మాకైతే ఇప్పుడే జ్ఞానోదయం అయిందేమో తెలియదు మరి, చాలా మందికి ఇప్పటికే తెలిస్తే మాకు ఇప్పటికైనా తెలిసినందుకు (, లేకపోతె అందరికీ తెలియజేసే అవకాశం మాకు వచ్చినందుకు) సంతోషిస్తూ ఈ పోష్టేస్తున్నా.
ఇండియా లో మన అందరి ఇళ్ళలో అట్లు వెయ్యాలి అంటే ప్రత్యేకం గా అట్ల పెనం ఉంటుంది కదా.. నిఖార్సైన ఇనుముతో, చక్కటి నగిషి (స్మూత్ సర్ఫేసు అన్నమాట) తో, చిన్న దొన్నె లా మధ్యలో కొంచెం కిందకి వంచబడిన పోత తో. దానిని చక్కగా ఇటక పొడి పెట్టి తోమి, వేడెక్కించి, ఒక అర చెంచాడు నూనె జల్లి దానిమీద దోసో, మజ్జిగ అట్టో వేసుకుంటే మరి పండగే. ఐతే, అమెరికా లో ఇలాంటివి చెయ్యాలి అంటే కరెంటు తో నడిచే నాన్ స్టిక్ పెనాలు దొరుకుతాయి. ఐతే, ఇనప పెనం మీద అట్టు వేసుకోవడానికి అలవాటు పడిన ప్రాణం దాని మీద వేసుకున్న అట్టు తింటేనే లేచి వస్తుంది (ముఖ్యం గా మజ్జిగ అట్టు). ఎవరో చెప్పగా విన్నాను - మన మెదడుకి కావాల్సి వచ్చే ఇనుము, ఈ అట్టు పెనం తయారు చేసే ఇనుము ఒకటే అని, ప్రతీ అట్టులోను కొన్ని ఇనుము రేణువులు ఈ రూపేణా మింగేస్తే మనకి కావాల్సిన ఇనుము అదే వచ్చేస్తుంది అనీను (సిటేషన్ నీడెడ్డు). ఆ మాట ఎలా ఉన్నా, మందపాటి ఇనుప పేనాలు వేడిని ఎక్కువ దాచుకుంటాయి కాబట్టి, మొదటిసారి వేడి ఎక్కడానికి ఒక నిముషం ఎక్కువ పట్టినా, ఒకసారి మొదలు అయితే కార్లు తయారు చేసే అసెంబ్లీ లైను లాగ, వేసేది వేస్తుంటే తీసేది తీసేస్తూ ఉండొచ్చు. చాలా రోజుల నుంచి చూస్తున్నా కూడా "అది మన అట్లకి పనికి రాదేమోలే" అని అనుకుంటూ తాత్సారం చేసి, మొత్తానికి మొన్న ఈ పెనాన్ని వాల్మార్ట్ నుంచి కొనుక్కొచ్చాము. అసలు ఫీచర్ ఇనప బాడీ తో బాటు, కొసరు ఫీచర్ నాన్ స్టిక్ కూడా ఉంది కాబట్టి, మొదట్లో కొంచెం పాం (కుకింగ్ స్ప్రే) చల్లేసి కాగితం తో సర్దేస్తే, పది - పదిహేను అట్ల వరకూ మళ్ళీ నూనె కూడా తగిలించక్కర్లేకుండా చక చకా వేసి అవతల పారేస్తోంది.
ఇప్పటి వరకు చాలా హ్యాపీ ఈ పెనం తో. వాల్మార్ట్ లోనే కొనక్కర్లేదు కాని, ఇది ఒకటి ఉంది అని చెప్పడం దీని ఉద్దేశ్యం. మరి ప్రయత్నించండి.
కేతు… తలపులలో! – స్మృతి సంచిక
1 week ago