(ఇది వ్రాసి చాలా రోజులు అయిపొయింది కానీ, అభిప్రాయం మాత్రం మారలేదు).
వీకెండ్ లో బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమా చూసాము. EVV సమర్పించేసుకున్నాడు అని తెలియగానే కొంచెం ఖంగారు పడిన మాట వాస్తవమే కాని, ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ లేకుండా మేమిద్దరమే చూడడం వల్ల ప్రమాదం ఏమి లేదు అని సమాధానపడి కూర్చున్నాము. సినిమాని కొంచెం నెమ్మదిగా మొదలు పెట్టినా, మధ్య మధ్యలో కొంచెం బోర్ కొడుతోందేమో అని అన్పించినా, మొత్తానికి కామెడీతో చాల బాగా నెట్టుకొని వచ్చేసాడు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. అల్లరి నరేష్ శ్రీరామదాసు పేరడీ కొంచెం తగ్గించినా పెద్ద ప్రాబ్లం ఏమి అయి వుండేది కాదు. కొంచెం శ్రుతి మించుతోంది అనిపించగానే అది వదిలేసి కధలోకి వచ్చాడు. కృష్ణ భగవాన్ ఎప్పటిలాగే సంభాషణల రచయిత బలం మీద నెగ్గుకొని వచ్చేసాడు. ఐతే, కొన్ని పంచ్ లు ముందుగా వ్రాస్తారో లేక కృష్ణ భగవాన్ అప్పటికప్పుడు పుట్టిస్తాడో తెలియదు గాని, చెవులు రిక్కించి వింటే తప్ప వినపడని పంచులు చాల వాడేడు సినిమాలో. కోవై సరళ ఓవర్ ఆక్షన్ చెయ్యకుండా భరణి successful గా అడ్డు పడ్డాడు అనే చెప్పాలి. సినిమా చివర్లో మాత్రం ఆవిడ కామెడీ బాగా చేసింది. రెగ్యులర్ కమెడియన్ లు (బ్రహ్మ, సునీల్, MS etc) లు లేకుండా సినిమా మొత్తాన్ని బాగానే నడిపించారు. మామూలు పద్ధతి లో కాకుండా, చేతిని తిరగేసి ఇతరుల చెవుల్లో రహస్యాలు చెప్పే తనికెళ్ళ మేనరిజం బాగుంది. నరేష్ హీరోయిన్ ఫర్హానా కొంచెం బొద్దుగా వున్నా పరవాలేదన్నట్టు వుంటే, కృష్ణ భగవాన్ హీరోయిన్ మాత్రం మరీ అతనికి తగ్గట్టు గానే కొంచెం భారీ గా వుంది. శ్రీలేఖ సంగీతం ఎప్పటిలాగే ఎక్కడో విన్నట్టు వున్నా, ఒక్క పాట మాత్రం మంచి బీట్ తో సాగింది. ఆ పాటలో స్వతహాగా dancer అయిన ఫర్హానా స్టెప్ లు అదరగొట్టి నరేష్ ని తేలిపోయేలా చేసింది.ఎప్పుడూ క్లాసు సినిమాలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ఒకటి రెండు పడుతూ వుంటే, మనలోని "హాస్యపు ఎముక" కి కితకితలు పెట్టడానికి పనికొస్తూ వుంటాయి :)
అన్నీ సరదా పాత్రలే తప్ప, నెగటివ్ పాత్రలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్ గా చెప్పచ్చు.