Tuesday, December 27, 2011

మంచి మనిషి.

ఇంజనీరింగ్ అయిన వెంటనే ఏమి చెయ్యాలా అన్న విషయం ఇంజనీరింగ్ చేస్తున్నన్నాళ్ళూ పెద్దగా ఏమి అనుకోలేదు. అందరూ గేటు రాస్తున్నారంటే నేను కూడా రాసా.. ఏదో జరిగి మార్కులూ బాగానే పడ్డాయి - ఐ ఐ టీ మిస్ అయి మద్రాస్ లో అన్నా యూనివర్సిటీ లో చేరాను కంట్రోల్ సిస్టమ్స్ లో. అసలే ఇంటి బయట ఉండడం మొదటి సారి, మన భాష/ఊరు కాని ప్రదేశం, ముఖ్యం గా ముందు గా తెలిసి ఉన్న స్నేహితులు లేకపోవడం (అందుకే తరవాత ఇంకా ఎక్కువ దూరం అయిన అమెరికా వచ్చినా కూడా ఇక్కడ అప్పటికే తెలిసిన స్నేహితులు ఉండడం తో అస్సలు ఇబ్బంది లేకుండా కలిసిపోయాను), నన్ను అక్కడ ఉండనివ్వలేదు. దానికి తోడు చీకటి గుయ్యారాల లాంటి హాస్టల్ రూములు, రోజుకొకసారి కనిపించే ఈనాడు పేపర్, రుచీ పచీ లేని హాస్టల్ భోజనం - మనకి ఒకటి నచ్చక పొతే అన్నీ భూతద్దాలలోంచి కనిపిస్తాయి కదా - మొత్తానికి ఈ కాలేజీ మనకోసం కాదు అన్న విషయం నిర్ణయం అయిపొయింది. దానికి తోడు, అక్కడ చేరిన ఒక వారం రోజులకి విశాఖపట్నం గీతం లో నాతో చదివిన స్నేహితుడు అమెరికా వీసా కి రావడం, అతని ద్వారా జీ ఆర్ ఈ కి ఎలా తయారవాలి తదితర విషయాలు తెలుసుకోవడం వల్ల అమెరికా పురుగు గట్టిగా కుట్టింది. మనం ఏదైనా పని చెయ్యడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా ఆ చివరి తోపు ఒకటి రావాలి - అంటే, మన నిర్ణయాన్ని ఎవరో ఒకరు సమర్ధించాలి అన్నమాట. ఆ తోపు నా విషయం లో ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రూపం లో వచ్చింది. "నీకు అక్కడ నచ్చకపోతే పరవాలేదు నాన్న.. వచ్చెయ్యి" అని అమ్మ నుంచి ఉత్తరం. ఇంకేముంది, చేరిన ముఫ్ఫైయ్యవ రోజు తిరిగి వెళ్ళడానికి ముహూర్తం పెట్టాను. అయితే అప్పటికే కాలేజీ లో వివిధ విభాగాలలో మనం కట్టిన ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్లు, టీ సీ తీసుకోవానికి క్లియరన్సులు అవన్నీ చెయ్యాలి. సమయం ఎక్కువ లేదు. అన్ని పనులూ అయిపోతున్నాయి కాని, డిపార్ట్మెంట్ క్లియరన్సు మాత్రం హెడ్ గారు ఇవ్వాలి - అది అవడం లేదు - ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగోక ఇంట్లో ఉన్నారు అని చెప్పారు. ఆయన పేరు డాక్టర్ సంబంధం. బక్క పల్చగా, అడ్డ బొట్టు తో, ఒక యాభై అరవై మధ్య వయసులో ఉండేవారు. "సమయానికి ఇలా అయిందేమిటి" అనుకుంటుంటే అటెండర్ చెప్పాడు - "మీరు వెనక్కి వెళ్ళిపోయి సార్ ఆరోగ్యం బాగు అయ్యాక రావచ్చు, అప్పుడైనా మీ టీ సీ తీసుకొని వెళ్ళొచ్చు" అని. మనం లోకల్ అయితే అది మంచి ప్లానే కాని, ఎక్కడో వైజాగ్ వెళ్లి మళ్ళీ తిరిగి మద్రాస్ రావడం తప్పని సరి ఐతే తప్ప చేయలేము. ఏమి చెయ్యాలిరా అనుకుంటూ ఉండగా ఆలోచన వచ్చింది - "ఆయన ఇంటికి వెళ్లి పరిస్థితి వివరించి రిక్వెస్ట్ చేస్తే?" అని. అటెండర్ ని చిరునామా కనుక్కొని వారి ఇంటికి వెళ్లాను. వారి అమ్మాయి అనుకుంటాను చెప్పింది - "ఆయన కి వంట్లో బాగాలేదు, హాస్పిటల్ కి వెళ్ళారు, ఫలానా వ్యక్తి వచ్చి వెళ్ళారు అని చెబుతాను" అని. "ఇది ఇంక అయ్యే పని కాదు - విశ్రాంతి తీసుకుంటున్నారేమో ఒక సారి వచ్చి నా పని చూసి వెళ్ళమని అడుగుదాము అనుకున్నాను కాని, ఇక్కడ విషయం చూస్తే సరిగా లేదు" అని. ఊసురోమని మళ్ళీ హాస్టల్ కి వచ్చి పడ్డాను. మరుసటి రోజు పొద్దున్న డిపార్టుమెంటు దగ్గర కి వెడుతుంటే ఆటో లోంచి దిగుతూ సంబంధం గారు కనిపించారు. నీరసం గా, ఒక చేత కర్ర సాయం తో అడుగులు వేస్తూ, అటెండర్ చేయి పట్టుకొని మెట్లు ఎక్కుతూ. రూం లో కి వెళ్లి నన్ను పిలిపించారు. ఎప్పుడు వెడుతున్నాను ఏమిటి అని అడుగుతూ ఆయన సంతకం చెయ్యాల్సిన కాగితాలన్నీ నింపి సంతకం చేస్తున్న ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయాను. "హౌ ఈస్ యువర్ హెల్త్" అని అడగడానికి కూడా నోట మాట రాలేదు. కళ్ళలో నీళ్ళు మాత్రం తెలియకుండా వచ్చేసాయి. వంగి పాదాలకి నమస్కారం మాత్రం చేయగలిగాను. "అల్ ది బెస్ట్" అన్నారు. పని అవగానే మళ్ళీ అటెండర్ సాయం తో అదే ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తరవాత నేను అనుకున్న ప్రకారం ఇంటికి వచ్చేశాను. "మళ్ళీ రమ్మను", "నీకు సాయం చేస్తే నాకేమిటి", "నేనివాళ ఏ పని చేయదలచుకోలేదు" అనే మనుషులు విరివిగా కనిపించే లోకం లో ఇలాంటి వాళ్ళు తారసపడడం నా అదృష్టం అనిపిస్తుంది. వెళ్లి మళ్ళీ రమ్మంటే తప్పని సరై వైజాగ్ వెళ్లి మళ్ళీ వచ్చే వాడినేమో కాని, ఆయన ఈ సహాయం చెయ్యడం ద్వారా "going the extra mile" అంటే ఏమిటో ఆచరణలో చూపించారు. నాచేత "there's gotta be a way" అని నమ్మించారు.