"అగులు" చెయ్యడం
మనలో చాలా మందికి చిన్నప్పటి ఫోటోలలో ఒకటి కామన్ గా ఉంటుంది. అది - అబ్బాయైనా, అమ్మాయైనా, పాలుగారే పసిమోము మీద కనుబొమ్మల మధ్యలో పెట్టే నల్లటి అగులుచుక్క. దానిని మరి అందరూ అగులు అంటారో లేదో తెలియదు కాని, తూ గో లో మాత్రం అంటారని తెలుసు. పేరు ఏదైనా, అందాలొలికే ముద్దుల పాప మీద నుంచి దృష్టి మరల్చడానికి కొందరు, అలంకారం కింద కొందరూ, రెంటికిందా మరి కొందరు పిల్లలకి చుక్కపెడతారు. ఇప్పుడు కొంతమంది దానిమీద (చర్మానికి పడదు అనే) సందేహంతోనో, అగులు దొరక్కో, అది చెయ్యడం తెలియకో బొట్టుబిళ్ళలు, తిలకం వంటివి పెడుతున్నారు. సహజసిద్ధంగా తయారుచేసే అగులు చేసే హాని ఏమీ లేకపోగా, ఈ కెమికల్స్ తో చేసిన జిగుర్లు, తిలకాలు చర్మానికి చేటుచేస్తాయి. అందుకని అగులు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాము. కావలసిన వస్తువులు: సగ్గుబియ్యం, మూకుడు (స్టైల్ గా "బాండీ"), అగ్గిపెట్టె, నీళ్ళు, టీ వడకొట్టుకునే చిక్కం (మెత్తటి (ఫైన్) జల్లెడ కూడా వాడవచ్చు). ముందుగా కొంచెం సగ్గుబియ్యం తీసుకొని, దానిని మూకుట్లో వేసి, చిన్న సెగమీద కలుపుతూ వేయించాలి. అది నల్లగా అయే వరకూ వేయించి, మూకుడుకి అంటుకుపోతుంది అనిపించే ముందు పొయ్యిమీదనుంచి దించాలి. ఆ త...