నిర్వహిస్తారని భావించవచ్చు..