(మా) రాజమండ్రి విమానాశ్రయం.

చిన్నప్పుడెప్పుడో ఒకసారి (అంటే ఇంచుమించు 1986 అనుకుంటా) - రాజమండ్రి నుంచి వాయుదూత్ విమానంలో హైదరాబాద్ వెళ్ళాము. విమానం ఎక్కడం అదే మొదటిసారి - ఆ వాయుదూత్ లో అంత ప్రమాదం ఉంటుంది అని తెలియదు - విమానం ఎక్కాలి అనే సరదాయే తప్ప. ప్రమాదం అని ఎందుకు అన్నానంటే మేము ఎగిరిన చాలా రోజుల తరువాత వేరే వాయుదూత్ విమానం కూలి పాపం అందులో వాళ్ళు అందరూ పోయారు. వెంటనే ప్రభుత్వం వారు మేల్కొని మొత్తం వాయుదూత్ నే రద్దు చేసారు అనుకోండి అది వేరే విషయం. అప్పుడు ఇప్పటిలా విరివిగా విమాన సర్వీసులు, వాటిమీద ప్రభుత్వ నిఘా ఉండేది కాదు. రాజమండ్రి విమానాశ్రయానికి బయల్దేరి, సగం దూరంలో మా వాహనం (ఆటో లెండి) చెడిపోతే అటుగా వెడుతున్న విమానాశ్రయం వారి జీప్ లో ఎక్కడం, అందులో ఉన్న ఆఫీసర్ - ఎంత పెద్ద ఉద్యోగమో మనకి తెలియదు కాని, ఆ ఎయిర్ పోర్ట్ అంతా తనదేననీ, విమానాలు ఎక్కడానికి వచ్చేవాళ్ళకి తను విమానం ఎక్కే అవకాశం ఉచితం గా ఇస్తూ మహా సేవ చేసేస్తున్నాననీ - అందువలన గారంటీ గా స్వర్గానికే వెడతాననీ నమ్మకం పెట్టుకున్నవాడిలా మొహం వేసుకొని మా వైపు మహా చిరాకుగా చూడడం ఇంకా గుర్తు :). అన్నట్టు ఆ ఫ్లైట్ లో కూర్చొని ఆ విశేషాలు వర్ణిస్తూ మా అమ్మగార...