తల్లి పాలు.
(ఈ టపా కి వ్యాఖ్యలు వ్రాసినవారందరికీ కృతజ్ఞతలు. వారి వ్యాఖ్యల వల్ల మరిన్ని అంశాలు జోడించడం జరిగింది)కిందటి సంవత్సరం జూన్ లో ప్రసారం చేసిన బాలు గారి పాడాలని వుంది రికార్డింగ్ చూస్తూ వుంటే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తల్లి పాలు అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మంచివి అనీ, మన వాళ్ళు (చాలా మంది) ఆ విషయం తెలుసుకోకుండా, పిల్లలు పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు తాగనివ్వరనీ, దీనిని నిరోధించాల్సిన అవసరం ఉంది అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా మొట్ట మొదటి రియాక్షన్ ఏమిటంటే, అలా చేసే వాళ్ళని ఒక గది లో వేసి బంధించి "మా తప్పు తెలిసింది మహాప్రభో" అనేవరకూ రోజూ రెండు పూటలా ఇంత పచ్చగడ్డి పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అమృతతుల్యమై, రోగ నిరోధక శక్తి ని కలిగించే తల్లి పాలు దూరం చేసి పిల్లలకి పోత పాలు పోస్తే వాళ్ళకి ఎలా వుంటుందో!!. అసలు బిడ్డ పాలు తాగకపోతే ఆ తల్లి కి ఎదురయే కష్టం కూడా (engorgement (పాలిండ్లలో పాలు నిండిపోయి నెప్పి పుట్టడం) వల్ల) వర్ణించనలవి కాదు. సృష్టి లో జరిగే ప్రతీ విషయం కూడా పరస్పర ఆధారితం గా జరుగుతుంది (Symbiosis). పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తి కావడం, అప్పు...