Monday, May 18, 2009

"సత్తా" చూపాలి.

ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడినా, లోక్సత్తా నుండి జయప్రకాశ్ నారాయణ్ గారు గెలవడం నాకు చాల సంతోషం కలిగించింది. రాజకీయాలంటే మురికి కూపాలని, రాజకీయ నాయకులంటే (సినిమాలలో చూపించినట్టు హత్యలు, నేరాలు చేస్తూ బ్రతికే) క్రిమినల్స్ తప్ప వేరెవ్వరూ కాదనే జనాల నమ్మకం విశ్వాసం గా మారడానికి ఇంకెంతో దూరం లేదనిపిస్తున్న ఈ కాలం లో, రాజకీయాల్లోకి చదువుకున్నవాళ్ళు/సత్చరిత్రులు కూడా రావాలని, వస్తే ఎలా ఉంటుందో చూపించాలని, వచ్చి వ్యవస్థ ని మార్చడానికి ప్రయత్నించాలని, వాళ్ళు అది చెయ్యడం చూడాలని నాకెప్పటి నుంచో కోరిక. అలా అనుకోవడమే తప్ప, ఆ మొదటి అడుగు వెయ్యలేకే, నాలాంటి వాళ్ళు వేలమంది ఎదురు చూడడం తప్ప వేరే ఏమి చెయ్యకపోవడం వల్ల ఇవాళ మనం ఈ స్థితి లో ఉన్నాము - అది వేరే విషయం అనుకోండి. ఐతే ఒక సారి ఇటువంటి మార్పు రావడం మొదలు పెడితే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఆయన ఒక దారి చూపించాడు కాబట్టి, అది మరీ చెయ్యకూడని పని కాదనీ, కొంతమందికే (డబ్బు, దన్ను ఉన్న వాళ్ళకే) పరిమితం కాదనీ వేలమంది ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఆయన ఎన్నిక కావడం అనేది, సొంతం గా ఆయనకి ఎంత ఉపయోగిస్తుందో ("ఉపయోగం" అంటే, మిగిలిన రాజకీయనాయకులకి ఉపయోగించినట్టు కాదు) తెలియదు కానీ, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మార్పులు తప్పక తీసుకొని వస్తుందని నా నమ్మకం.మిగిలిన మూర్ఖ శిఖామణులు ఆయన్ని అసెంబ్లీ లో మాట్లాడనిస్తారనీ, మాట్లాడింది అర్ధం చేసుకొని మంచి పాలన ని అందిస్తారనీ, రాబోయే రోజుల్లో లోక్ సత్తా రాజకీయాల్లో తన ఉనికిని మరింత బలంగా చాటుతుందనీ నా ఆశ.Go JP!!.