ఈ రోజే వేటూరి గారి మరణ వార్త తెలిసింది. వరుడు ఆడియో రిలీజ్ లో, ఆ తరవాత మా టీవీ ఇంటర్వ్యూ లో ఆయన ఇంకా మాట్లాడుతున్నట్టే ఉంది - ఇంతలో ఎంత పని జరిగింది!. ఆయన పాట ఏది విన్నా "ఇది వేటూరి పాట" అని యిట్టె తెలిసిపోయే ముద్రలు ఆయన పాటల నిండా ఎన్నో. ముఖ్యం గా ఒకే పదానికి రెండు అర్ధాలు వచ్చేలా వెంట వెంటనే రెండు లైన్స్ లో రాయడం.. ఎన్ని వేల పాటలు రాసిన, ఎన్ని విధాలుగా ఎన్నో పదాలని వాడినా, ప్రతీ కొత్త పాటలోనూ మళ్ళీ ఇంకో కొత్త పద ప్రయోగం తో ముందుకొచ్చి మనల్ని ఆశ్చర్యపరచం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్య. కోరుకునే వాళ్ళ అభిరుచి, విజ్ఞత లని అనుసరించి ఎవరు ఏది అడిగితే వారికి అది రాసిపెట్టే లక్షణం ఆయన సొంతం. అందుకే కొన్ని పాటలు వింటే "ఈయన ఇలాగే రాస్తాడు" అని విసుక్కున్నా, వెంటనే మరో ఆణిముత్యం లాంటి పాటతో మనల్ని మురిపించి "ఆ ముందు పాట పాపం నాతో రాయించుకున్న వాళ్ళదే కాని నాది కాదర్రా" అంటూ చెబుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నే ఈ మధ్య ప్రసారం అయిన "పాడుతా తీయగా" చూస్తుంటే అందులో "యమహా నగరి" పాట గురించి మణిశర్మ చెప్పారు - ఆ పాట ని ముందుగా రెండు చరణాలు గానే రాసారనీ, రికార్డింగ్ అవుతూ ఉంటె వేటూరి గారు అప్పటికి అప్పుడు కూర్చొని ఇంకో చరణం రాసి ఇచ్చారు అని. అది గుర్తు ఉంచుకొని ఆ పాట మళ్ళీ వింటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందు రెండు చరణాలలో విషయం ఏమాత్రం తగలకుండా పూర్తిగా మరో చరణాన్ని అలా ఎలా రాయగాలిగారా అని. ఆయన ప్రతీ పాటలోనూ కూడా ఒక పాటకి మించి విషయం ఉంటుంది. అందుకే నేమో - చెప్పదలచుకొన్నది అంతా మధ్యలో ఖాళీలు లేకుండా చక్కగా కూర్చి చెప్పేస్తారు. "భావగర్భితం" అనే మాటకి ఆయన పాటలు సజీవ ఉదాహరణలు. అర్ధం చేసుకున్న వారికి అర్ధం చేసుకున్నంత.. కొన్ని పాటలైతే విన్న ప్రతీ సారీ కొత్త అర్ధాలు స్ఫురింపజేస్తూ ఉంటాయి.
వారు లేకపోయినా వారి పాటలన్నీ మనతోనే ఉన్నాయి.. "కనీసం ఇంకో ఐదేళ్లైనా జీవించి ఉంటే వారి మరిన్ని పాటలని వినే అదృష్టం మనకి కలిగేదేమో" అని అనుకోవడం సహజం. కాని ఇప్పటికే మన దగ్గర ఉన్న వారి కవిత్వాన్ని ఆస్వాదిస్తూ వారిని తలుచుకొంటూ ఉండడం వారికి మనం సమర్పించగలిగిన అసలైన నివాళి, అదే ఆయన ఆత్మకు శాంతి.
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago